YSRCP Leaders Irregularities : అప్పుల్లో మునిగినోడు అపర కుబేరుడయ్యాడని అంటుంటారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఓ వైసీపీ ప్రజాప్రతినిధి ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నారు. ఐతే ఈయనదంతా అవినీతి సంపాదనే. నియోజకవర్గంలోని ఒక మున్సిపాలిటీని ఈ ప్రజాప్రతినిధి ఒక ఏటీఎంలా వాడేసుకుంటున్నారు. మున్సిపాలిటీ చెక్కుబుక్ ఆయన భార్య వద్దే ఉంటుందని పురపాలిక సిబ్బంది చెబుతున్నారు. నిధులు అవసరమైనప్పుడు నాయకుడి ఇంటికి వెళ్లి చెక్కుపై సంతకం చేసి రావడం తప్ప కమిషనర్‌కు మరే అధికారమూ లేదని వాపోతున్నారు.
పట్టణంలో తాగునీటి సరఫరాకు తగిన వ్యవస్థ ఉన్నప్పటికీ ప్రతినెలా మరమ్మతుల పేరిట నిధులు దిగమింగుతున్నారు. ఇంటి నిర్మాణానికి పట్టణ ప్రణాళిక విభాగం అనుమతి పొందాలంటే కప్పం కట్టాల్సిందే. తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికుల జాబితాలో పదుల సంఖ్యలో దొంగ పేర్లు చేర్చి ఒక్కొక్కరిపైనా నెలకు 10 వేల చొప్పున స్వాహా చేస్తున్నారు. తన నియోజకవర్గ కేంద్రంలోని ఓ రోడ్డులో డివైడర్‌పై పచ్చదనం పెంపు బాధ్యతలను స్థానిక విద్యాసంస్థలకు అప్పగించారు.
అక్కడ దాతలు మూడుసార్లు మొక్కలు నాటి కంచె వేయించారు. వీటికైన ఖర్చుకు బిల్లు పెట్టి మున్సిపాలిటీ నుంచి డబ్బులు కాజేసిన ఘనుడు ఈ ప్రజాప్రతినిధి. దాతల నుంచి విరాళాలు సేకరించి తన తండ్రి స్మారకంగా ఎద్దుల పోటీలు నిర్వహించారు. ఆ ఖర్చును కూడా మున్సిపాలిటీకే బిల్లు పెట్టించారు. అందుకు నిబంధనలు అంగీకరించబోవన్న కమిషనర్‌ను ముప్పుతిప్పలు పెట్టారు. దాంతో ఆయన సెలవులో వెళ్లిపోయారు. ఈ ప్రజాప్రతినిధి చెప్పినట్లు నడుచుకోలేక ఇప్పటికే ఐదుగురు కమిషనర్లు సొంతంగా బదిలీ చేయించుకున్నారంటే ఆయన వేధింపులు ఎంతలా ఉంటాయో అంచనా వేయవచ్చు.
ఎన్నికల ముంగిట జగనన్న రివర్స్ గేర్- అస్మదీయులకు 'రిజిస్ట్రేషన్' గిఫ్ట్?
కప్పం కట్టాల్సిందే : ఈ ప్రజాప్రతినిధి నియోజకవర్గం పరిధిలోని రియల్టర్లు ఐదేళ్లలో సుమారు 2,500 ఎకరాల్లో వెంచర్లు వేశారు. అది ఆయనకు సువర్ణావకాశంగా మారింది. ఒక ఎకరా ల్యాండ్ కన్వర్షన్‌కు 5లక్షలు, లేఅవుట్లు వేసిన ప్రాంతాలను బట్టి ఒక్కోదాంట్లో 15 నుంచి 25 సెంట్ల వరకు భూమిని ముక్కుపిండి వసూలు చేశారు. తమపై అదనంగా పడిన ఈ భారాన్ని రియల్టర్లు వినియోగదారులపైనే మోపారు. తెలుగుదేశం సానుభూతిపరులు ఓ మండలంలోని 20 ఎకరాల్లో వెంచర్ వేశారు.
రోడ్డు పక్కనున్న నాలుగెకరాలను తనకివ్వాలని ప్రజాప్రతినిధి ఆదేశించగా వారు 2.5 ఎకరాలు ఇస్తామన్నా ఒప్పుకోలేదు. చివరికి మొత్తం వెంచర్‌ను వైసీపీ నేతలకే అమ్మేశారు. బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తే వాటిలో ఒక్కో ఫ్లాట్‌కు రూ. 40 వేల చొప్పున కప్పం కట్టాల్సిందే. ఒకవేళ బిల్డర్లు వైసీపీ వారైతే 25 నుంచి 30 వేలు తీసుకుంటారు. ఈ వసూళ్ల లెక్కలన్నీ ఓ డాక్యుమెంట్ రైటర్ చూసుకుంటారు. జిల్లాల పునర్విభజనతో ఈ నియోజకవర్గంలో భూముల విలువ పెరిగింది. నిషేధిత జాబితా 22ఏ లో ఉన్న భూముల యజమానులకు తక్కువ ధరకు బయానా ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నారు.
తర్వాత వాటిని జాబితా నుంచి తొలగింపజేసి ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు. యజమానుల నుంచే నేరుగా కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. ఇలా కోట్ల పంట పండించుకున్నారు. ఒక గ్రామంలో ఎస్సీల ఎసైన్డ్ భూములను తక్కువ ధరకు తీసుకుని తర్వాత సెంటు 3లక్షల రూపాయల చొప్పున అమ్మేశారు. సొంత పార్టీకి చెందిన ముస్లిం నేత భూమిని తక్కువ ధరకు కొని అందులోనే వెంచర్లు వేసి రూ. కోట్లు గడించారు. మరో గ్రామ సమీపంలో 100 ఎకరాల్లో వేసిన వెంచర్‌లో వాగు పోరంబోకునూ కలిపి అమ్మేశారు. దేవాదాయ శాఖకు చెందిన 4.5 ఎకరాలను స్వాహా చేశారు.
కూటమి అధికారంలోకి రాగానే నెలకు రూ.4 వేల పింఛన్: చంద్రబాబు - Chandrababu Tour in Kuppam
బెదిరింపులు ఆపై కేసులు : నాలుగు కోట్ల విలువైన తన భూమిని ప్రజాప్రతినిధి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని, తనను రక్షించాలని వైసీపీ కార్యకర్త ఒకరు సెల్ఫీ వీడియో తీసి బయటపెట్టడం సంచలనమైంది. కాకాని శివారులో వేసిన వెంచర్‌లో అయిదెకరాల ప్రభుత్వ భూమి ఉందని ఒక వ్యక్తి ఆధారాలతో సహా కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. దాన్ని వెనక్కి తీసుకోవాలని వైసీపీ నేతలు అతన్ని బెదిరించినా వినకపోవడంతో ఎట్రాసిటీ కేసు పెట్టించారు.
ఓ గ్రామానికి చెందిన వ్యక్తి రూ. 2.5 కోట్ల విలువైన తన భూమిపై ఉన్న వివాదాన్ని ఒక ఎంపీ సాయంతో పరిష్కరించుకున్నారు. ఎంపీ పరిష్కరించినా సరే తమకు రూ. 16 లక్షలు చెల్లించాలంటూ ప్రజాప్రతినిధి అనుచరులు అతన్ని వేధించారు. అతడి తల్లిని వాళ్లింట్లోనే బంధించారు. ఈ ఆగడాలపై బాధితుడు ఉన్నతాధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా స్పందన రాలేదు. చివరకు ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకుని ఒంటిమీద పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు.
పనులు చేయకుండానే : నియోజవర్గ పరిధిలోని ప్రఖ్యాత త్రికోటీశ్వర ఆలయంలో తిరునాళ్ల నిర్వహణకు లక్షల రూపాయలు కేటాయించడం, పనులు చేయకుండానే చెక్కులు రాయించుకోవడం ఆయనకు పరిపాటిగా మారింది. చేసే ప్రతి పనిలోనూ 12 శాతం పుచ్చుకుంటారు. కొండ వద్ద వెంట్రుకల సేకరణకు బహిరంగ వేలం లేకుండా చేశారు. దుకాణాల వేలంలోనూ సొంత జేబులు నిండాల్సిందే. కొండ చుట్టూ వైసీపీ నేత ఒకరు మట్టి తవ్వకాలు సాగిస్తూ గుట్కా వ్యాపారం చేసుకుంటున్నారు. వచ్చే ఆదాయంలో ఈ ప్రజాప్రతినిధికి ముడుపులు సమర్పిస్తున్నారు. పాతకోటయ్య గుడి వరకు మెట్లమార్గం వేయటానికంటూ భక్తుల నుంచి కోటి రూపాయల వరకు సమీకరించారు. ఏడాది దాటినా పనుల ఊసేలేదు.
నియోజకవర్గంలో వైసీపీ వ్యక్తులు మినహా ఇతరులెవరూ మద్యం వ్యాపారం చేయడానికి వీల్లేదని ఈయన నిబంధన విధించారు. తన అనుచరులకే బార్లు దక్కేలా చూశారు. వాటికి లాభాలు రావడానికి వీలుగా ప్రభుత్వ మద్యం దుకాణాలను పట్టణం బయట ఏర్పాటు చేయించారు. ప్రతిగా 17 బార్ల నుంచి నెలకు రూ.30 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. ఇటీవల స్టేషన్‌రోడ్డులోని ఒక బార్ యజమాని నెల మామూళ్లు ఇవ్వలేదని దాడులు చేయించి రెండు రోజులపాటు బార్‌ను మూయించారు.
దోపిడీలో నేత టీమ్ : ఈ నియోజకవర్గ కేంద్రం నుంచే పల్నాడు జిల్లాలోని అన్ని పట్టణాలకు గంజాయి సరఫరా అవుతోంది. స్థానికంగానూ కొందరు గంజాయి తాగి డబ్బులు కోసం ద్విచక్ర వాహనదారులను అడ్డగించి బెదిరిస్తున్నారు. మహిళల మెడలో గొలుసులను, ప్రయాణికుల వద్ద సెల్‌ఫోన్లను లాక్కెళుతున్నారు. ప్రజాప్రతినిధి ఒత్తిడితో వీరిపై కేసులు లేకుండానే పోలీసులు వదిలేస్తున్నారు. ఎప్పుడూ ప్రజాప్రతినిధిలోనే తిరిగే ఓ వ్యక్తి రేషన్ బియ్యం సేకరించి వినుకొండ రోడ్డులోని ఒక మిల్లులో రీసైక్లింగ్ చేస్తున్నారు. నెలవారీగా రూ.లక్షల్లో కమీషన్ ఇస్తుండటంతో ఆ వ్యక్తిని ప్రజాప్రతినిధి రక్షిస్తూ వస్తున్నారు.
గుట్కా, మట్కా, బార్ రెస్టారెంట్లు, రియల్‌ఎస్టేట్‌లలో కమీషన్ల వసూలుకు ఈయన వద్ద ఓ బృందముంది. పట్టణంలో ఎవరైనా ఐపీ పెట్టాలనుకున్నప్పుడు ఈ ప్రజాప్రతినిధిని ఆశ్రయిస్తుంటారు. రూ.50 లక్షలకు తగ్గకుండా ముడుపులిస్తే చాలు పోలీసుస్టేషన్‌లు, కోర్టుల్లోని అన్ని పనులను చూసుకుంటారు. అవసరమైతే వారిని రాష్ట్రం, దేశం దాటిస్తారు. ఇలా ఇప్పటికే పదిమంది వరకు వ్యాపారులను రక్షించారు. ఈ నియోజకజవర్గం నకిలీ మందులు, వాటి తయారీకి చిరునామాగా మారింది. ఇళ్లలోనే ఈ మందులను తయారు చేస్తున్నారు. వీటిపై అధికారులు దాడులు చేయకుండా ఈ ప్రజాప్రతినిధి సతీమణి చూసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో నెలకు 40 లక్షల నుంచి 50 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లు సమాచారం.
హథీరాం భూముల ఆక్రమణలో కీలక నేత - సాక్ష్యాలు సేకరిస్తున్న వారిపై దాడి - HATHIRAMJI MUTT RESPONSE