YSRCP Leader Irregularities in West Godavari: పశ్చిమ గోదావరి చివర్లో ఉన్న ఈ నియోజకవర్గ కేంద్రానికి బ్రిటిష్ హయాంలోనే ఎంతో పేరు ఉంది. అలాంటి చోట ప్రజాప్రతినిధిగా ఎన్నికైన ఆయన, ఉభయగోదావరి జిల్లాల ఇసుక ర్యాంపులన్నీ తన గుప్పిట్లో పెట్టుకున్నారు. చేసే అక్రమాలన్నీ అధికారికంగానే కనిపించినా ఆయనకు లబ్ధి పరోక్షంగా దక్కుతుంది. ప్రతి నిర్ణయంలోనూ సొంత సామాజికవర్గ ప్రయోజనాలు ఉండేలా చూడడంలో ఈయన దిట్ట.
లారీల్లో ఇతర రాష్ట్రాలకు తరలించి: వైసీపీ సర్కారు ఏర్పడిన కొత్తలోనే ఈ ఎమ్మెల్యే ఇసుకాసురుడి అవతారం ఎత్తారు. పార్టీలోని ఒక కీలక నాయకుడి అండదండలు పుష్కలంగా ఉండటంతో రెచ్చిపోయారు. నియోజకవర్గంతో పాటు జిల్లాలోని అన్ని ర్యాంపుల్లో సొంత మనుషులను పెట్టుకుని రెండేళ్ల పాటు దందా కొనసాగించారు. రాష్ట్రంలో ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు, సామాన్యులు ఇబ్బందులు పడుతున్న సమయంలో, ఈయన మాత్రం నిత్యం వేలాది ట్రాక్టర్లు, లారీల్లో ఇతర రాష్ట్రాలకు తరలించి దండిగా డబ్బులు వెనకేసుకున్నారు. వైసీపీ పాలనలో ఇసుక దోపిడీ అంటే పెద్దల వాటా ఉండనే ఉంటుంది. అది పోనూ మిగతా మొత్తంతో కోట్లకు పడగలెత్తారు.
మట్టి తోలకం పేరుతో మరో దందా: జగనన్న లేఅవుట్‌లకు ఎంజీపాలెం వద్ద స్థలాల సేకరణ విషయం ముందే తెలుసుకొని, ఆ భూముల యజమానులతో అనధికారంగా కొనుగోలు ఒప్పందం చేసుకున్నారు. ఒప్పంద ధరకు మించి ఎకరానికి 10 లక్షలకు పైగా ఎక్కువ ధరకు ప్రభుత్వం కొనేలా వ్యవహారం నడిపారు. ఆ అదనపు సొమ్మంతా వెనకేసుకున్నారు. లేఅవుట్ చదును చేసేందుకు మట్టి తోలకం పేరుతో మరో దందా నడిపారు. తవ్విన మట్టిని ఇతరులకు పెద్ద మొత్తానికి అమ్మారు. లేఅవుట్లకు తక్కువ సరఫరా చేసి, ఎక్కువ లారీలు నమోదు చేశారు. అలా బిల్లులనూ స్వాహా చేసిన ఘనుడు.
150 ఎకరాలకు పైగా: రెండు జిల్లాలను కలిపే గోదావరిపై ఒక కీలక వంతెన, రహదారి విషయంలో అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి మార్గాన్ని అసైన్డు, డీ పట్టా, జిరాయితీ భూముల మీదుగా మళ్లించారు. ముందే తక్కువ మొత్తానికి ఆ భూములను తన బినామీల పేరిట సొంతం చేయించుకున్నారు. అధికారులపై ఒత్తిడి చేసి భూములను రెగ్యులర్ చేయించుకున్నారు. కొన్ని ప్రైవేటు భూములనూ అనుచరుల సాయంతో కొనుగోలు చేయించారు. మొత్తంగా దాదాపు 150 ఎకరాలకు పైగా దక్కించుకున్నారు. వంతెన రాకతో ఆ భూముల ధరలు పెరిగి భారీగా లబ్ధి పొందారు.
ఒక్కో ఆసుపత్రి నుంచి లక్షల్లో వసూలు: కొవిడ్ సమయంలోనూ దోపిడీ సాగించారు. పేదలకు నిత్యావసరాల పంపిణీ, అన్నదానం ముసుగులో భారీ దందాకు తెరతీశారు. నియోజకవర్గంలోని బడా వ్యాపారులు, దుకాణదారులు, ఇతర సంస్థలు, పారిశ్రామికవేత్తలు, ప్రవాసాంధ్రుల నుంచి భారీగా విరాళాలు వసూలు చేశారు. ఆ స్థాయిలో కార్యక్రమాలు చేయకుండా దోచుకున్నారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులతో ఒప్పందాలు చేసుకొని, వాటి అక్రమాలు బయటపడనీయకుండా అధికారులను కట్టడి చేశారు. ఒక్కో ఆసుపత్రి నుంచి లక్షల్లో వసూలు చేశారు.
బినామీ గుత్తేదారులే: ఇంటి నిర్మాణానికి నిబంధనలు పాటించినా ఈయన దందాకు మాత్రం తలొంచాల్సిందే. లేదంటే సరిగ్గా స్లాబు వేసే రోజు అధికారులను రంగంలోకి దింపి, నిబంధనల పేరుతో రగడ సృష్టిస్తారు. కూల్చేస్తామని భయపెడతారు. చిన్న ఇంటికి లక్ష, అపార్టుమెంట్‌కు 5 లక్షల వరకు సమర్పించుకోవాల్సిందే. ఏటిగట్టు వరదలకు జారిపోకుండా ఉండేందుకు 26 కోట్ల రూపాయల అంచనా విలువతో పనులు మంజూరు కాగా, ఈయన బినామీ గుత్తేదారులే ఆ పనులు చేశారు.
నాడు అప్పులతో సతమతం - నేడు సిరులతో కళ కళ! - YSRCP Leader Irregularities
వేలం లేకుండానే పంటు నిర్వహించి: కరకట్ట ఇంతవరకు అయిదుసార్లు జారిపోయిందంటే పనుల్లో చూపిన నాణ్యత ఏపాటిదో అర్థమవుతుంది. ఉభయగోదావరి జిల్లాల మధ్యలోని గోదావరి నదిపై పంటు ఉంటుంది. నిత్యం వేల మంది రాకపోకలు సాగించే ఈ పంటుకు వేలం పాట నిర్వహిస్తారు. పాట లేని రోజుల్లో ఆ సొమ్ము ప్రభుత్వానికి చెల్లిస్తారు. అయితే దాదాపు ఏడాది పాటు వేలం లేకుండానే పంటు నిర్వహించి, ఆ సొమ్ములో కొంత మింగేశారు.
పోలీస్‌స్టేషన్‌లోనే పంచాయితీలు: పోలీసులు ఏదైనా కేసు నమోదు చేయాలంటే ఉన్నతాధికారుల కన్నా ముందు ఈ ప్రజాప్రతినిధి అనుమతి తీసుకుంటారు. వైసీపీ నాయకులు, కార్యకర్తల అరాచకాలపై కేసులుండవు. కొంత కాలం కిందట ఈయనకు ఓ ఎస్సై అనుంగు శిష్యుడిలా ఉండేవారు. పోలీస్‌స్టేషన్‌లోనే పంచాయితీలు చేసేవారు. అలా కొద్దిరోజుల్లోనే భారీగా దోపిడీకి పాల్పడ్డారు.
పైకి నీతిమంతుడిలా మాటలు - మూడోకంటికి తెలియకుండా అక్రమ దందాలు - YSRCP Leader Irregularities