YS Bharti PA Warra Ravinder Reddy Land Grabbing: జగన్ అనుచరులు చేసిన అక్రమాలు ఒక్కటి ఒక్కటిగా వెలుగు చూస్తున్నాయి. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండలంలో జగన్ సతీమణి భారతి పీఏ వర్రా రవీంద్రారెడ్డి నల్లచెరువు మండలం ఆల్లుగుండు గ్రామంలో సర్వేనెంబర్ 183-2 0.92 ఎకరాల భూమిని కాజేసేందుకు ప్రయత్నించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. గంగులమ్మ పేరిట ఉన్న ఈ భూమిని ఆమె కుమార్తె అంజినమ్మ మదనపల్లెకి చెందిన వెంకటరమణారెడ్డికి 2006లో విక్రయించారు. ఇదే భూమిని గంగులమ్మ 2008లో మనమరాలు సులోచనకు దానవిక్రయం చేశారు.
అంతకుముందే అంజినమ్మ వద్ద భూమి కొన్న వెంకట రమణారెడ్డి పట్టాదారు పాసుపుస్తకాల కోసం ఆలస్యంగా దరఖాస్తు చేసుకున్నారు. ఆ భూమిపై తనకు హక్కు ఉందని సులోచన కోర్టును ఆశ్రయించారు. కోర్టు వెంకటరమణారెడ్డికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ఆ భూమిపై వర్రా రవీంద్రరెడ్డి కన్నేశారు. సులోచన నుంచి భూమిని తన పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. గతేడాది ఏప్రిల్‌లో పట్టాదారు పాసుపుస్తకాల కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. పట్టాదారు పాసుపుస్తకం కోసం రెవెన్యూ సిబ్బందిని బెదిరించే ప్రయత్నం చేసినట్లు సమాచారం.
పట్టాదారు పాసుపుస్తకం చేయాలంటూ వరా రవీంద్రారెడ్డి కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిఫార్సుతో రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సిఫారసుతో అప్పటి స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న వెంకట రమణారెడ్డి సైతం సిద్ధారెడ్డి వద్దకు వెళ్లి పరిస్థితిని వివరించినట్లు తెలిపారు. హక్కు కలిగినవారికే పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వాలని అధికారులకు ఎమ్మెల్యే సిద్థారెడ్డి సూచించారు.
తర్వాత రెవెన్యూ అధికారులు తనకు పట్టాదారు పాసుబుక్కులు ఇచ్చారని వెంకటరమణారెడ్డి తెలిపారు. కోట్లాది రూపాయల విలువైన భూమిని సొంతం చేసుకోవాలని భారతీ పీఏ పైరవీలు చర్చనీయాంశంగా మారాయి. ఒకే భూమిని ఇద్దరు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపైనా, అధికార దర్పంతో దౌర్జన్యంగా భూమిని సొంతం చేసుకునేందుకు ప్రయత్నించిన వైఎస్ భారతి పీఏపై చర్యలు తీసుకోవాలని కదిరి ప్రాంతవాసులు డిమాండ్ చేస్తున్నారు.
కోర్టు ఆదేశాలతోనే వైఎస్సార్సీపీ ఆఫీస్ కూల్చివేత- సీఆర్డీఏ - Demolition of YSRCP office