World Heart Day Celebrations in AP : ప్రపంచ హృదయ దినోత్సవ వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. గుండె సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రముఖ గుండె వైద్య నిపుణుల ఆధ్వర్యంలో పలు జిల్లాల్లో 2కే, 3కే, 5కే రన్ కార్యక్రమాన్ని చేపట్టారు. నెల్లూరులో ప్రముఖ కార్డియాలజిస్ట్ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో 3కే రన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ర్యాలీని ఎస్పీ కృష్ణకాంత్ జెండా ఊపి ప్రారంభించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే గుండె సమస్యలు తగ్గే అవకాశం ఉంటుదని వైద్యులు తెలిపారు. గుండె సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విజయవాడలో 5కే వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
శారీరక శ్రమతో గుండెకు ఆరోగ్యం : మంచి ఆహారం, వ్యాయామం జీవన శైలిలో అదొక అలవాటు మలుచుకోవాలని వైద్యులు సూచించారు. హృదయ సంబంధ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగివుండాలని వైద్యులు పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా వినుకొండలో ప్రపంచ హృదయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రముఖ గుండె వైద్య నిపుణుడు గార్లపాటి కృష్ణకాంత్ ఆధ్వర్యంలో 2కే నడక కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. శారీరక శ్రమ గుండెకు ఆరోగ్యమని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు.
గుండె భాష వినండి- ప్రమాదాన్ని ముందే పసిగట్టండి..
క్రమం తప్పకుండా వ్యాయామం : కర్నూలులో ప్రపంచ హృదయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కిమ్స్ ఆస్పత్రి వారి ఆధ్వర్యంలో గుండె వ్యాధిపై అవగాహన ర్యాలీ చేపట్టారు. కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ జెండా ఊపి ప్రారంభించారు. నగరంలో పలు ప్రాంతాల మీదుగా అవగాహన ర్యాలీ సాగింది. మంచి అలవాట్లతో ప్రతిఒక్కరూ ఆర్యోగంగా జీవించవచ్చని బిందుమాధవ్ తెలిపారు. మంచి ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే గుండె జబ్బులు దరిచేరవని వైద్యులు తెలిపారు. కార్యక్రమంలో యువతీ, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
5 కిలో మీటర్ల నడక కార్యక్రమం : పల్నాడు జిల్లా నరసరావుపేటలో ప్రపంచ హృదయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రముఖ గుండె వైద్య నిపుణుడు కారసాని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 5 కిలో మీటర్ల నడక కార్యక్రమం జరిగింది. కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ప్రారంభించారు. కోడెల స్టేడియం నుంచి పెద్ద చెరువు, పల్నాడు రోడ్డు, మల్లమ్మ సెంటర్ మీదుగా నడక కార్యక్రమం సాగింది. ప్రతిరోజు నడక గుండెకు ఆరోగ్యమని అరవిందబాబు తెలిపారు. కార్యక్రమంలో సుమారు 2వేల మంది ప్రజలు పాల్గొన్నారు.
ప్రివెంటివ్ కార్డియాలజీ అంశంపై.. గుంటూరులో సీఎంఈ సదస్సు
World Heart Day 2021: హృదయంతోనే ఆత్మీయ బంధం.. మీ గుండె ఆరోగ్యంగానే ఉందా..?