Volunteers in YSRCP Election Campaign: ఎన్నికల కమిషన్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ వాలంటీర్లు ప్రచారంలో దర్జాగా పాల్గొంటున్నారు. ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొనరాదంటూ ఎన్నికల సంఘం పదేపదే చెబుతున్నా, తొలగిస్తున్నా అధికార పార్టీ అండ చూసుకుని ఏమి చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు వాలంటీర్లు ప్రవర్తిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే అధికారులు చర్యలు తీసుకుంటారనే భయం ఉంటే స్వచ్ఛందంగా రాజీనామా చేసి పార్టీ విజయానికి కృషి చేయాలని స్వయంగా మంత్రి చెప్పడం విస్మయం కలిగిస్తోంది.
వైసీపీకి ప్రచారం చేస్తున్న వాలంటీర్ - వైరల్ అవుతున్న వీడియో
Anantapur: అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం వజ్రకరూరులో ఎలక్షన్ కోడ్‌ను కొంతమంది ఎంఎల్ఓలు, వాలంటీర్లు ఉల్లంఘిస్తున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్న వాలంటీర్లను ఎక్కడిక్కడ తొలగిస్తున్నప్పటికీ వాలంటీర్లు వెనుకడుగు వేయడం లేదు. ఇప్పటికే విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం రాజుల తాళ్లవలసలో ఇద్దరు వాలంటీర్లపై అధికారులు వేటు వేశారు. అయినప్పటికీ కొందరు వాలంటీర్ల తీరు మారడం లేదు. పద్మనాభం మండలం బాంధేపురంలో అవంతి శ్రీనివాసరావు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే విధంగా తగరపువలసలో భీమునిపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు, చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం ఓ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో లక్ష్మీపురం వాలంటీర్ ఆవాల గౌరీ శంకర్ పాల్గొన్నారు. దీనిపై వాలంటీర్‌ను ప్రశ్నించగా తాను సోషల్ మీడియా మండల కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నానని ఆ హోదాలోనే సమావేశానికి హాజరైనట్లు బుకాయించారు.
వాలంటీర్లు రాజీనామా చేయండి: వాలంటీర్లందరూ తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనండి, మళ్లీ అధికారంలోకి రాగానే తిరిగి విధు ల్లోకి తీసుకుంటాం అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి విశ్వరూప్ నేరుగా చెప్పడం చర్చనీయాంశంగా మారింది. డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో
మండలంలోని సమీప ఓ కల్యాణ మండపంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే అధికారులు చర్యలు తీసుకుంటారనే భయం ఉంటే స్వచ్చందంగా రాజీనామా చేసి పార్టీ విజయానికి ప్రచారం చేయాలన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే విధుల్లోకి తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై వాలంటీర్, ఫీల్డ్ అసిస్టెంట్‌పై వేటు - volunteer suspension in kadapa
వాలంటీర్లపై వేటు: వివిధ జిల్లాల్లో నిబంధనలకు విరుద్ధంగా వైఎస్సార్సీపీ తరపున ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లపై అధికారులు మంగళవారం చర్యలు తీసుకున్నారు. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలంలో 9 మంది వాలంటీర్లు సోమవారం వైఎస్సార్సీపీ అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొన్నారని రుజువు కావడంతో వారిని విధుల నుంచి తొలగించినట్లు పంచాయతీ కార్యదర్శి తెలిపారు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ ప్రచారంలో పాల్గొన్న నలుగురు వాలంటీర్లను సస్పెండ్ చేశారు.
వాలంటీర్ల రాజీనామా: వైఎస్సార్సీపీ తరపున ప్రచారంలో పాల్గొనేందుకు ఎన్నికల నిబంధనలు అడ్డస్తున్నాయని వైయస్ఆర్ జిల్లా వీరపునాయునిపల్లె మండలం పాయ సంపల్లెకు చెందిన 13 మంది వాలంటీర్లు మంగళవారం రాజీనామా చేశారు. సర్పంచ్ చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో రాజీనామా పత్రాలను ఎంపీడీఓకు అందజేశారు. వైఎస్సార్సీపీపై ఉన్న అభిమానంతోనే రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.