Vizianagaram Pydithalli Ammavari Sirimanotsavam 2024: ఉత్తరాంధ్ర ఇలవేల్పు, విజయనగరం ప్రజల ఆరాధ్యదేవత, పూసపాటి వంశీయుల ఇలవేల్పు అయిన శ్రీపైడితల్లి అమ్మవారి సిరిమానోవత్సానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధానంగా సోమ, మంగళవారం నాడు ప్రధాన ఘట్టాలైన తొలేళ్లు, సిరిమాను ఉత్సవాలు జరగనున్నాయి. లక్షల మంది భక్తులు వచ్చే ఈ ఉత్సవాల కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. పైడితల్లి అమ్మవారి జాతర ప్రశాంతంగా నిర్వహించడమే లక్ష్యంగా పోలీసు శాఖ సమాయత్తమైంది. సిరిమానోత్సవ నిర్వహణకు 6 వేల మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు నిర్వహించనున్నారు.
విజయనగరంలో కొలువైన ఉన్న శ్రీపైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్దం చేశారు. పందిరిరాట ఉత్సవంతో అమ్మవారి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. 14న అమ్మవారి తొలేళ్ల ఉత్సవం జరగనుండగా, మంగళవారం (15న) నాడు ప్రధాన ఘట్టమైన సిరిమాను సంబరం జరగనుంది. సిరిమాను ఉత్సవం కోసం అవసరమైన చింతచెట్టును డెంకాడ మండలం జరజాపుపేటలో గుర్తించారు. ఈ చెట్టుకు శాస్త్రోత్తంగా పూజలు చేసి, విజయనగరం తీసుకొచ్చారు. ఇప్పటికే గుర్తించిన చెట్టును విజయనగరం హుకుం పేటలో సంప్రదాయబద్ధ రీతిలో సిరిమానుగా మలిచారు.
ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు: అమ్మవారి ఉత్సవాలలో ప్రధాన ఘట్టాలైన తొలెళ్లోత్సవం, సిరిమాను ఉత్సవం తర్వాత తెప్పోత్సవం జరగనుంది. చివరిగా అమ్మవారి ఉయ్యాలకంబాల ఉత్సవంలో ఈ ఏడాది అమ్మవారి ఉత్సవాలు ముగియనున్నాయి. పూసపాటిరాజుల ఆడపడచు అయిన పైడితల్లి అమ్మవారి జాతరను ప్రతీ ఏడాది అంగరంగవైభవంగా నిర్వహిస్తుంటారు. ఆలయానికి వంశపారంపర్య ధర్మకర్తలైన పూసపాటి రాజవంశీయులు అమ్మవారికి సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ పండగను రాష్ట్ర పండుగగా గుర్తించడంతో ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు అందనున్నాయి. ఈ మహోత్సవానికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయినట్లు అధికారులు, ప్రజాప్రతినిధులు తెలియచేశారు.
శ్రీ పైడితల్లి సిరిమానోత్సవంలో కీలక ఘట్టం - సందడిగా అంకురార్పణ - Sri Paidithalli Sirimanotsavam
సిరిమాను అధిరోహించనున్న ఆలయ ప్రధాన పూజారి: అమ్మవారి ప్రధాన పూజారి నివసించే ప్రాంతమైన హుకుంపేటలో సిరిమాను రూపుదిద్దుకుంది. అక్కడ నుంచి ఈ సిరిమానును సిరిమానోత్సవం నాడు అమ్మవారి చదురుగుడి వద్దకు మేళతాళాలు, సాంస్క్రతిక కళారూపాలు నడుమ సంప్రదాయబద్దంగా తీసుకువస్తారు. అనంతరం అమ్మవారి రూపంగా ఆలయ ప్రధాన పూజారి సిరిమానును అధిరోహిస్తారు. ఈ అపరూప దృశ్యాన్ని చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున తరలొస్తారు. ఈ నేపథ్యంలో, భక్తుల సౌకర్యార్థం నగరపాలక సంస్థ తరపున కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ప్రధానంగా నగరంలోని ప్రధాన వీధులతో పాటు, పైడితల్లి ఆలయం, సిరిమాను తిరిగే పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ప్రజలకు తాగునీరు కోసం శుద్ధ జల కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు మొబైల్ మరుగుదొడ్డను కూడా అందుబాటులో ఉంచుతున్నట్లు నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు. పైడితల్లి అమ్మవారి జాతర ప్రశాంతంగా నిర్వహించడమే లక్ష్యంగా పోలీసుశాఖ కూడా సమాయత్తమవుతోంది. ఉత్సవాల నిర్వహణకు ఆరువేల మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.
సీసీ కెమెరా, డ్రోన్, ఆర్టీజీఎస్ కెమెరాలతో నిరంతరం నిఘా నిర్వహించనున్నారు. సిరిమానోత్సవం నాడు సిరిమాను, అమ్మవారి దర్శనానికి భక్తులను అదుపు చేసేందుకు, తొక్కిసలాట జరగకుండా నివారించేందుకు బారికేడ్లు ఏర్పాటు చేయనున్నారు. పైడితల్లి ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం సిరిమానోత్సవానికి ఉత్తరాంధ్రతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు పెద్దఎత్తున తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో వారిని అలరించేందుకు పులివేషాలు, ఘట్టాల ప్రదర్శన వంటి సాంస్కృతిక కార్యక్రమాలనూ నిర్వహించనున్నారు.