Vizianagaram Pydithalli Ammavari Sirimanotsavam 2024 : తల్లి దర్శనం అమోఘం, నయనానందకరం. అమ్మరూపం దేదీప్యమానం. అందరినోటా జై పైడితల్లి, జైజై పైడిమాంబ నామస్మరణే. ఆ అపురూప ఘట్టం చూసిన కనులదే భాగ్యం. తరించిన భక్తకోటి పుణ్యఫలం. తల్లి దర్శనం అమోఘం, నయనానందకరం. అమ్మరూపం దేదీప్యమానం. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, విజయనగరం ప్రజల ఇలవేల్పు అయిన శ్రీ పైడితల్లమ్మ సిరిమాను ఘట్టం ఇలా అంగరంగ వైభవంగా జరిగింది. ఆధ్యాత్మికత ఉట్టిపడిన వేళ, అమ్మవారి భక్తజనం లక్షలాది మంది తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో విజయనగరమంతా భక్తజనసందోహంగా మారింది.
ఉత్తరాంధ్ర కల్పవల్లి, విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఘనంగా జరిగింది. సంప్రదాయబద్దంగా పాలధార, తెల్ల ఏనుగు, అంజలి రథం, బెస్తవారివల ముందు నడవగా, భక్తుల జయజయద్వానాల మధ్య పైడితల్లి అమ్మవారు ఉత్సవ వీధుల్లో సిరిమాను రూపంలో ముమ్మారు ఊరేగి ప్రజలను ఆశీర్వదించారు. అమ్మవారి ప్రతిరూపంగా సిరిమానుపై పైడితల్లి ఆలయ ప్రధాన పూజారి బంటుపల్లి వెంకటరావు ఆశీనులై, భక్తులకు దర్శనమిచ్చారు.
సిరి సంపదలనిచ్చే పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం - ఆలయ చరిత్ర, జాతర విశేషాలివే!
పుట్టినిల్లు వద్ద మూడు సార్లు ఊరేగిన అమ్మవారు : నెల రోజుల పాటు విజయనగరం రాజులు, పూసపాటి వంశీయుల ఇలవేల్పు విజయనగరం పైడితల్లి. ఉత్తరాంధ్ర ప్రజలు కోరిన కోర్కెలు తీర్చే చల్లని తల్లి అయిన పైడితల్లి జాతర గత నెల 20న ఆరంభమైంది. నెల రోజుల పాటు జరగనున్న అమ్మవారి జాతరలో తొలేళ్లు, సిరిమానోత్సవం ప్రధాన ఘట్టాలు. ఈ సిరిమాను సంబరం ప్రతియేటా దసరా పండుగ ముగిసిన తర్వాత క్రమంగా తప్పకుండా నిర్వహించటం ఆనవాయితీ. ఎప్పటిలాగే పైడితల్లి అమ్మవారు మూడు సార్లు ఉత్సవ వీధుల్లో సిరిమాను రూపంలో ఊరేగారు. తన పుట్టినిల్లు విజయనగరం కోట వద్దకు వెళ్లి, పూసపాటి వంశీయుల రాజా కుటుంబాన్ని ఆశీర్వదించారు. రాజ కుటుంబానికి దీవెనలు అందించారు.
ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా, ఒడిశా నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. పూజారి రూపంలో సిరిమాను అధిరోహించిన అమ్మవారిని చూసేందుకు మధ్యాహ్నం ఒంటిగంటకే బారులు తీరారు. ఎత్తైన భవంతులపైకీ సైతం ఎక్కి సిరిమాను సంబరాన్ని కనులారా తిలకించి, పునీతులయ్యారు.
రాష్ట్ర పండగగా ప్రకటన : అమ్మవారి దర్శనానికి వేకువజాము నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు భక్తులను అనుమతించారు. అనంతరం, సర్వదర్శనాలు నిలిపివేశారు. అంతకుముందు అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతమంతా జనసందోహంగా మారింది. క్యూలైన్లలో బారులు తీరారు. ఘటాలతో మహిళలు ప్రణమిల్లి, పైడితల్లికి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా కళాకారులు., వివిధ కళారూపాలతో భక్తులను అలరించారు. భక్తుల భద్రతకే కాకుండా, సేవాదళ్ రూపంలోనూ పోలీసులు సేవలందించారు. అదేవిధంగా, పైడితల్లి అమ్మవారిని పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు దర్శించుకున్నారు.
అమ్మవారి పండుగను రాష్ట్ర పండగగా ప్రకటించిన నేపథ్యంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం, రాష్ట్ర గిరిజనశాఖ, స్త్రీ సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణి, పలువురు శాసనసభ్యులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవ నేపథ్యంలో పోలీసుశాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. బందోబస్తును పలు సెక్టార్లుగా విభజించి, సుమారు 2000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవం ఈ ఏడాది ప్రశాంతంగా, సజావుగా ముగియటం ఏర్పాట్లుపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు.
నారా లోకేశ్ శుభాకాంక్షలు : పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవం సందర్భంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మ వారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నా అన్నారు.
పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. అమ్మ వారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నాను.
— Lokesh Nara (@naralokesh) October 15, 2024
తుది ఘట్టానికి సిరిమానోత్సవాలు - రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు