Vizianagaram MP Kalishetty Appalanaidu: ప్రజా ప్రయోజనాలే పరమావధిగా, తమ ప్రభుత్వ పాలన ఉంటుందని విజయనగరం తెలుగుదేశం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే దాడులకు పాల్పడుతుందంటూ ఓటమి పాలైన పార్టీలు మాట్లాడటం సరికాదన్నారు. ఉత్తరాంధ్రలో జరిగిన భూకుంభకోణాలపై చర్యలు తీసుకొనేవిధంగా, కూటమి ప్రభుత్వం దృష్టిపెడుతుందని తెలిపారు. విజయనగరంలో జరిగిన భూ అక్రమాలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. రిషికొండపై భవనాల విషయంలోనూ తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు.
తమది కూల్చే ప్రభుత్వం కాదని.. ఆస్తులు కాపాడే ప్రభుత్వమని అప్పలనాయుడు పేర్కొన్నారు. ఉత్తరాంధ్రకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. విశాఖ నగరాన్ని ఆర్థిక రాజధానిగా ప్రకటించారన్నారు. ఒక కేంద్ర మంత్రి పదవి ఉత్తరాంధ్రకు ఇచ్చారని చెప్పారు. కూటమిది ప్రజా ప్రభుత్వమని.. ప్రచార ప్రభుత్వం కాదని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులు కూల్చే ప్రభుత్వాన్ని చూశామని.. ఇప్పుడు ప్రజా ఆస్తులు కాపాడే ప్రభుత్వాన్ని చూస్తారని చెప్పారు. ఉత్తరాంధ్ర నీటిపారుదల ప్రాజెక్టులపై అధ్యయనం చేస్తున్నట్లు అప్పలనాయుడు వివరించారు. ప్రజల తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని అప్పలనాయుడు స్పష్టం చేశారు.
రామోజీ ఇచ్చిన స్పూర్తితోనే ఈనాడు ఉద్యోగి నుంచి ఎంపీ స్థాయికి ఎదిగాను- ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు
ఉత్తరాంధ్రకు సీట్లు కేటాయించే విషయంలో చంద్రబాబు నాయుడు సామాజిక న్యాయం చేశారని తెలిపారు. మంత్రి వర్గకూర్పులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తెలుగుదేశం ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. మంత్రులకు అవకాశం కల్పించడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని పేర్కొన్నారు. తన గెలుపు కోసం మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజ్ కృషిచేశారని కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. ఇకపై ప్రజాసమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు సాగుతామని తెలిపారు. పార్లమెంట్ లో సైతం ప్రజల గొంతుక వినిపిస్తామన్నారు. ప్రజలను డైవర్ట్ చేయడానికే దాడులకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.