Restoration Works Enters Final Stage in Flood Hit Areas : విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాలను సాధారణ స్థితి నెలకొల్పే ప్రయత్నాలు తుది దశకు చేరుతున్నాయి. ఇవాళ సాయంత్రానికి ముంపు ప్రాంతాల్లో నీటిని పూర్తిగా వెళ్లగొట్టేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విద్యుత్ కూడా వందశాతం పునరుద్ధరించబోతోంది. బాధిత ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్యశాఖ ఇంటింటి సర్వే చేస్తోంది. ఇవాళ కేంద్రబృందం కూడా పర్యటించి తగిన సూచనలు ఇవ్వనుంది.
సాధారణ స్థితికి చేరుకుంటున్న విజయవాడ : బుడమేరు ముంపు ప్రాంతాల్లోని ఒక్కో కాలనీ సాధారణ స్థితికి చేరుకుంటోంది. ఇప్పటిదాగా 30,545 ఇళ్లు, దుకాణాలను శుభ్రం చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. 66 వార్డు సచివాలయాల పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ వంద శాతం పూర్తవగా ముంపు ప్రాంతాల్లోని 90 శాతం ప్రధాన రహదారుల్ని పునరుద్ధరించి వినియోగంలోనికి తెచ్చారు. 421 కిలోమీటర్ల మేర డ్రైన్లలో చెత్త తొలగించారు. లోతట్టు ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్లు, సెల్లార్‌లోని నీటిని మోటార్లతో వెళ్లగొట్టే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
అడుగడుగునా ప్రభుత్వం అండ : వరద వీడిన ప్రాంతాల్లో ప్రభుత్వం ఎప్పటికప్పుడు సౌకర్యాలు కల్పిస్తోంది. ఇప్పటికే 95 శాతం విద్యుత్‌ను పునరుద్ధరించేసింది. జక్కంపూడి, కబేళా సెంటర్, సితార్ రోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించిన విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవి నీటిలో మునిగిన సబ్‌స్టేషన్లను పరిశీలించారు. మొత్తం 1000 మంది విద్యుత్ సిబ్బంది వరద ప్రాంతాల్లో పనిచేస్తున్నారని, జక్కంపూడిలోనే 400 మందిని మోహరించామని చెప్పారు
వైద్యారోగ్య శాఖ ఇంటింటి సర్వే : మరోవైపు వరద నీరు ప్రజారోగ్యానికి సవాళ్లు విసురుతోంది. 9 రోజులుగా నీరు నిల్వ ఉండడం, మురుగు కాలువలు, మనుషుల మల, మూత్రాలూ అందులో కలవడం, కొన్నిచోట్ల పశువుల కళేబరాలు, చెత్తాచెదారం, ఆహార ప్యాకెట్లు కుళ్లుపోవడం వల్ల వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ సంబంధిత వ్యాధులు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణా చర్యలు చేపట్టింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బృందాలు ఇప్పటికే ఇంటింటి సర్వే ద్వారా ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆరుగురు నిపుణులతో కూటిన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిటీ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి సలహాలు, సూచనలు ఇవ్వనుంది. వరద బాధిత ప్రాంతాల్లో వైద్య శిబిరాల ద్వారా అందాల్సిన సేవలపై సిబ్బందికి శిక్షణా శిబిరం నిర్వహించారు. మంత్రి సత్యకుమార్ దిశా నిర్దేశం చేశారు.
భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర ఉక్కిరిబిక్కిరి - జలాశయాలకు పోటెత్తుతున్న వరద - HEAVY RAINS IN UTTARANDRA
నేడు కేంద్ర వైద్య బృందం పర్యటన : ఇదే సమయంలో, నష్ట పరిహారం అంచనాలు, సహాయ చర్యల పర్యవేక్షణ కోసం ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా కన్వీనర్‌గా ఉండే కమిటీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పురపాలక మంత్రి నారాయణ, హోంమంత్రి అనిత, రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ లు సభ్యులుగా ఉంటారు.
పోటెత్తిన వరద - కాకినాడ జిల్లాలో ఏలేరు బీభత్సం - Yeleru Reservoir Flood