Vijayawada CP Kanthi Rana on Eenadu Stories : అధికార వైఎస్సార్సీపీకు బంటుల్లాగా మారిపోయి గత అయిదేళ్లుగా ఆ పార్టీ నాయకులు చెప్పిందే చట్టం, వారి మాటే శాసనమన్నట్లుగా పనిచేస్తున్న కొంతమంది ఐపీఎస్‌ల తీరుపై కథనాలు రాస్తుంటే ఐపీఎస్ అధికారుల సంఘం దాడి చేస్తోంది. అవి నిరాధార, అసత్య ఆరోపణలంటూ దబాయిస్తోంది. పలువురు ఐపీఎస్ అధికారులపై ఈనాడులో ఇటీవల ప్రచురించిన కథనాలను ఖండిస్తూ ఐపీఎస్ అధికారుల సంఘం, ఆంధ్రప్రదేశ్ ఛాప్టర్ తరఫున ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ హోదాలో విజయవాడ నగర పోలీసు కమిషనర్ కాంతి రాణా శుక్రవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో పేర్కొన్న అంశాలు ఆయన ఒక్కరి అభిప్రాయలా లేక సంఘం మొత్తానివా? సంఘం అభిప్రాయాలే అయితే దానిపై కీలకమైన ఆఫీస్ బేరర్ల సంతకాలు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన వైఎస్సార్సీపీతో అంటకాగే అధికారుల తరఫున వకల్తా పుచ్చుకున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
IPS Officers Behavior in Andhra Pradesh : పలువురు ఐపీఎస్ అధికారులపై నిరాధార, అసత్య ఆరోపణలతో కథనాలు ప్రచురించారని కాంతిరాణా ఆరోపించారు. అసలు ఈనాడు రాసిన ఏ కథనం, ఎలా నిరాధారమో చెప్పకుండానే అవి అసత్య ఆరోపణలని ఆయనెలా నిర్ధారించేస్తారని వాదనలు వినిపిస్తున్నాయి. ఆయనేమైనా వాటిపై విచారణ జరిపించారా? లేదంటే వైసీపీతో అంటకాగుతున్న కొందరు అధికారుల తరఫున వకల్తా పుచ్చుకున్నారా? అసలు ఏ ప్రాతిపదికన అవి నిరాధారమని తేల్చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయిదేళ్ల పాటు వైసీపీ సేవలో తరించింది చాలక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా సరే ఆ పార్టీ పట్ల స్వామి భక్తి వీడకుండా ఏకపక్షంగా పనిచేయటం వల్లే కదా అయిదు జిల్లాల ఎస్పీలు, ఒక ఐజీపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది.
వాళ్లు ఏ తప్పూ చేయకుండా, నిష్పక్షపాతంగా ఉండుంటే ఎందుకు ఈసీ ఆగ్రహానికి గురవుతారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలాంటి అధికారుల గురించి ఉన్నది ఉన్నట్లు రాస్తే అది అసత్యం ఎలా అవుతుంది? చివరికి బదిలీ అయిన అధికారుల స్థానంలో నియమితులైన నెల్లూరు, ప్రకాశం, అనంతపురం ఎస్పీలు ఆరిఫ్ హఫీజ్, గరుడ్ సుమిత్ సునీల్, అమిత్ బర్దర్‌లు గతంలో వాళ్లు పనిచేసిన జిల్లాల్లో అధికార పార్టీ అరాచకాలకు కొమ్ముకాయటం వాస్తవం కాదా అనే విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్షాలను అణచివేయటం నిజం కాదా? వాళ్లు వైసీపీ పీనల్ కోడ్‌ను ఎంత బాగా అమలు చేశారో ఘటనలతో సహా రాసింది. అవి నిజం కాదని చెప్పగలిగే ధైర్యం కాంతి రాణాకు ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పోలీసు నాయకత్వాన్ని ఆత్మరక్షణలో నెట్టేయటానికి, చట్టబద్ధమైన విధుల నిర్వహణలో నిష్క్రియాత్మకంగా మార్చేయాలన్న లక్ష్యంతో అవమానకరమైన ఆరోపణలతో కథనాలు రాస్తున్నారని కాంతి రాణా అన్నారు. కొంతమంది ఐపీఎస్‌లు తాము అఖిలభారత సర్వీసు అధికారులమని కూడా మరిచిపోయి అయిదేళ్లుగా వైకాపా కార్యకర్తల కంటే దారుణంగా పేట్రేగిపోతుంటే అది మీకెప్పుడు అవమానకరంగా అనిపించలేదా? కనిపించలేదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో వైసీపీ పీనల్ కోడ్, సీఆర్‌పీసీ బదులు వైసీపీ ప్రొసీజర్ కోడ్ అమలు చేస్తున్నప్పుడు అసలు చట్టాలేంటో గుర్తుకు రాలేదా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి భజన చేయటం ప్రతిపక్షాలను తొక్కేయటమే లక్ష్యమన్నట్లు పనిచేసి పోలీసుల ఆత్మగౌరవాన్ని, ప్రతిష్ఠను జగన్ కాళ్ల దగ్గర ఎప్పుడో తాకట్టు పెట్టేసిన కొందరి నుంచి చట్టబద్ధమైన విధుల నిర్వహణ అనే మాటలు రావటం హాస్యాస్పదంగా అనిపిస్తోందనే వాదనలు వినిపిస్తాయి.
అంతెందుకు విజయవాడలో టీడీపీ నాయకుడు చెన్నుపాటి గాంధీపై వైసీపీ నాయకులు హత్యాయత్నానికి తెగబడితే ఆ నిందితులపై తేలికపాటి సెక్షన్ల కింద కేసు పెట్టి వారికి కొమ్ముకాసింది ఎవరు? తాజాగా నందిగామలో టీడీపీ సానుభూతిపరులపై దాడి జరిగితే బాధితులైన వారిపైనే రివర్స్ కేసు పెట్టిన ఘనత ఎవరిది? రాష్ట్రంలో ప్రతిచోటా జరిగింది ఇదే కదా! పుంగనూరులో మరో తాలిబన్ రాజ్యాన్ని, మాచర్లలో చంబల్‌లోయను సృష్టించిన నాయకులకు అండగా ఉన్నది ఘనత వహించిన కొందరు పోలీసు అధికారులే కదా!
చట్టబద్ధమైన విధుల్లో భాగంగా పోలీసు శాఖ తీసుకునే చర్యల వల్ల ఎవరైనా వ్యక్తిగతంగా బాధపడితే వాళ్లు సంబంధిత అధికారుల వివరణ కోరొచ్చని కాంతి రాణా అన్నారు. అప్పటికీ సంతృప్తి చెందకపోతే న్యాయపరంగా తగిన మార్గాన్ని ఎంచుకోవచ్చుని దీనికి పోలీసు శాఖ తగిన రీతిలో సమాధానమిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గత అయిదేళ్లలో ప్రతిపక్ష నాయకుల నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, యువజన, రైతు సంఘాల ప్రతినిధుల వరకు చివరకు సామాన్య పౌరులు కూడా ఎంతోమంది పోలీసు వేధింపుల బారిన పడ్డారు. అసలు రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలవుతుందా? అనే అనుమానం వచ్చేలా బాధితుల పైనే వేలకొద్దీ అక్రమ కేసులు పెట్టారు కదా అనే వాదనలు వినిపిస్తున్నాయి. దాడులకు తెగబడ్డ అధికార పార్టీ నాయకులను పువ్వుల్లో పెట్టి మరీ చూసుకున్నారు కదా అనే విమర్శలు తలెత్తుతున్నాయి.
అమరావతి రైతులు మొదలుకుని ప్రతి ఒక్కరిపైనా తీవ్ర అణచివేత, నిర్బంధం ప్రదర్శించారు. వాటిని చట్టబద్ధమైనా విధులు అంటారా? అసలు బాధితుల్ని ఎప్పుడైనా కలవడానికి, వాళ్లు గోడు చెప్పుకోవడానికి అవకాశమిచ్చారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసలు వేధించిందే పోలీసులైతే ఇక ఎవరి వద్ద చెప్పుకోవాలి? పోలీసు బాస్ అయిన డీజీపీ కె.వి.రాజేంద్రనాథరెడ్డి గత రెండేళ్లలో ఏ ఒక్కరోజైనా ప్రధాన ప్రతిపక్ష నాయకులకైనా అపాయింట్‌మెంట్ ఇచ్చారా? అనే వాదనలు వస్తున్నాయి. దాదాపు రెండేళ్ల తర్వాత శుక్రవారం నాడు తమకు డీజీపీ దర్శనభాగ్యం కలిగిందని ప్రధాన ప్రతిపక్షం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇక సామాన్యులు ఆయన దగ్గరకు రాగలరా? అనే విమర్శలు వస్తున్నాయి. బాధితులు న్యాయపరంగా తగిన మార్గాన్ని ఎంచుకోవచ్చని చెబుతున్నారు. పోలీసులపై ఎంతమంది బాధితులు కోర్టులను ఆశ్రయించగలరో సమాధానం చెప్పగలరా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వైసీపీతో అంటకాగుతున్న కీలక అధికారులు!- చర్యలపై ప్రతిపక్షాల డిమాండ్ - No Actions on Key Officers