Victims Suffering due to Land Grab During YSRCP Government : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూకబ్జాలకు ఇంకా ముగింపు దొరకలేదు. ఐదేళ్లుగా కుదరితే రాజీ చేయడం, లేదంటే దౌర్జన్యంగా ఆక్రమించడం నిత్యకృత్యమైంది. ఒంగోలులో అధికారులు, బాధితులు ఇప్పటికి కోర్టుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఆక్రమణలపై సిట్ వేసిన జగన్ ప్రభుత్వం దాన్నీ నీరుగార్చింది. సిట్‌లో ఉన్న పోలీస్ అధికారుల్లో కొందరు ఇరువర్గాల నుంచి బాగా డబ్బులు గుంజుకుని లాభపడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం మారడంతో కొత్త అధికారులతో సిట్ వేసి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు.
యజమానులకు కంటి మీద కునుకు లేదు : ఒంగోలులో గత ప్రభుత్వ హయాంలో భూకబ్జాదారులు పెట్రేగిపోయారు. ప్రైవేట్ ఆస్తులను నకిలీ పత్రాలతో వివాదాలు సృష్టిస్తూ యజమానులకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. అప్పటి వైఎస్సార్సీపీ నేతల అండదండలతో అక్రమార్కులు చాపకింద నీరులా తమ అక్రమాలను యథేచ్ఛగా సాగించారు. నకిలీ స్టాంపు పేపర్లు, ముద్రలు, డిజిటల్ సంతకాలతో కోట్ల రూపాయలు విలువచేసే భూములు, ఇళ్లు, ఆస్తులను కొల్లగొట్టారు.
చాలాచోట్ల స్థల యజమానులకు కూడా తెలియకుండా నకిలీ స్టాంప్ పేపర్లతో రిజిస్ట్రేషన్లు చేశారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఒంగోలులోని లాయరుపేటకు చెందిన వైసీపీ మద్దతుదారు, రియల్ ఎస్టేట్ వ్యాపారి పూర్ణచంద్రరావు ఇంట్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. పంచాయతీ ఆఫీసులకు సంబంధించిన నకిలీ స్టాంపులు, వెండర్ లైసెన్స్ సీల్స్, జనన,మరణ సర్టిఫికెట్స్‌తోపాటు ఇతర నకిలీ పత్రాలు దొరికాయి. పూర్ణచంద్రరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే పెద్ద ముఠా వ్యవహారమే బయటపడింది. దాదాపు 150 మంది వరకూ అక్రమ భూదందాలో పాత్ర ఉన్నట్లు గుర్తించారు. గత ప్రభుత్వ హయాంలోనే సిట్ వేయగా కొంతమంది పోలీసు అధికారులు వైసీపీ నేతలకు తొత్తులుగా వ్యవహరించి వ్యవహారాన్ని నీరుగార్చారని విమర్శలు వినిపిస్తున్నాయి.
"ఈ దందాకు రెవెన్యూ, సబ్-రిజిస్ట్రార్లు, పోలీసు శాఖకు చెందిన కొందరు అధికారులు కారణం. భూ దందాలపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన కరవైంది. మా ఆస్తులను కాపాడాలంటూ ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతునే ఉన్నాం. కూటమి ప్రభుత్వం కొత్త అధికారులతో సిట్ వేసి మాకు న్యాయం చేయాలి." - సుబ్బారావు, బాధితుడు
వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన అక్రమాలపై కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టింది. సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంలో కూడా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన భూదందాలతో పాటు ఒంగోలులో జరిగిన కబ్జాలను కూడా ప్రస్తావించడంతో బాధితుల్లో భరోసా ఏర్పడింది.