POND MISSING COMPLAINT IN TELANGANA: మన విలువైన వస్తువులు పోయినా, ఎవరైనా కనిపించకపోయినా, ఏదైనా కష్టం వచ్చినా పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. కానీ తెలంగాణలో మాత్రం ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. చెరువుజాడ కనిపెట్టండి సారూ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఆవేదనని వారి ముందు వెలిబుచ్చారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయామని, మీరే మాకు న్యాయం చేయాలంటూ ఖాకీలను వేడుకున్నారు.
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని తుక్కుగూలో 8 ఎకరాల్లో తుమ్మల చెరువు ఉండేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం చెరువు కనిపించకుండా పోవడం వలన వర్షం వస్తే తమ పంటలు మునిగిపోతున్నాయని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. మీరే మాకు న్యాయం చేయాలని, చెరువుని వెతికిపెట్టాలని పోలీసులని కోరారు.
చెరువుని దొంగిలించింది ఎవరు: ఈ మేరకు చెరువు జాడ కనిపించట్లేదని రంగారెడ్డి జిల్లాలోని పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తుక్కుగూలో 8 ఎకరాల్లో ఉండాల్సిన తుమ్మల చెరువును కొందరు కబ్జా చేసి వెంచర్లు వేశారని గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనివల్ల ప్రతి వర్షాకాలంలో పంటలు మునుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించి చెరువు ఆచూకీ కనిపెట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. చెరువు కబ్జాపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయామని వాపోయారు. పోలీసులైనా చెరువు ఆచూకీ వెతికిపెట్టాలని కోరారు.
మరోవైపు తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. ఒకసారి ఆక్రమణల కూల్చివేతలు మొదలుపెడితే భవనాలను నేలమట్టం చేసి గానీ సిబ్బంది వెనుదిరిగి రావడం లేదు.
ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించిన ఇళ్లను రెవెన్యూ అధికారులు నేలమట్టం చేస్తున్నారు. హైదరాబాద్ రాయదుర్గం మల్కం చెరువు సమీపంలోని ప్రభుత్వ భూమిలో కొందరు ఇళ్లు నిర్మించుకుని నివాసముంటున్నారు. శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు భారీ పోలీసు బందోబస్తుతో దాదాపు ఎకరం భూమిలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. నిర్మాణాల తొలగింపును స్థానికులు, నివాసితులు అడ్డుకున్నారు.
హైదరాబాద్లో హైడ్రా హడల్ - అక్రమ నిర్మాణాలపై ముప్పేట దాడి - HYDRA DEMOLITIONS