PSR Anjaneyulu Irregularities : గత వైఎస్సార్సీపీ సర్కార్‌లో రవాణాశాఖ కమిషనర్‌గా సుదీర్ఘకాలం పనిచేసిన పి. సీతారామాంజనేయులు (పీఎస్‌ఆర్) ఏకఛత్రాధిపత్యంగా వ్యవహరించారు. బీఎస్-3 లారీల కేసులో టీడీపీ నాయకులపై కేసులు పెట్టి జైలుకు పంపారు. కానీ ఆ వాహనాలకు రీ-రిజిస్ట్రేషన్ చేసిన రవాణాశాఖ అధికారులపై మాత్రం ఆయన ఎందుకు చర్యలు తీసుకోలేదనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. ఈ కేసులో అధికారుల పాత్ర ఉందని స్పష్టంగా తేలినా వారిపై చర్యల్లేకుండా, తర్వాత పదోన్నతులిచ్చి పీఎస్‌ఆర్ తన మార్క్ చూపారు.
Allegations in IPS PSR Anjaneyulu : అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన రెండు సంస్థలు భారత్ స్టేజ్ (బీఎస్)-3 లారీలను అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి కొనుగోలు చేసి, బీఎస్-4గా చూపించి రీ-రిజిస్ట్రేషన్ చేయించారనే ఆరోపణలతో 2020లో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబీకులపై జగన్ సర్కార్ కేసులు పెట్టింది. 2019లో తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దారెడ్డి లారీల అంశంపై రవాణాశాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి కమిషనర్‌గా ఉన్న సీతారామాంజనేయులు ఆఘమేఘాలపై విచారణ జరిపించారు.
కేసులు నమోదు చేయించి జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిని జైలుకు పంపేవరకు శాంతించలేదు. అయితే ఈ కేసులో అనంతపురం ఉప రవాణా కమిషనర్ (డీటీసీ), ఆర్టీఓలు, ఎంవీఐలు, ఏఎంవీఐలు, ఏఓలు, ఇతర ఉద్యోగులు కలిపి మొత్తం 17 మంది పాత్ర ఉన్నట్లు నిర్ధారించారు. వీరికి మొదట ఛార్జ్‌మెమోలు ఇచ్చారు. దీంతో వాళ్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తారని, కనీసం సస్పెన్షన్లు చేస్తారని అంతా భావించారు.
AP Govt Focus on IPS PSR : కానీ అనూహ్యంగా ఛార్జెస్ డ్రాప్ చేసేశారు. అందరికీ క్లీన్‌చిట్ ఇచ్చి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కనీసం ఇంక్రిమెంట్లలో కోత కూడా లేకుండా బయటపడేలా సీతారామాంజనేయులు తన చక్రం తిప్పారు. ఆ తర్వాత వీరిలో కొందరికి పదోన్నతులూ ఇచ్చారు. ఇటీవల జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో ప్రస్తావనకు తెచ్చారు. ఒక్క రవాణాశాఖ అధికారిపైనా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.
సూళ్లూరుపేట కేసులో బయటపడేందుకు అధికారుల లాబీయింగ్! : సూళ్లూరుపేట రవాణాశాఖ కార్యాలయ పరిధిలో 2021లో ఆయిల్ ట్యాంకర్ల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. నాగాలాండ్ నుంచి 80 ట్యాంకర్లకు నిరభ్యంతర పత్రాలు (ఎన్వోసీలు) తీసుకొచ్చి, సూళ్లూరుపేట ఎంవీఐ కార్యాలయంలో రీ-రిజిస్ట్రేషన్లు చేశారు. అయితే అసలు ఆ ట్యాంకర్లే లేవు. అయినా సరే రవాణాశాఖ అధికారులు ఆర్టీఏ ఏజెంట్లతో కుమ్మక్కై ఈ తంతగాన్ని నడిపారు. ఈ స్కామ్ బయటికి రాగా ఇందులో కీలకంగా ఉన్న విజయవాడకు చెందిన ఆర్టీఏ ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారు. సూళ్లూరుపేట ఎంవీఐ, ఏఓలు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లతో పాటు దీనిని పర్యవేక్షించాల్సిన ఆర్టీఓ విఫలం కావడంతో వీరందరిపై కూడా అప్పట్లో కేసులు నమోదయ్యాయి. చాలా రోజులు అజ్ఞాతంలో ఉన్న వీళ్లు ఆ తర్వాత కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు.
Oil Tankers Re Registrations Scam in AP : కానీ సీతారామాంజనేయులు చలవతో వీరిపైనా తర్వాత చర్యల్లేవు. కనీసం సస్పెన్షన్లు కూడా చేయలేదు. ఆ తర్వాత ఈ కుంభకోణంపై కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ విచారణ జరిపింది. ఆయా అధికారులు, ఉద్యోగులు ఇందులో బాధ్యులేనని తేల్చారు. వారిని సర్వీసు నుంచి తొలగించాలని ఇటీవల సిఫార్సు చేశారు. అయితే ఇప్పుడు ఆయా అధికారులు ఎలాగైనా ఈ కేసు నుంచి బయటపడాలని చూస్తున్నారు. గతంలో తాడిపత్రి లారీల కేసులో అధికారులను ఎలా తప్పించారో తమనూ అలాగే బయటపడేలా చేయాలంటూ లాబీయింగ్ చేస్తుండడం గమనార్హం.
ఆ లారీలు అమ్మారని జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు
బెయిల్‌పై వచ్చిన 24 గంటల్లో జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్టు.. 21 వరకూ రిమాండ్