Train Accident in Kavali Mother And Daughter Died : శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి రైల్వేస్టేషన్లో ఘోర ప్రమాదం జరిగింది. ఎక్స్‌ప్రెస్ రైలు ఢీ కొని తల్లీ కుమార్తె మృతి చెందారు. ఈ తెల్లవారుజామున తల్లి వజ్రమ్మ(60)ను విజయవాడ ప్యాసింజర్ రైలు ఎక్కించేందుకు శిరీష(30) రైల్వే స్టేషన్‌కు వచ్చింది. పట్టాలు దాటుతుండగా 3వ ప్లాట్‌ఫారం ఎక్కలేకపోయిన తల్లికి సాయం చేసేందుకు శిరీష ప్రయత్నించింది. ఇంతలో వేగంగా వచ్చిన కోయంబత్తూర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇద్దరినీ ఢీ కొట్టింది. దీంతో తల్లీకుమార్తెలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు, వారిద్దరి శరీరాలు ఛిద్రమయ్యాయి. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మృతి చెందిన వజ్రమ్మది బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం అల్లూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కావలి పట్టణంలో నివాసం ఉంటున్న గార్నిపూడి శిరీష పోలీసులు గుర్తించారు. సమాచారాన్ని బంధువులకు తెలియపరిచారు. ఇటీవలె తండ్రి చనిపోవడంతో శిరీష తల్లిని తన ఇంటికి తీసుకొచ్చింది. తిరిగి వజ్రమ్మను వారి ఇంటికి పంపించే సమయంలో ఈ ఘటన జరిగింది. ఒకే కుటుంబంలో తల్లీ కూతుర్లు చనిపోవడంతో వారి ఇంట్లో విషాధ ఛాయలు అలుముకున్నాయి. రైల్వే ట్రాక్‌లపై నుంచి దాటడం ఎంతో ప్రమాదకరమని ఎవ్వరూ పట్టాలపై నుంచి దాటొద్దని రైల్వే సిబ్బంది హెచ్చరించింది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామన్నారు.
గంజాయి మత్తులో రైల్వే ట్రాక్‌పై ఇద్దరు యువకులు - దూసుకొచ్చిన ట్రెయిన్
Road Accident in NTR District One Dead 12 Injured : మరోవైపు ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు - చెవుటూరు రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా ఏస్-లారీ ఒకదాన్నొకటి ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. మైలవరం నుంచి విజయవాడ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుడు మైలవరం మండలం పుల్లూరు గ్రామానికి చెందిన కొనకాల నాగరాజుగా గుర్తించారు. బొప్పాయి తోటలో కూలీ పనులకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు బాధితులు తెలిపారు. క్షతగాత్రులను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.