Tollywood Josh with NDA Win: కూటమి గెలుపుతో తెలుగు చిత్రసీమలో జోష్ వచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సినిమా రంగానికి ఏ దశలోనూ ప్రోత్సాహం లభించలేదు. వేడుకలు, ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతులు మొదలుకొని టికెట్ ధరల వరకూ ప్రతి విషయంలోనూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేచీలు పెట్టేది. సర్వం తానే అయి, ఎవరైనా తన వద్దకొచ్చి ప్రాధేయపడాల్సిందే అన్నట్టుగా మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యవహరించారు. దీంతో కళారంగానికి, చిత్రసీమకు తాము బద్ధ వ్యతిరేకమని చెప్పకనే చెప్పినట్టయింది. అదే చిత్రసీమ మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చింది.
తెలుగు చిత్ర పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ హృదయంతో సమానం. 60 శాతానికిపైగా సినీ వ్యాపారం జరిగేది ఇక్కడే. తనకు రాజకీయ ప్రత్యర్థులైన పవన్‌కల్యాణ్, బాలకృష్ణను దెబ్బ కొట్టడానికి పలుమార్లు ఇదే అస్త్రంగా జగన్ ఎంచుకున్నారు. వాళ్లు నటించిన సినిమాలనే లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నించారు. అయినా వెనకడుగు వేయకుండా నిర్మాతలకు అండగా నిలుస్తూ ఒకవైపు సినిమాలు చేసుకుంటూ మరోవైపు ప్రభుత్వంపై పవన్‌కల్యాణ్, బాలకృష్ణ పోరాడారు.
చంద్రబాబును పొగిడారని: చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని రజనీకాంత్ అన్నందుకు అప్పటి మంత్రులతో వైఎస్సార్సీపీ నాయకత్వం తిట్టించింది. రజనీ వయసు, స్థాయినీ మరిచిపోయి ఆయన్ను వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుని కొడాలి నాని, రోజా నానా మాటలన్నారు. ఆ నోటి దురుసు ఎఫెక్ట్ ఉంటుందో అర్థమైందా అంటూ ఈ ఎన్నికల్లో ఓటర్లు బుద్ధి చెప్పారు. ఇలాంటి సినీ వ్యతిరేక విధానాలను చిత్రసీమ, సినీ ప్రేమికులు, అభిమానులు గమనిస్తూనే వచ్చారు. ఎన్నికల్లో వారు చేయాల్సిన పనిని చేసి చూపించారు.
అగ్ర కథానాయకులు పవన్‌కల్యాణ్, బాలకృష్ణ ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయడంతోపాటు కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. వారిద్దరూ ఘన విజయాలు సొంతం చేసుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. వాళ్లిద్దరూ సాధించిన ఘనతలను, ప్రసంగాల వీడియోల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. నిర్మాణ సంస్థల కార్యాలయాలు, సినిమాల సెట్స్‌లోనూ సంబరాలు చేసుకున్నారు. పలువురు సినీ తారలు, ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబును, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణలకు శుభాకాంక్షలు చెప్పారు.
ఈనెల 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం! - CHANDRABABU WILL TAKE OATH AS AP CM ON JUNE 12
ఎన్నికలకు ముందే పవన్‌కల్యాణ్‌కు మద్దతుగా ఆయన పోటీ చేస్తున్న పిఠాపురం వెళ్లి ప్రచారంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో అంతగా ఆయనకు సినీపరిశ్రమ నుంచి ప్రోత్సాహం దక్కింది. ఫలితాలు వెలువడ్డాక కథానాయకుడు నితిన్ ఎక్స్ ద్వారా స్పందించారు. ఎన్నికల్లో విజయం సాధించడం, కూటమిని అగ్రస్థానానికి చేర్చిన తీరుపై ఓ అభిమానిగా, ఓ సోదరుడిగా థ్రిల్‌గా ఉందని, ఎంతో అద్భుతంగా పోరాడిన మీరు ఎప్పటికీ మా పవర్‌స్టార్ అంటూ అభినందించారు. ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్, బాలకృష్ణ, లోకేశ్‌లకు అగ్ర కథానాయకుడు రవితేజ అభినందనలు తెలిపారు.
ఓటర్ల చరిత్రాత్మక ఆదేశం ఇదంటూ చంద్రబాబునాయుడిని అగ్రనటుడు కమల్‌హాసన్ ఎక్స్ అభినందించారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ కొత్త పుంతలు తొక్కుతుందనడంలో సందేహం లేదంటూ అగ్రనటుడు మోహన్‌బాబు అభినందించారు. అద్భుతమైన విజయం సాధించిన పవన్‌కల్యాణ్‌కు అభినందనలంటూ ఎక్స్ ద్వారా ప్రముఖ కథానాయకుడు అల్లు అర్జున్ శుభాకాంక్షలు చెప్పారు.
చరిత్రాత్మకమైన విజయాన్ని సాధించిన మావయ్యకు, అద్భుతమైన మెజారిటీతో గెలిచిన లోకేశ్‌కు, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన శ్రీభరత్, పురందేశ్వరి అత్తకు హృదయపూర్వక శుభాకాంక్షలంటూ ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్‌రామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అలాగే ఘనవిజయం సాధించిన పవన్‌కల్యాణ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్‌కు ప్రముఖ నటుడు వెంకటేశ్, నాగార్జున, మహేశ్‌బాబు, రామ్‌చరణ్ శుభాకాంక్షలు తెలిపారు.