Today Private Hospitals Stop Aarogyasri Services in AP : రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య పథకం వైద్య సేవలను గురువారం నుంచి యాజమాన్యాలు నిలిపివేశాయి. బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఎన్నికల ప్రచారం కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్న సీఎం జగన్ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు మాత్రం బకాయిలు చెల్లించడం లేదు. బిల్లులు చెల్లించకుండా యాజమాన్యాలను ప్రభుత్వం బెదిరిస్తుండడంతో ఇప్పుడు ఆస్పత్రులు సేవలు నిలిపివేయాలని నిర్ణయించాయి.
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తామని హెచ్చరిక- ఇకపై ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సేవలు ఉండవా?
యాజమాన్యాల సంఘం తరపున ఎలాంటి నోటీసు, ప్రకటన ఇవ్వకుండా సేవలు నిలిపివేశాయి. పెండింగ్ బిల్లులు భారీగా పెరిగిపోవడం, వివిధ ప్రొసీజర్లు, సర్జరీల ప్యాకేజీల ధరలు పెంచేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే రోగులు, ఉద్యోగులకు ఇక అన్ని రకాల వైద్య సేవలను నిలిచిపోనున్నాయి. సేవల నిలిపివేతకు సంబంధించి ఆస్పత్రుల ఎదుట బోర్డులు ఏర్పాటు చేస్తామని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాల సంఘం ప్రతినిధి ఒకరు తెలిపారు.
Aarogyasri Dues in YCP Government : ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.1,200 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ బిల్లులు చెల్లించకుండా వైద్య సేవలు అందించాల్సి రావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ పథకాలకు ప్రైవేటు ఆస్పత్రులు సొంత నిధులను ఖర్చు చేయడం సాధ్యం కాదని యాజమన్యాలు తెలిపాయి. బిల్లుల పెండింగ్ కారణంగా ఆస్పత్రుల నిర్వహణ కష్టంగా మారిందని వెల్లడించాయి.
ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ హాస్పటల్స్‌కు బకాయిలు వెంటనే విడుదల చేయాలి: నారా లోకేశ్
వాస్తవంగా బిల్లుల చెల్లింపులో జాప్యం, ప్యాకేజీ ధరలను పెంచకపోవడాన్ని నిరసిస్తూ గత నెల 25నుంచే సేవలు నిలిపివేస్తామని గతంలో ఆస్పత్రుల యాజమాన్యాల సంఘం ప్రకటించింది. అప్పట్లో ఈ వివాదంపై చర్చలు జరిపిన ప్రభుత్వం వారిపై ఒత్తిడి తీసుకొచ్చి సేవలు కొనసాగించేలా చేసింది. ఈ చర్చలు ముగిసి నెల రోజులు గడిచినా బిల్లుల చెల్లింపులో ఎలాంటి పురోగతి లేదు. గత చర్చల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకున్న పరిస్థితి లేదు. దీంతో ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు గురువారం నుంచి ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్ సేవలు నిలిపివేయాలని స్వచ్చందంగా నిర్ణయం తీసుకున్నాయి. యాజమాన్యాల సంఘం తరపున ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే సేవలు నిలిపివేయాలని స్వచ్చందంగా నిర్ణయం తీసుకున్నాయి.
Aarogyasri: ఆరోగ్య శ్రీ ట్రస్టుకు బకాయిల సుస్తీ.. రూ.900 కోట్ల బిల్లుల పెండింగ్‌తో..
అయితే వైఎస్సార్సీపీ పాలకుల అసమర్థ ఆర్థిక నిర్వహణ వల్ల ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయే పరిస్థితులు నెలకొన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా వైద్యం చేసే నెట్వర్క్ ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,200 కోట్లు బకాయిలు పడిందని విమర్శించాయి. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని ఆసుపత్రుల నిర్వాహకులు అనేకమార్లు ప్రభుత్వాన్ని కోరినా స్పందించ లేదని ఆరోపించారు. అరకొరగా నిధులు ఇచ్చి పేదలకు ఉచితంగా వైద్యం చేయిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతోందని విమర్శించారు.
వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ట్రస్టు.. ప్రచారం ఘనం.. చెల్లింపులు శూన్యం