Low Temperature in Paderu : ఏపీలో చలి గాలుల ప్రభావంతో ప్రజలు అల్లాడుతున్నారు. పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో చలి మంటలతో తాత్కాలికంగా సేద తీరుతున్నారు.
చల్లదనాన్ని ఆస్వాదిస్తున్న పర్యటకులు : అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో చలి తీవ్రత పెరిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి గాలులు తీవ్రంగా వీస్తున్నాయి. పాడేరులో 10, మినములూరులో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. పొగమంచు దట్టంగా వ్యాపించటంతో రహదారులు కనిపించక వాహనచోదకులకు ఇక్కట్లు తప్పటం లేదు. రహదారులపై పొగ మంచు ఎక్కువగా ఉండటంతో వాహనాదారులు లైట్ల వెలుతురులో ప్రయాణం చేయాల్సి వస్తోంది. మరో వైపు పాడేరు ప్రాంతానికి పర్యటకుల తాకిడి ఎక్కువగా ఉంది. ప్రకృతిని మరింత అందంగా చూపిస్తున్న పొగ మంచు, చూపరులను కట్టిపడేస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో పర్యటకులు చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు.
ఉన్ని దుస్తులు ధరిస్తేనే బయటకు : శ్వాస సంబంధ సమస్యలు ఉన్నవారిని మాత్రం కాస్త కష్టపెడుతోంది. ఉన్ని దుస్తులు ధరిస్తే తప్ప బయటకు వెళ్లలేని పరిస్థితి. చలి మంటలు వేసుకుని ప్రజలు సేద తీరుతున్నారు.
ALERT : చురుకుగా రుతుపవనాలు - బంగాళాఖాతంలో మరో వాయుగుండం
"చలి తీవ్రత ఎక్కువగా ఉంది. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఉన్ని దుస్తులు వేసుకున్నా బయటకు రావడానికి ఆలోచిస్తున్నాం. కొందరు అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈ సీజన్లో చలి చాలా ఎక్కువగా ఉంటుంది."- స్థానిక ప్రజలు
"మంచు చాలా ఎక్కువగా ఉంది. చలికి మేము వణికి పోతున్నాం. ఇంత మంచు, చలి ఎప్పుడు, ఎక్కడ చూడలేదు. ఈ ప్రదేశం ఇంత ఆహ్లాదకరంగా ఉంటుందని ఇక్కడకు వచ్చాకే తెలిసింది."- పర్యటకురాలు
చంపేస్తున్న చలి : అల్లూరి జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. శనివారం ఉదయం జి.మాడుగులలో 8.9 డిగ్రీలు, అనంతగిరిలో 11.4, అరకులోయలో 10.4, చింతపల్లిలో 12.3 డుంబ్రిగుడలో 11.4, గూడెంకొత్త వీధిలో 12.2, హుకుంపేట 12.4, కొయ్యూరు 14.5, ముంచంగిపుట్టు 12. 3, పాడేరు 12, పెదబయలులో 12.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పల స్వామి తెలిపారు.