Govt Focus On Bonus For Fine Rice : రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసి సేకరించే సన్నరకం ధాన్యానికి ఇచ్చే బోనస్ చెల్లింపులకు సంబంధించిన కసరత్తు చివరి దశకు చేరింది. నేడో, రేపో విధివిధానాలను కూడా వెల్లడించే అవకాశం ఉంది. సన్న వడ్లకు బోనస్ ప్రకటించిన రేవంత్ సర్కారు, వానాకాలం సీజన్ నుంచే అమలు చేయనుంది. రైతులకు కనీస మద్దతు ధరను, బోనస్‌ను విడివిడిగా చెల్లించనున్నట్లుగా విశ్వసనీయ సమాచారం.
రైతులకు రూ.2,445 కోట్ల ప్రయోజనం : రాష్ట్ర వ్యాప్తంగా సన్నాల దిగుబడి 88.09 లక్షల టన్నులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఇందులో 48.91 లక్షల టన్నులు కొనుగోలు కేంద్రాలకు చేరుతాయని భావిస్తున్నారు. క్వింటా సన్నవడ్లకు రూ.500 చొప్పున బోనస్ రూపంలో రైతులకు రూ.2,445 కోట్ల ప్రయోజనం చేకూరనుందని పౌరసరఫరాల సంస్థ వర్గాలు చెబుతున్నాయి.
బోనస్‌తో కలిపి రూ.2,800-2,820 : రైతుల నుంచి సేకరించే ధాన్యానికి పౌరసరఫరాల సంస్థ చెల్లింపులను చేస్తుంది. ఇందుకు అవసరమయ్యే ఈ మొత్తాన్ని బ్యాంకుల నుంచి లోన్‌గా తీసుకుని ఎఫ్‌సీఐ నుంచి నగదు వచ్చాక ఆ రుణాన్ని తీరుస్తూ వస్తోంది. సన్న వడ్లకు బోనస్ ప్రకటించింది రాష్ట్ర సర్కారు కావడంతో కార్పొరేషన్ ద్వారా చెల్లించే అవకాశం లేదు. ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపులను పౌరసరఫరాల సంస్థ కేంద్ర ప్రభుత్వ (ఎఫ్‌సీఐ- భారత ఆహార సంస్థ) నిబంధనల ప్రకారం చేయాల్సి ఉంటుంది. ధాన్యానికి కనీస మద్దతు ధరను(ఎంఎస్పీ) 2024-25కు సంబంధించి క్వింటాకు కామన్ రకానికి 2,300 రూపాయలు, గ్రేడ్-ఏ రకానికి 2,320 రూపాయలుగా కేంద్రం నిర్ణయించింది.
కామన్ గ్రేడ్ రకానికి క్వింటాకు ఎంతంటే? : కొనుగోలు కేంద్రాల్లో సన్న వడ్లు విక్రయించే రైతులకు క్వింటాకు కామన్ గ్రేడ్ రకానికి రూ.2,800, గ్రేడ్-ఏ రూ.2,820 రానుంది. రైతులు ఇచ్చిన ధాన్యానికి- కనీస మద్దతు ధర మొత్తాన్ని(ఎంఎస్పీ) పౌర సరఫరాల సంస్థ అకౌంట్ నుంచే గతంలో మాదిరి చెల్లింపులు చేస్తారు. బోనస్ డబ్బును మాత్రం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు విడిగా చెల్లించే అవకాశం ఉంది. రైతు భరోసా మాదిరిగా సన్నాల బోనస్ కూడా ఈ-కుబేర్ ద్వారా రైతుల ఖాతాల్లో జమచేయనున్నట్లుగా పౌరసరఫరాల సంస్థ వర్గాలు భావిస్తున్నాయి.