Akkamahadevi Caves in Srisailam : ప్రకృతి అందాలకు నెలవైన నల్లమల అడవుల్లో కృష్ణా నది ఒడ్డున ఉన్న అక్కమహాదేవి గుహ. ప్రకృతి, ఆధ్యాత్మిక పర్యాటకుల గమ్యస్థానాల్లో ఒకటి. ఈ గుహను సందర్శించాలంటే ఇప్పటివరకు శ్రీశైలంలోని పాతాళగంగ వద్ద నుంచి 16 కిలోమీటర్ల దూరం కృష్ణా నదిలో పడవలో ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంది. ఇకముందు తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట నుంచి రోడ్డు మార్గంలో ఈ గుహకు, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలకు వెళ్లిరావచ్చు. దీనికోసం అటవీ ప్రాంతంలో ఐదు కిలోమీటర్ల మేర ఆ రాష్ట్ర అటవీశాఖ రహదారిని నిర్మించింది. దోమలపెంట నుంచి సఫారీ ప్రారంభం కానుంది.
దట్టమైన నల్లమల అడవిలో పచ్చని అందాలు, వన్యప్రాణుల సందడి మధ్య ఐదు కిలోమీటర్లు జీపులో ప్రయాణం చేయాలి. ఆ తర్వాత ఓ అర కిలోమీటరు దూరం ట్రెక్కింగ్ చేస్తే సరి. నిలువెత్తు గిరుల మధ్యలో ఉండే అక్కమహాదేవి గుహ లోపలికి వెళ్లిరావచ్చు. తెలంగాణలో ప్రకృతి పర్యాటకాన్ని పెంచేందుకు అటవీశాఖ ఆక్టోపస్ వ్యూ పాయింట్, వజ్రాలమడుగు, అక్కమహాదేవి గుహ ప్యాకేజీని అందుబాటులోకి తెస్తోంది. దీన్ని కొద్దిరోజుల్లోనే ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
ఇద్దరికి రూ.6500 నుంచి రూ.8000 : అక్కమహాదేవి గుహ పర్యాటకుల కోసం రూపొందించిన ప్యాకేజీలో- బస చేసేందుకు గది, అల్పాహారం, భోజనం, రెండుసార్లు సఫారీ ఉంటాయి. ‘ఇద్దరికి కలిపి రూ.6,500, రూ.7,500, రూ.8,000 ఇలా మూడు రకాల టారిఫ్‌లు అందుబాటులో ఉంటాయి. గది విస్తీర్ణం, రివర్ వ్యూను బట్టి ఈ ధరలు ఉంటాయి’ అని అటవీ అధికారి ఒకరు ఈనాడుకు వివరించారు. దోమలపెంటలో హిల్‌టాప్ పక్కన ఉన్న ఓ గెస్ట్‌హౌస్‌ను అటవీశాఖ ఆధునికీకరించింది.
దారిలో వన్యప్రాణుల్ని చూడొచ్చు : మధ్యాహ్నం 2 గంటలకు దోమలపెంట గెస్ట్‌హౌస్ నుంచి సఫారీ మొదలు కానుంది. ఆక్టోపస్ వ్యూపాయింట్, వజ్రాలమడుగుకు జీప్‌లో తీసుకెళ్లి చూపిస్తారు. రాత్రి గెస్ట్‌హౌస్‌లో బస డిన్నర్. మరుసటిరోజు ఉదయం 7 గంటలకు మరోసారి సఫారీ అక్కమహాదేవి గుహకు పయనం. అల్పాహారంతో కూడిన టిఫిన్ బాక్స్ ఇస్తారు. దారి మధ్యలో చిరుత పులులు, కొండచిలువలు, ముళ్ల పందులు, అడవి కుక్కలు, జింకలు, రకరకాల పక్షుల్ని చూసే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి గెస్ట్‌హౌస్‌కు తీసుకొస్తారు. ఓ టిఫిన్ బాక్స్, జ్యూట్ బ్యాగ్‌ని పర్యాటకులకు ఉచితంగా ఇవ్వాలని అటవీశాఖ యోచిస్తోంది.
ఇవీ ప్రత్యేకతలు : అక్కమహాదేవి గుహలో సహజసిద్ధంగా ఏర్పడ్డ శివలింగం ఉంది. కర్ణాటకకు చెందిన అక్కమహాదేవి అనే శివ భక్తురాలు 12వ శతాబ్దంలో ఇక్కడ తపస్సు చేశారని సమీపంలోని కదలీవనంలో శివైక్యం చెందారని చెబుతారు. గుహ ముందు భారీ శిలాతోరణం కనిపిస్తుంది. ఇక దోమలపెంట సమీపంలో ఉండే ఆక్టోపస్ పాయింట్ నుంచి వీక్షిస్తే కృష్ణా నది ఆక్టోపస్‌లా కనబడుతుంది. దోమలపెంట సమీపంలోనే ఉండే వజ్రాలమడుగులో ఒకప్పుడు వజ్రాలు లభించేవని ప్రతీతి.
పర్యాటకులకు గుడ్‌న్యూస్ - నాగార్జునసాగర్ టూ శ్రీశైలం లాంచీ జర్నీ స్టార్ట్