Palla Srinivasa Rao Comments on YS Jagan: మాజీ సీఎం జగన్ ఓటమిని ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారని విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. గత ఎన్నికల్లో 151 స్థానాలు కైవసం చేసుకుని కాలరెగరేసిన జగన్, ఈసారి 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా లేకపోయేసరికి తన హుందాతనాన్ని మరిచిపోయారన్నారు. జగన్ ప్రతి పక్ష హోదా లేకపోయినా సభలో వారి పట్ల హుందాతనంగా ఉండాలని సీఎం చంద్రబాబు చెప్పారని, జగన్ మాత్రం ఆ విధంగా వ్యవహరించడం లేదని శ్రీనివాసరావు అన్నారు. అందుకు అసెంబ్లీ తొలి సమావేశానికి జగన్ గైర్హాజరు కావటమే నిదర్శనమని విమర్శించారు.
ప్రజా వేదిక కూల్చి వేతకు శ్రీకారం చుట్టింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం అని, అనుమతులు లేని వైఎస్సార్సీపీ కార్యాలయాలను కూల్చివేస్తుంటే తెలుగుదేశంపై జగన్ విమర్శలు చేయటం సరికాదని అన్నారు. అమరావతిలో నీటి పారుదల శాఖ స్థలంలో అనుమతి లేకుండా పార్టీ కార్యాలయం ఎలా కట్టారో వైఎస్సార్సీపీ నాయకులు చెప్పాలన్నారు. ప్రజస్వామ్యయుతంగా తమ ప్రభుత్వం పాలన సాగిస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం పోలవరం, అమరావతి అంశాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ప్రమాణ స్వీకార సమయంలో చట్టాలు గౌరవిస్తాను అని చెప్పిన జగన్, మరుసటి రోజునే ఆ మాట మరచి పోయారు అన్నారు. జగన్మోహన్ రెడ్డికి చట్టాలు అంటే గౌరవం ఉంటే ఇకనైనా సభలకు వచ్చి ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలన్నారు.
100 రోజుల్లోనే అక్రమ కేసులను ఎత్తేస్తాం: గత అయిదేళ్లలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలపై పెట్టిన రాజకీయ ప్రేరేపిత కేసులను 100 రోజుల్లోనే తొలగిస్తామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు వెల్లడించారు. కాకినాడ జిల్లా తునిలో నియోజకవర్గ ఎమ్మెల్యే యనమల దివ్య విజయోత్సవ సభలో మంత్రి వాసంశెట్టి సుభాష్‌తో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ కష్టపడ్డ కార్యకర్తలు, నాయకులకు నామినేటెడ్ పదవులు ఇచ్చి ప్రభుత్వంలో భాగస్వాములను చేస్తామన్నారు. కార్యకర్తల కష్టానికి పార్టీ గుర్తింపు ఇస్తుందన్నారు.
గత ఐదేళ్లలో కార్మికులకు చెందిన ఎన్నో పథకాలను జగన్ రద్దు చేశారని మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు. ప్రజా స్వామ్యాన్ని రక్షించుకోవడంలో ప్రజల పాత్ర ఎంతో ముఖ్యమైనదని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. గత ఐదేళ్లలో వందల కోట్లు అక్రమంగా సంపాదించిన నాయకులు అంతా ఎన్నికల్లో డబ్బుతో గెలవాలని భావించి ఓటమి పాలయారన్నారు. జగన్ ఒంటెద్దు పోకడలకు ప్రజలు ఓట్లతో బుద్ధి చెప్పారని యనమల అన్నారు. యనమల దివ్య విజయోత్సవ సభకు భారీగా అభిమానులు తరలివచ్చారు.