TDP Leaders on Postal Ballot Voting: పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ విషయంలో గందరగోళం సృష్టించారని టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార్ (Kanakamedala Ravindra Kumar) అన్నారు. ఎండల్లో గంటలతరబడి కూర్చొంటే అక్కడికి ఇక్కడికి తిప్పారని మండిపడ్డారు. కొన్నిచోట్ల ఓట్లు గల్లంతు అయ్యాయని, మరికొన్ని ఓట్లు ఎక్కడో తెలియక ఆందోళన చెందారని తెలిపారు. దిల్లీలో మీడియా సమావేశంలో కనకమేడల మాట్లాడారు.
పులివెందులలో ఉద్యోగులకు ఓటుకు రూ.2 వేలు చొప్పున పంపిణీ చేశారని అన్నారు. రూ.2 వేలతో పాటు మరో రూ.116 కలిపి తిరిగి ఇచ్చేసిన సంఘటన జరిగిందని పేర్కొన్నారు. ఉద్యోగుల ఓట్లు కూడా కొనాలని వైఎస్సార్సీపీ కుట్ర చేసిందన్న కనకమేడల, ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా పోస్టల్ ఓటింగ్ వినియోగించుకున్నారని తెలిపారు. అవినీతికి సహకరించిన అధికారులకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.
జగన్ అధికార దుర్వినియోగానికి సహకరించిన అధికారులు ఇకనైనా మారాలన్న కనకమేడల, ముందే మేలుకుంటే కఠిన శిక్షల నుంచి తప్పించుకోవచ్చని సూచించారు. అదే విధంగా పింఛనర్ల జీవితాలతో ఆడుకున్నవాళ్లపై విచారణ చేయాలని, వృద్ధుల మరణాలపై విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం 50 మందిని బలిపెట్టిన వారిపై చర్యలు తప్పవని మండిపడ్డారు.
Bonda Umamaheswara Rao Comments: వైఎస్సార్సీపీ అరాచకాలపై కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించినట్లుగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం స్పదించట్లేదని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా మహేశ్వరరావు విమర్శించారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవడానికి కూడా ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్న చొరవ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి లేకపోవటం వెనుక మర్మం ఏమిటో తెలియాలని అన్నారు.
వెలంపల్లి శ్రీనివాస్ పోస్టింగ్ వేయించాడని విజయవాడ నార్త్ ఏసీపీ ప్రసాద్, నున్న సీఐ దుర్గాప్రసాద్‌లు వైఎస్సార్సీపీ తొత్తుల్లా పని చేస్తున్నారని బొండా ఉమా మండిపడ్డారు. వాళ్లు చెప్పినట్లు పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయలేదని ఎస్టీ సర్వేయర్‌పై వైఎస్సార్సీపీ కార్పొరేటర్ గణేష్ భర్త దాడి చేయించాడని ఆరోపించారు. ఘటనపై వైఎస్సార్సీపీ నేతల మీద నామమాత్రపు కేసులు పెట్టి, బాధితులపైనా ఎదురు కేసులు నమోదు చేశారని అన్నారు.
గతంలో సదరు అధికారులపై ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. మీనా ఎందుకు భయపడతున్నారో సమాధానం చెప్పాలని, అధికార పార్టీ పట్ల అంత మెతక వైఖరి దేనికో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. స్లీపింగ్ మోడ్‌లో ఉంటూ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తోందన్నారు. విజయవాడలో ఇద్దరి అధికారుల భాగోతంపై కేంద్ర ఎన్నికల సంఘానికి, కొత్త డీజీపీకి ఫిర్యాదు చేస్తామని బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు.