TDP Chief Chandrababu Naidu on PM Nomination Varanasi : టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారణాసి చేరుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ నామినేషన్ కార్యక్రమంలో వారిద్దరూ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారణాసిలో మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే 400 సీట్లు సాధించబోతోందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. 2047కు వికసిత భారత్ లక్ష్యంగా మోదీ పని చేస్తున్నారని చెప్పారు. ప్రపంచంలోనే మన దేశం కీలక పాత్ర పోషించనుందన్నారు.
'రాష్ట్రంలో ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేస్తుంది.ప్రపంచంలోనే భారతదేశం కీలక పాత్ర పోషించబోతుంది. 2047కు వికసిత్ భారత్ లక్ష్యంగా మోదీ కృషి చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు 400కు పైగా సీట్లు వస్తాయి.' -చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అధినేత
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల్లో 121 చోట్ల హింసాత్మక ఘటనలు జరిగినట్లు టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రాంతాల వారీగా జరిగిన సంఘటనల వివరాలను ఫొటోలతో సహా చూపుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన 15 పేజీల లేఖలు రాశారు. ఈ లేఖను పార్టీ జాతీయ ఎన్నికల సమన్వయకర్త కనకమేడల రవీంద్రకుమార్ ఇక్కడి నిర్వాచన్ సదన్‌లో ఎన్నికల కమిషన్ అధికారులకు అందజేశారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో అనేక నియోజకవర్గాల్లో మునుపెన్నడూ లేనంత హింసాత్మక ఘటనలు జరిగాయని, బలగాలను మోహరించడంలో పోలీసులు విఫలం కావడమే ఇందుకు ప్రధాన కారణమని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
పోలింగ్ అనంతరం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో విలేకరులతో అధినేత చంద్రబాబు చిట్‌చాట్ నిర్వహించారు. వైఎస్సార్సీపీ కుట్రల్ని ప్రజల సహకారంతో టీడీపీ శ్రేణులు ఎక్కడిక్కడ భగ్నం చేశాయన్నారు. యువత, మహిళలు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల్లోనూ ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత పెల్లుబికిందన్నారు. ఓటుతో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారని వెల్లడించారు. పక్క రాష్ట్రాల నుంచి కొందరైతే ఇతర దేశాల నుంచి కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం పట్ల హర్షం వ్యక్తంచేశారు. ఈ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు చూడబోతున్నామని తెలిపారు.
ప్రతి ఓటరుకు ధన్యవాదాలు: రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు అని ఓటు వేయడానికి ప్రజలు చూపించిన ఉత్సాహం, వారిలో వెల్లివిరిసిన చైతన్యం చూసాక కొత్త చరిత్రకు ఇది శ్రీకారం అనిపించిందని కొనియడారు. అరాచకానికి ముగింపు పలికి ప్రజాస్వామ్య పాలన సాధించుకోవాలనే కసి పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ప్రతి ఓటరు లోనూ స్పష్టంగా కనిపించిందన్నారు. ఒకే రకమైన సంకల్పంతో ఓటు వేయడానికి వందల, వేల కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చారని, ఆర్థిక భారాన్ని, ఎండ వేడిమిని, ప్రయాణ కష్టాన్ని ఓర్చుకుని రాష్ట్రం కోసం పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చిన ప్రతి ఓటరుకు అధినేత హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.
రికార్డ్‌పై కన్ను: దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ప్రధాని నరేంద్ర మోదీ మరో రికార్డుపై కన్నేశారు. ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయాలని పట్టుదలగా ఉన్నారు. తద్వారా మాజీ ప్రధాన మంత్రులు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, అటల్‌బిహారీ వాజ్‌పేయీల సరసన చేరాలని ఉవ్విళ్లూరుతున్నారు. మరి మోదీ వారి సరసన నిలుస్తారా లేదా అన్న ప్రశ్న ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.