Sunkishala Retaining Wall Collapsed at Nagarjuna Sagar : నాగార్జునసాగర్ వద్ద సుంకిశాల రిటెయినింగ్ వాల్ కూలిపోయింది. ఆగస్టు 1న జరిగిన ఈ ఘటనను అధికారులు గోప్యంగా ఉంచారు. కార్మికులు షిఫ్టు మారే సమయంలో ఘటన జరగడంతో పెను ప్రమాదం తప్పింది. సుంకిశాల రిటెయినింగ్ వాల్ కూలి క్షణాల్లో పంప్‌హౌస్ జలదిగ్భందమైంది. హైదరాబాద్ తాగు నీటి అవసరాల కోసం సుంకిశాల పథకం చేపట్టిన విషయం తెలిసిందే. సొరంగాల్లోకి జలాలు రాకుండా రక్షణగా రిటెయినింగ్ వాల్ నిర్మించారు. రిటెయినింగ్ వాల్ కూలడంతో సుంకిశాల పంపుహౌస్ నీట మునిగింది.
Heavy Flood Water Flow To Nagarjuna Sagar : మరోవైపు నాగార్జునసాగర్‌కు ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తుతోంది. 26 గేట్లు ఎత్తి అధికారులు నీటి విడుదల చేస్తున్నారు. 22 గేట్లు 5 అడుగులు, 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని వదులుతున్నారు. నాగార్జునసాగర్ ఇన్‌ఫ్లో 2.53 లక్షల క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 2.69 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.30 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ 312.50 టీఎంసీలు కాగా ప్రస్తుతం 298.30 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సూర్యాపేట జిల్లా పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు 11 రేడియల్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
నాగార్జునసాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు - 8 గేట్లు ఎత్తి నీటి విడుదల - Nagarjuna Sagar Dam Gates open
ఇక శ్రీశైలం జలశయానికి కూడా వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు 10 గేట్లు 12 అడుగులు ఎత్తి నీటి విడుదల చేస్తున్నారు. స్పిల్ వే ద్వారా 3.08 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 3.30 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 882.60 అడుగులకు చేరింది.
జలాశయం గరిష్ఠ నీటినిల్వ 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటినిల్వ 202.50 టీఎంసీలు ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి ముమ్మరంగా చేస్తూ 65,359 క్యూసెక్కుల నీరు సాగర్‌కు విడుదల చేస్తున్నారు. మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 38.1 అడుగులుగా ఉంది. తాలిపేరు జలాశయం 24 గేట్లు ఎత్తి 57,769 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
నిజామాబాద్‌లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టును వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 9,065 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతోంది. కాకతీయ కాలువ ద్వారా 1,333 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వారా 33 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 67 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 1080.80 అడుగులకు నీరు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటినిల్వ 47.25 టీఎంసీలుగా ఉంది.
జూరాల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 2.80 లక్షల క్యూసెక్కులుగా ఉండగా 39 గేట్ల ద్వారా 2.83 లక్షల క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 317.81 మీటర్లకు చేరింది. పూర్తి నీటనిల్వ 9.65 టీఎంసీలకు ప్రస్తుతం నీటినిల్వ 8.24 టీఎంసీలుగా ఉంది.