YCP Officials key Positions in Government : వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డితో అంటకాగి టీడీపీ నేతలపై దౌర్జన్యాలకు తెగబడ్డ కొందరు అధికారులకు కూటమి ప్రభుత్వంలోనూ కీలక పదవులు దక్కాయి. కర్నూలు జిల్లా డీఆర్‌డీఏ పీడీగా ఇటీవల పోస్టింగు పొందిన ప్రతాప్‌రెడ్డి బుగ్గన మంత్రిగా ఉన్న ఐదేళ్లూ ఆయనకు వ్యక్తిగత సహాయ కార్యదర్శిగా పనిచేశారు. విజయవాడ నగర డీసీపీ(క్రైం)గా పోస్టింగు పొందిన తిరుమలేశ్వర్‌రెడ్డి గతంలో కర్నూలు ప్రాంతీయ విజిలెన్స్ అధికారిగా విధులు నిర్వర్తించారు.
మంత్రి లోకేశ్‌కు లేఖలు : వైఎస్సార్సీపీ హయాంలో ప్రజలను, ప్రతిపక్షాలను పీడించినవారికి ఇప్పుడు పదవులు దక్కడంతో తెరవెనుక ఎవరున్నారన్న విషయంపై కర్నూలు జిల్లాలో చర్చ జరుగుతోంది. కొందరు తెలుగుదేశం పార్టీ అభిమానులు గతంలోని అధికారుల అక్రమాల చరిత్రపై మంత్రి లోకేశ్‌కు లేఖలు రాశారు. మరి కొందరు లోకేశ్‌ను స్వయంగా కలిసి పోస్టింగు ఉత్తర్వులు రద్దుచేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది.
ఆయన హవా కొనసాగింది : బుగ్గన సొంత గ్రామమైన బేతంచెర్లలో ప్రతాప్‌రెడ్డి రెండుసార్లు ఎంపీడీఓగా పనిచేశారు. దీంతో బుగ్గనతో సాన్నిహిత్యం పెరిగి ఆయన వ్యక్తిగత సహాయ కార్యదర్శి వరకూ వెళ్లారు. అప్పట్లో మంత్రిగా ఉన్న బుగ్గన తరఫున ప్రతాప్‌రెడ్డే జిల్లా అధికారులతో మాట్లాడేవారు. దీంతో ఉమ్మడి జిల్లాలో ఆయన హవా కొనసాగింది. తిరుమలేశ్వర్‌రెడ్డి జిల్లా ప్రాంతీయ విజిలెన్స్ అధికారిగా పనిచేసిన మూడేళ్లూ టీడీపీకు చెందిన గనుల యజమానులపై పెద్దఎత్తున దాడులు జరిగాయి.
టీడీపీ వారే లక్ష్యం : తెలుగుదేశం పార్టీ వారే లక్ష్యంగా దాడులు చేస్తున్నారని బాధితులు అప్పట్లోనే లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. డోన్ మాజీ కౌన్సిలర్ ఫణిరాజ్‌పై కేసులూ పెట్టారు. తర్వాత తిరుమలేశ్వర్‌రెడ్డి నెల్లూరు జిల్లా ఎస్పీగా వెళ్లి, ప్రస్తుత మంత్రి నారాయణ ఇంట్లో పెద్దఎత్తున తనిఖీలు చేశారు. ఉదయగిరి నియోజకవర్గంలోని తిరుమలేశ్వర్‌రెడ్డి మామ వైఎస్సార్సీపీ నాయకుడిగా గుర్తింపు పొందారు.