Volleyball Coach Srinivasa Rao Success Story: క్రీడాకారుడిగా ఎదిగే క్రమంలో తాను ఎదుర్కొన్న శిక్షణ సమస్యలు నేటితరం ఆటగాళ్లకు రావొద్దని సంకల్పించాడీ యువకుడు. స్కూల్ గేమ్స్, జోనల్, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించిన అనుభవం, అంతర్జాతీయ వాలీబాల్ సమాఖ్య నిర్వహించిన కోర్సులో నేర్చుకున్న నైపుణ్యాలను జత చేసి విద్యార్థులకు తర్ఫీదు ఇస్తూ వారిని ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నాడు.
వాలీబాల్ క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్న ఈ యువకుడి పేరు నక్కా శ్రీనివాసరావు. పల్నాడు జిల్లా మైదోవోలు గ్రామానికి చెందిన నిరుపేద వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. చిన్నతనం నుంచే ఈ యువకుడికి ఆటలంటే ఆసక్తి. తల్లిదండ్రులు వద్దని వారించినా వినకుండా క్రీడల్లోకి ప్రతిభా పాఠవాలను నేర్చకోవడం ప్రారంభించాడు.
శ్రీనివాసరావు వాలీబాల్ క్రీడలోని ఒనమాలు నేర్చుకున్న అనతికాలంలోనే జిల్లా, రాష్ట్రస్థాయి టోర్నమెంట్లలో తనదైన ప్రతిభతో పతకాలు సాధించాడు. 2007లో ఇంటర్ జోన్ పోటీల్లో బంగారు పతకం సాధించి అదరహో అనిపించాడు. అనతంరం జాతీయ స్థాయి పోటీల్లో రాణించి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకున్నాడు శ్రీనివాసరావు.
ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తూ - తైక్వాండోలో రాణిస్తున్న విజయవాడ అమ్మాయి - Taekwondo pavani sai
వాలీబాల్ నేర్చుకునే క్రమంలో చాలా ఒడిదుడుకులను ఎదుర్కున్నాడీ క్రీడాకారుడు. శిక్షణ సరిగ్గా లేక ఉన్నతంగా ఎదగలేకపోయాడు. తనలాగా ఎవ్వరు ఇబ్బంది పడి ఆటలకు దూరం కావొద్దని తలచాడు. 2022లో అంతర్జాతీయ వాలీబాల్ సమాఖ్య ఎఫ్‌ఐవీబీ నిర్వహించే శిక్షణ కోర్సుకు అర్హత సాధించి లెవల్ 1 పూర్తి చేశాడు. ఈ ఏడాది థాయ్‌లాండ్‌లో అంతర్జాతీయ వాలీబాల్ సమాఖ్య కేంద్రం నుంచి లెవల్ 2 కోర్సునూ విజయవంతంగా పూర్తి చేసి అంతర్జాతీయ కోచ్‌గా అవతారమెత్తాడు.
చిన్న వయసులోనే అంతర్జాతీయ కోచ్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీనివాసరావు. అంతకు ముందే నేషనల్ స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కోచింగ్ కోర్సు పూర్తిచేసి మహిళల అండర్-19 రాష్ట్ర వాలీబాల్ జట్టుకు నాగార్జున విశ్వవిద్యాలయం సౌత్ జోన్ పోటీల్లో ఏఎన్‌యూ జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. అనంతరం గుంటూరు పరిసర ప్రాంత యువతకు వాలీబాల్‌లో తర్ఫీదు ఇవ్వడంపై దృష్టి సారించినట్లు శ్రీనివాసరావు చెబుతున్నాడు.
వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే ఆసక్తి గల క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నాడీ యువకోచ్. అలా తర్ఫీదు పొందిన విద్యార్థులు జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటుతున్నారు. తనకు ఒనమాలు నేర్పిన పాఠశాలకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో అక్కడి విద్యార్థులకు వాలీబాల్ క్రీడలోని నైపుణ్యాలను ఒంటపట్టిస్తున్నాడు.
చిన్నవయసులోనే అంతర్జాతీయ వాలీబాల్ కోచ్‌గా రాణిస్తున్న శ్రీనివాసరావును చూస్తుంటే గర్వంగా ఉందని పాఠాశాల ఉపాధ్యాయులు అంటున్నారు. విద్యార్థులను అద్భుత క్రీడకారులుగా తీర్చిదిద్దుతున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాలీబాల్ క్రీడలోని నైపుణ్యాలను తమకు అర్థవంతగా వివరిస్తున్నారని తర్ఫీదు పొందుతున్న క్రీడాకారులు అంటున్నారు. ఇలాగే శిక్షణ పొందితే భవిష్యత్తులో ఉన్నతస్థాయికి చేరుకోగలమనే నమ్మకం తమలో కల్గిందని చెబున్నారు.
క్రీడాకారుడిగా మంచి ప్రతిభ చూపినా సరైన దిశలో నడిపించే కోచ్ లేని కారణంగా ఉన్నత స్థాయికి ఎదగలేకపోయాడు శ్రీనివాసరావు. తనలాగే ఎంతో మంది గ్రామీణ క్రీడాకారులు ఇదే సమస్యతో క్రీడా ప్రయాణాన్ని మధ్యలోనే ఆపేస్తున్నారని, ఆ సమస్య రేపటి తరాలకు రాకూడదని భావించి అనతి కాలంలోనే కోచ్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
"నాకు చిన్నప్పటి నుంచీ వాలీబాల్ అంటే ఇష్టం. అయితే శిక్షణ సరిగ్గా లేక నేను ఉన్నతంగా ఎదగలేకపోయాను. నా పరిస్థితి ఎవరికీ రావద్దని కోచ్‌గా క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నాను. ఈ క్రమంలోనే నేను అంతర్జాతీయ వాలీబాల్ కోచ్‌గా గుర్తింపు పొందాను." - నక్కా శ్రీనివాసరావు, వాలీబాల్ కోచ్