SIT Report on Post Poll Violence : పోలింగ్ రోజు, ఆ తర్వాత రాష్ట్రంలో తీవ్రహింసాత్మక ఘటనలకు సంబంధించి వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలోని సిట్ నివేదికను సమర్పించింది. పల్నాడు జిల్లాలోని మాచర్ల, నరసరావుపేట, గురజాల నియోజకవర్గాల పరిధిలో నమోదైన 22 కేసులు, తిరుపతి జిల్లాలోని చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల పరిధిలో నమోదైన 4 కేసులు, అనంతపురం జిల్లా తాడిపత్రి పరిధిలో నమోదైన 7 కేసులను సిట్ బృందాలు సమీక్షించాయి. ఆయా కేసుల రికార్డుల్ని పరిశీలించాయి. ఘటనా స్థలాన్ని సందర్శించాయి. దర్యాప్తు అధికారులు, బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించాయి.
Post Poll Violence in Andhra Pradesh : ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలనూ పరిశీలించాయి. హింసాత్మక ఘటనల తీవ్రత ఆధారంగా ఆయా కేసుల్లో సంబంధిత సెక్షన్లు వర్తింపజేశారా? లేదా? నిందితులందర్నీ గుర్తించారా? లేదా? అనే అంశాలపై విచారణ జరిపాయి. పలు కేసుల్లో అవసరమైన సెక్షన్లు పెట్టకుండా తేలికపాటి సెక్షన్లు పెట్టారని గుర్తించాయి. సంబంధిత సెక్షన్లు వర్తింపజేస్తూ వెంటనే కోర్టుల్లో మెమోలు దాఖలు చేయాలని ఆదేశించాయి. ఇలా ప్రతి కేసు వివరాలు, వాటిలో వర్తింపజేయాల్సిన సెక్షన్లు, ఇప్పటి వరకూ జరిగిన దర్యాప్తు, అందులోని లోపాలు తదితర వివరాలన్నింటినీ సిట్ తన నివేదికలో పొందుపరిచింది.
33 చోట్ల హింసాత్మక ఘటనలు - ఏపీలో ఎన్నికల హింసపై సిట్ నివేదిక - డీజీపీకి అందజేత - SIT report to DGP
తీవ్ర హింసాత్మక ఘటనలకు సంబంధించిన 33 కేసుల్లో 1,370 మంది నిందితులు కాగా వారిలో ఇప్పటివరకు 731 మందినే గుర్తించారు. మరో 639 మంది నిందితుల్ని గుర్తించాల్సి ఉంది. ఆయా కేసుల్లో 124 మందినే అరెస్టు చేశారు. 94 మందిని అరెస్టు చేయకుండా సీఆర్‌పీసీ 41ఏ సెక్షన్ కింద నోటీసులిచ్చారు. నిందితుల్ని గుర్తించేందుకు, అరెస్టు చేసేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు డీజీపీకి సిట్ నివేదించింది.
మాచర్ల, నరసరావుపేట నియోజకవర్గాల్లో మారణాయుధాలతో దాడులు, వాహనాల దహనాలు, రాళ్లు విసురుకోవటం వంటి ఘటనలతో హింస పెచ్చరిల్లింది. వాటిలో తీవ్రమైన 18 కేసుల్లో 474 మందిని నిందితులుగా గుర్తించగా ఇప్పటివరకు ఒక్కర్ని కూడా అరెస్టు చేయలేదు. 67 మందికి మాత్రం సీఆర్‌పీసీ 41ఏ నోటీసులిచ్చారు. గురజాల నియోజకవర్గంలో హింసకు సంబంధించిన 4 కేసుల్లో 107మందిని నిందితులుగా గుర్తించినా 19 మందినే అరెస్టు చేశారు. తాడిపత్రిలో హింసకు సంబంధించి 7 కేసుల్లో 728 మంది నిందితులున్నారు. వీరిలో 91 మందినే అరెస్టు చేశారు. చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల్లో 4 కేసుల్లో 61 మందిని నిందితులుగా గుర్తించగా వారిలో 14 మందిని మాత్రమే అరెస్టు చేశారు.
సిట్ బృందాలకు క్షేత్రస్థాయి పర్యటనలో పలువురు బాధితులు ఫిర్యాదులిచ్చారు. వినతి పత్రాలు సమర్పించారు. వాటన్నింటినీ సిట్ పరిశీలిస్తోంది. ఏదైనా ఘటనల్లో కేసులు నమోదు కాకపోతే వాటి ఆధారంగా కొత్త ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయనున్నారు.