Set Fire to Documents at Tadepalli SIT Office: తాడేపల్లి సిట్ కార్యాలయం ప్రాంగణంలో పలు కాగితాలు దహనం చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. తగలపెట్టక ముందు సదరు కాగితాలపై హెరిటేజ్ సంస్థ లోగో స్పష్టంగా కనిపించింది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేసినట్లు ఆ కాగితాల్లో ఉంది. వందల కొద్దీ కాగితాలను ఓ సంచిలో తీసుకొచ్చిన ఇద్దరు వ్యక్తులు వారే స్వయంగా వాటికి నిప్పంటించారు. కాగితాలన్నీ పూర్తిగా కాలిపోయేవరకూ అక్కడే ఉన్నారు. కొన్ని కాగితాలు ఎగిరిపోతుంటే కర్రతో వాటిని మంటల్లోకి లాగారు. తగలపెట్టే సమయంలో చంద్రబాబు కి సంబంధించిన పత్రాలివీ అంటూ వారు మాట్లాడుకున్న మాటలు సైతం బయటకు వచ్చాయి.
జగన్ సర్కారు నిర్లక్ష్యంతో నీటి కోసం ప్రజల అవస్థలు - water crisis at kurnool
ఈ పత్రాలు దహనం చేయటం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిట్ కార్యాలయ సిబ్బందే హెరిటేజ్ సంస్థకు చెందిన పలు కాగితాలను తగలపెట్టారని తెలుగుదేశం నేతలు, స్థానికులు ఆరోపిస్తున్నారు. పత్రాలు తగలపెట్టిన వీడియోలు కొందరు చిత్రీకరిస్తున్నారని గమనించిన సదురు వ్యక్తులు ఆ వీడియోలు ఫోన్లలో నుంచి తొలగించాలని, అవి తమకు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. సిట్ అధిపతి కొల్లి రఘురామ్ రెడ్డి ఈమేర ఆదేశాలు జారీ చేసినట్టు కూడా వారిని బెదిరించే యత్నం చేశారు. రఘురామ్ రెడ్డి వ్యక్తిగత సిబ్బందే నేరుగా పత్రాలు తెచ్చి తగలబెట్టారని తెలుగుదేశం వర్గాలు విమర్శిస్తున్నాయి. జగన్ ఆదేశాలతో చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు సిట్ అనేక అక్రమ కేసులు బనాయించిందని పార్టీ వర్గాలు మండిపడుతున్నాయి. చంద్రబాబుకి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలి అంటూ అనేక మంది పై ఒత్తిడి తెచ్చిన ఘటనలు తెలుగుదేశం నేతలు గుర్తు చేస్తున్నారు.
మూడు గుంతలు పూడ్చలేరు గానీ, మూడు రాజధానులు కడతారా?: చంద్రబాబు - Vuyyuru Praja Galam meeting
గత ఏడాది ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కు సంబంధించి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ నారా లోకేశ్ కు నోటీసులు జారీ చేసి వరుసగా రెండురోజులు విచారణకు పిలిచింది. విచారణ అనంతంరం ఎటువంటి అనుమతులు లేకుండా హెరిటేజ్, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి ఐటీ రిటర్న్స్, ఇతర కీలక డాక్యుమెంట్స్ దొడ్డి దారిన సంపాదించి తనని బెదించారని అప్పట్లో లోకేశ్ సీఐడీపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేసు తో సంబంధం లేని వారి వ్యక్తిగత పత్రాలు మీ చేతికి ఎలా వచ్చాయి అని ఆరోజే లోకేశ్ అధికారులను నిలదీశారు. ఇప్పుడు అన్ని సర్వేలు ఎన్డీఏ కూటమి గెలుపు పక్కా అని చెప్పడంతో రఘురామ్ రెడ్డి పత్రాలు తగలపెట్టించారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. చేసిన తప్పుడు పనులు, ఫేక్ ఆధారాలు, కీలక డాక్యుమెంట్స్ తగలబెట్టమని ఆదేశాలు జారీ చేశారని తెలుగుదేశం మండిపడుతోంది. ప్రభుత్వం మారిన వెంటనే తప్పుడు పనులు చేసిన వారంతా జైలు కి పోవడం ఖాయమనే భయంతోనే ఇలా చేశారని చర్చ సర్వత్రా జరుగుతోంది. అందుకే పత్రాలు అన్ని దహనం చేయాలని ఆదేశాలు ఇచ్చారని తెలుగుదేశం వర్గాలు చెప్తున్నాయి.
సీఐడీ క్రైమ్ ఇన్వాల్వ్‌మెంట్ డిపార్టుమెంట్‌గా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మండిపడ్డారు. తాము ఎప్పటినుంచో చెబుతున్నది ఇవాళ రుజువైందని తెలిపారు. కొందరు ఐపీఎస్‌లు జగన్ పోలీస్ సర్వీస్(జేపీఎస్)గా మారారన్న లోకేశ్ తమ కుటుంబంపై బురదజల్లేందుకు భారీ కుట్ర జరిగిందని ఆరోపించారు. సీఐడీ డీఐజీ రఘురామిరెడ్డి తమ వ్యక్తిగత సమాచారం సేకరించారని ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వానికి అంతిమ ఘడియలు సమీపించాయన్న లోకేశ్ అధికారం పోతుందని తెలిసే పత్రాల దహనానికి పూనుకొన్నారని, ఐపీఎస్‌ల ఇంతటి బరితెగింపు దేశ చరిత్రలో ఇదే ప్రథమం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్రాలు తగలబెడితే పాపాలు పోతాయా?, చేసిన తప్పుకు మూల్యం చెల్లించుకోక తప్పదు అని లోకేశ్ హెచ్చరించారు.
పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో జరిగిన ప్రజాగళం సభ జనసునామీని తలపించడంతో వైఎస్సార్సీపీ మూకల ఉన్మాదం కట్టలు తెంచుకుందని నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో గెలవడం అసాద్యమని తేలిపోవడంతో అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో తెలుగుదేశం కార్యాలయానికి నిప్పుపెట్టి రాక్షసానందం పొందారని దుయ్యబట్టారు. దాడులు, విధ్వంసంతో ప్రజాతీర్పును మార్చలేరన్న విషయాన్ని జగన్, ఆయన సామంతరాజు శంకర్రావు గుర్తించాలన్నారు. త్వరలో వైఎస్సార్సీపీని జనం బంగాళాఖాతంలో కలపబోతున్నారని ఎద్దేవా చేశారు. క్రమశిక్షణకు మారుపేరైన తెలుగుదేశం కేడర్ సహనాన్ని చేతగానితనంగా భావించవద్దని హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల క్రతువును నిర్వహించాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉందని తెలిపారు. పోలీసులు తక్షణమే స్పందించి క్రోసూరు ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తాడేపల్లి సిట్ కార్యాలయానికి పెద్ద ఎత్తున ఉన్నతాధికారులు చేరుకున్నారు. దస్త్రాలు తగలపెట్టిన అంశంపై విచారణ చేపట్టారు. అధికారులు పరిసరాల్లోకి ఎవరినీ అనుమతించడం లేదు. ఫోన్లలో ఎవరైనా చిత్రీకరించే యత్నం చేస్తుంటే అధికారులు వారి ఫోన్లు లాక్కుంటున్నారు.