RTC Officers Study Report on Women Free Bus in AP : ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేందుకు రంగం సిద్ధమవుతోంది. వీలైనంత త్వరగా హామీని అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తోన్న పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకల్లో అధ్యయనం చేసిన ఆర్టీసీ అధికారులు నివేదిక సిద్ధం చేశారు. కాబోయే సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి ఆయన సూచనల మేరకు వీలైనంత త్వరలో అమలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభంజనం సృష్టించడంతో పాటు, బుధవారం ప్రభుత్వాన్ని ఏర్పాటు కానుంది. దీంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై ఆర్టీసీ అధికారులు వేగంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఈ విధానంపై అధ్యయనం చేశారు. వీటిలో ఏది మన రాష్ట్రంలో అమలుకు వీలవుతుందనే అంశాన్నీ పరిశీలించి ప్రాథమికంగా ఓ నివేదిక సిద్ధం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమే మన రాష్ట్రానికి సరిపోతుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. అక్కడి మాదిరిగానే మన రాష్ట్రంలోనూ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ఉన్నాయి.
అలాగే విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో సిటీ ఆర్డీనరీ బస్సులు, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. అయితే కొత్త జిల్లాల పరిధిలోపే పరిమితి ఉంటుందా? పాత ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉంటుందా? రాష్ట్రమంతా ఎక్కడికైనా ప్రయాణానికి అవకాశం ఉంటుందా? అనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు సున్నా ఛార్జీతో టికెట్ జారీ చేస్తారు. ఇలా జారీచేసిన టిక్కెట్ల అసలు ఛార్జీ ఎంతో లెక్కకట్టి వాటిని రీఎంబర్స్ చేసేలా ప్రభుత్వాన్ని ఆర్టీసీ కోరుతోంది.
టీడీపీ 'మహాశక్తి'- ఉచిత బస్సు ప్రయాణం హామీపై ఆడపడుచు ఆసక్తి - Free bus For Women
రాష్ట్రంలో ప్రస్తుతం ఆర్టీసీకి టిక్కెట్ల రూపంలో నెలకు రూ. 500 కోట్ల వస్తున్నాయి. మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే నెలకు రూ. 200 కోట్ల వరకు రాబడి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం ఆర్టీసీ తన రాబడిలో 25% అంటే రూ. 125 కోట్లు ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తోంది. పథకం అమలు చేస్తే ప్రభుత్వానికి చెల్లిస్తున్న రూ. 125 కోట్లు నిలిపేయడంతోపాటు, మిగిలిన రూ. 75 కోట్లు ప్రభుత్వం నుంచి రీఎంబర్స్‌మెంట్‌గా తీసుకోవాల్సి ఉంటుందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కొత్త ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ఆదేశాల ప్రకారమే ఇదంతా ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది.
ఉచిత ప్రయాణంపై ప్రభుత్వం వెనకడుగు - అమలు చేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో జగన్