RTA Services Stopped in AP : రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రవాణా శాఖలో సేవలు నిలిచిపోయాయి. సర్వీస్ ప్రొవైడర్‌కు ఏడాదిన్నరగా 18 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయకపోగా సర్వీసుల పునరుద్దరణపై ఎటూ తేల్చలేదు. దీంతో ఈ-ప్రగతి వెబ్‌సైట్ సహ క్లౌడ్ యాక్సెస్ ను సర్వీస్ ప్రొవైడర్లు నిలిపివేశారు. బకాయిలు చెల్లించే వరకు సేవలు అందించబోమని ఆ సంస్థ స్పష్టం చేసింది. రవాణా శాఖ సేవలు అర్థాంతరంగా నిలిచిపోవడంతో వాహనదారుల్లో గందరగోళం నెలకొంది.
రాష్ట్రంలోని వాహనాలకు సంబంధించిన దశాబ్దాల సమాచారమంతా 2016 నుంచి క్లౌడ్‌లో స్టోర్ చేస్తున్నారు. ఓటీఎస్ఐ (OTSI -Office of Transport Safety Investigations) అనే సంస్థ సర్వీస్ ప్రొవైడర్‌గా ఉంది. ఒక వాహనం ఎంత మంది చేతులు మారింది, పన్నులు ఎప్పుడెప్పుడు చెల్లించారు, పర్మిట్లు, ఫిట్‌నెస్ సర్టిఫికేట్లు ఇలా వాహనాలకు సంబంధించిన దాదాపు 10 కోట్ల డేటా అందులో ఉంది. ఈ డేటాను క్లౌడ్‌లో ఉంచినందుకు ఏటా 5 కోట్ల రూపాయల వరకు ఓటీఎస్ఐ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. రవాణాశాఖ ఈ-ప్రగతి వెబ్‌సైట్ ద్వారా అందిస్తున్న ఆన్‌లైన్ సేవలను కూడా ఓటీఎస్ఐ సంస్థే నిర్వహిస్తోంది. ఇందుకు ఏటా 3 కోట్ల రూపాయలు చెల్లిస్తారు.
దేశవ్యాప్తంగా రవాణాశాఖ సేవలు అందించేందుకు కేంద్రం ఎన్ఐసీ (NIC-National Informatics Centre) రూపొందించిన 'వాహన్' వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. 2021లో ఏపీ రవాణాశాఖ వాహన్‌లో చేరింది. రవాణాశాఖకు చెందిన డేటా మొత్తం ఎన్‌ఐసీలోకి బదలాయింపు కావాల్సి ఉంది. వాహన్ వెబ్‌సైట్ నెమ్మదిగా ఉండటం, ఈ-ప్రగతిలో ఉండే అనేక మాడ్యూల్స్ వాహన్‌లో లేకపోవడంతో డేటా మొత్తం ఎన్‌ఐసీలోకి చేరడం జాప్యమవుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్రం తెచ్చిన వాహన్‌తోపాటు ఈ-ప్రగతి సేవలను కొనసాగిస్తూ వస్తోంది. ప్రస్తుతం వాహన్ ద్వారా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ జరుగుతోంది. వాహన్‌లో భాగమైన సారథి పోర్టల్ ద్వారా డ్రైవింగ్ లైసెన్సులు, ఎల్ఎల్ఆర్ (LLR -Learner License Registration)లు జారీ చేస్తున్నారు. మిగిలిన సేవలన్నీ ఈ-ప్రగతి ద్వారానే అందుతున్నాయి.
ఈ-ప్రగతి నిర్వహించే ఓటీఎస్ఐ సేవలను కొనసాగించడంపై రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది జనవరి నుంచి తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. సేవల్ని కొనసాగించేలా ఒప్పందాన్ని పునరుద్ధరణ కూడా చేయలేదు. రవాణాశాఖ అధికారులు మాత్రం ప్రభుత్వం నుంచి డబ్బులు ఇప్పించేలా చూస్తామని సర్ధిచెప్పి ఇంతకాలం సేవలు కొనసాగేలా చూశారు. బకాయిలు 18 కోట్ల రూపాయల వరకు పెరిగినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఓటీఎస్ఐ సంస్థ సేవల్ని ఆపేసింది. బకాయి చెల్లిస్తేనే మళ్లీ సేవలు కొనసాగిస్తామని తెగేసి చెప్పినట్లు తెలిసింది.
ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిన నీరో జగన్ : లంకా దినకర్ - Lanka Dinakar On Aarogyasri Issue
రవాణాశాఖలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్సులు, ఎల్‌ఎల్‌ఆర్‌ల జారీ మినహా మిగిలిన అన్ని రకాల సేవలు బుధవారం సాయంత్రం నిలిచిపోయాయి. వాహనాల ట్రాన్స్‌ఫర్, రెన్యువల్, ఫిట్‌నెస్ సర్టిఫికేట్లు, ఎన్ఓసీ(NOC -No Objection Certificate) జారీ, త్రైమాసిక పన్నుల చెల్లింపు, ఈ-చలాన్ల చెల్లింపు, ఈ-పర్మిట్ల జారీ ఇలా అన్నిరకాల సేవలు ఆగిపోయాయి. అసలు ఏం జరుగుతుందో చెప్పేవారు లేక వాహనదారులు గందరగోళానికి గురవుతున్నారు.
రాష్ట్ర రవాణాశాఖ డేటా అంతా వాహన్‌లోకి బదలాయింపు కాకుండానే పాత సంస్థ సేవలను కొనసాగించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే వాదన వినిపిస్తోంది. వాహన్ ద్వారా అన్ని సేవలు అందుతాయని రవాణాశాఖ అధికారులు చెబుతున్నప్పటికీ అందులో పూర్తిడేటా లేకపోవడంతో చిక్కులు వస్తున్నాయి. 'ఆరోగ్యశ్రీ కొత్త పథకం కాదు- బటన్ నొక్కటంలో ఆలస్యం ఎందుకు?' - Busireddy Narender Reddy Interview