Road Damage in Roddam and Madakasira Mandals : శ్రీ సత్యసాయి జిల్లాలో హిందూపురం నుంచి రొద్దం, మడకశిర మండలాలకు వెళ్లే ప్రధాన రహదారులు గుంతల మయంతో అధ్వానంగా మారాయి. ఈ రహదారిపై వెళ్లాలంటేనే ప్రయాణికులు భయపడుతున్నారు. అలాగే పరిగి నుంచి రొద్దం వెళ్లే రహదారిలో ఎక్కడ చూసిన గుంతలే దర్శనమిస్తున్నాయి. నిత్యం వందలాది వాహనాలు ఈ దారి గుండా ప్రయాణిస్తుంటాయి. చిన్నపాటి వర్షం వచ్చినా ఈ రహదారులపై ఏర్పడిన గుంతలో వర్షపు నీరు నిలిచి ప్రమాదకరంగా మారుతున్నాయి. అదే సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయి.
గుంతలు, పైకి తేలిన కంకర రాళ్లు - 50 కిలోమీటర్ల రోడ్డు - వాహనదారుల ఇబ్బందులు - kurnool road damage
ఆ రోడ్డుపై ప్రయాణించాలంటే భయపడుతున్న జనం : గతంలో పెనుగొండ నియోజకవర్గం వైఎస్సార్సీపీ శాసనసభ్యుడు మాలగుండ్ల శంకరనారాయణ రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా ఉన్న ఏనాడూ ఈ రోడ్డు గురించి పట్టించుకున్న పాపాన పోలేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పలు మార్లు రోడ్డుని బాగుచేయమని ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా లాభం లేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు. గత ఐదేళ్లుగా రహదారి మెుత్తం అధ్వాన స్థితికి చేరి అటువైపు వెళ్లాలంటేనే ప్రయాణికులు భయపడుతున్నారు. దీనికి తోడు పరిగి చెరువు కట్ట కింద మడకశిర వెళ్లే రహదారి పూర్తిగా కోతకు గురైంది. అలాగే ధనాపురం మలుపు వద్ద పెద్ద పెద్ద గోతులు ఏర్పడి రహదారి ప్రమాదకరంగా మారింది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఈ గుంతలమయమైన రహదారిని బాగు చేయాలని ప్రయాణికులు, వాహన చోదకులు కోరుతున్నారు.
వేసిన 3 నెలలకే పెచ్చులూడిపోయిన రోడ్డు - ఓట్ల కోసమే వేశారని స్థానికుల ఆగ్రహం - వీడియో వైరల్
"హిందూపురం నుంచి రొద్దం, మడకశిర మండలాలకు వెళ్లే ప్రధాన రహదారులు గుంతల మయంతో అధ్వానంగా మారాయి. ఈ దారి వెంట ప్రయాణించాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. నిండు గర్భిణిలను ఆసుపత్రికి తీసుకువెళ్లాలంటే నరకప్రాయంగా ఉంటుంది. రహదారిలో ఎక్కడ చూసిన గుంతలే కనిపిస్తున్నాయి. పొలాల నుంచి ఇంటికి తరలించే గడ్డి, బియ్యపు బస్తాలు గుంతల కారణంగా రోడ్డుపై పడిపోతున్నాయి. చిన్నపాటి వర్షం వచ్చినా గుంతల్లో నీరు నిలిచి ప్రమాదాలకు కారణం అవుతున్నాయి."
- తిప్పేస్వామి నాగభూషణ్, ప్రయాణికుడు
"ఈ మార్గంలో వెళ్తుంటే వాహనాలు తరచూ మరమ్మత్తులకు గురౌతున్నాయి. కొత్తగా కొన్న ఆటోలు సైతం నెల తిరగకముందే రిపేర్ల కోసం షెడ్డుకు వెళ్తున్నాయి. వర్షా కాలంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ దారిలో వెళ్లేందుకు ప్రయాణికులు సైతం భయపడి ఆటోలు ఎక్కటం లేదు. దీంతో ఆదాయం లేక కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. అధికారులు, ప్రజాప్రతినిధులకు సమస్యను విన్నవించుకున్నా పట్టించుకోలేదు. ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి ఈ గుంతలమయమైన రహదారులను బాగు చేయాలని కోరుతున్నాం."
- వాహన చోదకులు
AP Damaged Roads ఏ రోడ్డు చూసిన గుంతలు, బురద మయం.. వర్షాలతో మరింత అధ్వన్నంగా గ్రామీణ రహదారులు..