Revenue employees protest: విశాఖలో అర్ధరాత్రి జరిగిన తహశీల్దార్ రమణయ్య హత్య రాష్ట్రంలో కలకలం రేపింది. ఏకంగా అధికారి ఇంటికి వెళ్లి ఇనుపరాడ్‌తో దాడి చేసి దారుణంగా హతమార్చిన ఘటన చర్చనీయాంశంగా మారింది. స్థిరాస్తి వ్యాపారం, భూవివాదాలే తహశీల్దార్ హత్యకు దారితీసినట్లు అధికారులు చెబుతున్నారు. తహశీల్దార్ హత్యను ఖండిస్తూ ఆందోళనకు దిగిన రెవెన్యూ సంఘాలు... నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. జగన్ పాలనలో మండల స్థాయి అధికారి ప్రాణాలకే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని తెలుగుదేశం నేతలు ప్రశ్నించారు.
బాధ్యతలు చేపట్టిన రోజే హత్య: విశాఖ జిల్లా చినగదిలి రూరల్ తహసీల్దారుగా విధులు నిర్వహించిన సనపల రమణయ్యపై శుక్రవారం రాత్రి ఆయన నివాసం వద్దే గుర్తు తెలియని వ్యక్తి ఇనుపరాడ్డుతో దాడి చేశాడు. రక్తపు మడుగులో పడివున్న రమణయ్యను ఆయన బంధువులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. రమణయ్య స్వస్థలం శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం దిమ్మిలాడ. విశాఖ కొమ్మాదిలోని చరణ్ క్యాస్టల్స్ అపార్టుమెంట్ లో ఆయన నివాసం ఉంటున్నారు. ఎన్నికల బదిలీల్లో భాగంగా విజయనగరం జిల్లా బొండపల్లి తహశీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన రోజే ఆయన హత్యకు గురికావడం సంచలనంగా మారింది. రియల్ ఎస్టేట్, భూవివాదాలే తహశీల్దార్ రమణయ్య హత్యకు కారణమని సీపీ రవిశంకర్ తెలిపారు. హత్య కేసు నిందితుడిని గుర్తించినట్లు చెప్పారు. ఇద్దరు ఏసీపీలను నియమించి కేసు దర్యాప్తు చేస్తుస్తున్నామన్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామన్నారు.
ఎమ్మార్వో రమణయ్య హత్యపై తీవ్రంగా స్పందించిన రాజకీయపక్షాలు, ఉద్యోగ సంఘాలు
భగ్గుమన్న రెవెన్యూ సంఘాలు: తహశీల్దార్ దారుణ హత్యకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులందరూ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. మండల మేజిస్ర్టేట్ స్థాయి వ్యక్తి దారుణ హత్యకు గురికావడంపై రెవెన్యూ సంఘాలు భగ్గుమన్నాయి.కేజీహెచ్ వద్ద రెవెన్యూ అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన తెలిపారు. ఇలాంటి దాడులతో ఉద్యోగుల భద్రత ప్రశ్నార్థకమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రమణయ్య హత్యను ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, చేబ్రోలు కృష్ణమూర్తి తీవ్రంగా ఖండించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
'వైఎస్సార్సీపీ హయాంలో కార్పొరేషన్లు నిర్వీర్యం.. సబ్ ప్లాంట్ నిధులు పక్కదారి'
హత్యను ఖండించిన టీడీపీ నేతలు: కేజీహెచ్ వద్ద రమణయ్య మృతదేహానికి తెలుగుదేశం నేతలు నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ పాలనలో విశాఖను క్రైమ్ క్యాపిటల్‌గా మార్చారని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. రెవెన్యూ అధికారికే రక్షణ లేకపోవడం బాధాకరమన్నారు. భూ అక్రమాలకు సహకరించడం లేదని వైఎస్సార్సీపీ నేతలే తహశీల్దార్ రమణయ్యను హతమార్చారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆరోపించారు. జగన్ ఐదేళ్ల పాలనలో వందల మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు. రాష్ట్రంలో నేరాలు జరుగుతుంటే హోంమంత్రి, పోలీసులు ఏం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.