Ratha Saptami Celebrations Grandly Held Across State : రాష్ట్రవ్యాప్తంగా రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. ప్రముఖ దేవాలయాలతో పాటు ఊరూవాడ సందడి నెలకొంది. తాజాగా తిరుమల శ్రీవారి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఉదయం ఐదున్నరకు స్వామివారు వాహన మండపం నుంచి వాయవ్య దిశకు చేరుకున్నారు. భానుడి కిరణాలు స్వామివారి పాదాలు తాకిన తర్వాత అర్చకలు హారతులు, నైవేద్యాలు సమర్పించారు. ఆ తర్వాత సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత వాహనాలపై విహరించారు. చక్రస్నానం తర్వాత కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలపై భక్తులకు అభయప్రదానం చేశారు.
రాష్ట్రంలో వైభవంగా రథసప్తమి వేడుకలు, సూర్యభగవానుడికి విశేష పూజలు
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూర్యప్రభ, చప్ర వాహనంపై స్వామి, అమ్మవారు మాఢవీధుల్లో విహరించారు. ఆలయ ప్రాంగణంలోని చతుర్ముఖ సూర్య భగవానునికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాల తర్వాత మాఢవీధుల్లో ఊరేగించారు. మంత్రాలయం రాఘవేంద్ర మఠం, దేవుని కడప శ్రీలక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయం, అనంతపురం జిల్లా పెన్నహోబిలం లక్ష్మీనరసింహుడి గుడి, కదిరి లక్ష్మీనరసింహ స్వామి కనిగిరి వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో వేడుకలు జరిగాయి. ప్రకాశం జిల్లా కొమరోలులో విష్ణుమూర్తి 9 రూపాలు ప్రదర్శిస్తూ ఊరేగింపు నిర్వహించారు. తణుకు సూర్య భగవానుని ఆలయ వేడుకల్లో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.
తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు - సప్త వాహనాల్లో విహరించనున్న మలయప్ప స్వామి
సింహాద్రి అప్పన్న ఆలయం, శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యదేవాలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఆదిత్యుని నిజరూప దర్శనానికి భక్తులు తరలివచ్చారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు. సూర్యభగవానుడిని దర్శించుకున్నారు. చివరిగా స్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరించి భక్తలకు అభయమిచ్చారు.
Ratha Saptami Celebrations in AP : మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో రథసప్తమి వేడుకలు ఘనంగా చేశారు. వెండి అంబారి, చెక్క, వెండి రథం, బంగారు రథం, నవరత్న రథాలపై దేవాతామూర్తుల చిత్రపటాలు ఉంచి ఊరేగించారు. కడపలోని దేవుని కడపలోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు తెల్లవారుజాము నుంచే పోటెత్తారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నహోబిలంలోని శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ నరసింహ స్వామి వారికి కల్యాణోత్సవం నిర్వహించారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని శోభాయమానంగా అలంకరించి సూర్యప్రభ వాహనంపై తిరువీధుల్లో ఊరేగించారు.
అరసవల్లి రథసప్తమి వేడుకలు ప్రారంభం - స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వేంచేసి ఉన్న శ్రీ సూర్య భగవానుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉష, ఛాయ సౌంజ్ఞ, పద్మిని సమేతులైన స్వామి వారు మనోహరమైన రూపంలో భక్తులకు దర్శనమిస్తూ కనువిందు చేశారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.