Rains and Thunderstorms in Andhra Pradesh : రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కురిసిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. రహదారులు జలమయమయ్యాయి. పలు చోట్ల హోర్డింగ్‌లు, వృక్షాలు నేలకొరిగాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తెగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. మున్సిపల్ కార్యాలయం సమీపంలోని ప్రధాన రహదారికి అడ్డంగా భారీ చెట్టు కూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే రైల్వేస్టేషన్‌కు వెళ్లే మార్గంలోనూ చెట్లు, విద్యుత్ స్తంబాలు ఒరిగిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
వైఎస్‌ఆర్ జిల్లాలో గత రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షం ధాటికి కడప నగరంలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. నగరంలో మురికి కాలువల నిర్మాణం జరుగుతున్నందున వర్షం నీరు ఎటు వెళ్లలేని పరిస్థితుల్లో మోకాళ్ల లోతు వరకు నిల్వ ఉంది. ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు, జిల్లా కోర్టు రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డు, భరత్ నగర్, భాగ్యనగర్ కాలనీ, అప్సర కూడలి ప్రాంతాలన్నీ వర్షం నీటితో నిండిపోయాయి. వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్టాండ్ ప్రాంగణంలోకి వర్షం నీరు చేరింది. ప్రొద్దుటూరు, రాజుపాలెం, మైదుకూరు, బద్వేల్ ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు పడ్డాయి. లోతట్ట ప్రాంతాల్లోకి వర్షం నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గుంటూరు జిల్లా తెనాలిలో భారీ వర్షం జనజీవనానికి తీవ్ర ఇబ్బందులు కలిగించింది. భారీ వర్షానికి ఈదురు గాలులు తోడవటంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. గంటన్నర సేపు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నెహ్రూ రోడ్డులో కోటి నాగయ్య వైద్యశాల నుంచి రజకచెరువు పార్క్ వరకు రోడ్డుపై ద్విచక్ర వాహనాలు మునిగిపోయాయి. వాహనదారులతో పాటు స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈదురు గాలులకు తెనాలి విజయవాడ రోడ్డులో నందివెలుగు వద్ద చెట్లు విరిగి రోడ్డుపై పడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నందివెలుగు కూడలిలో ఏర్పాటుచేసిన భారీ హోర్డింగ్ విరిగిపడింది. నందివెలుగు నుంచి గుంటూరు మార్గంలో ఎరుకలపూడి అడ్డరోడ్డు వద్ద విద్యుత్ లైన్లు తెగి రోడ్డుపై పడ్డాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లు భవనాల శాఖ కార్యాలయం, పోస్టాఫీసు ప్రాంగణాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది.
కోనసీమ జిల్లా వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. జిల్లాలో సగటు వర్షపాతం 25.70 మిల్లీమీటర్లు నమోదైనట్లు అధికారులు తెలిపారు. వర్షానికి అమలాపురంలోని పలు కాలనీల్లో వర్షపునీరు నిలిచిపోయింది. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో దెబ్బతిన్న రహదారుల్లో నీరు చేరటంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ముమ్మిడివరంలో ఈదురుగాలులకు భారీ చెట్టు ప్రధాన రహదారికి అడ్డంగా పడటంతో వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది.
వర్షాకాలంలో ఈ ఫ్రూట్స్ తింటే - ఇన్ఫెక్షన్లకు గుడ్‌బై చెప్పొచ్చు! - Fruits to Fight With Infections