Rain Alert in Andhra Pradesh : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. క్రమంగా ఇది ఈశాన్య దిశగా కదులుతూ రేపటి(శుక్రవారం)కి వాయుగుండంగా బలపడే సూచనలు ఉన్నట్లు విశాఖ వాతావరణశాఖ అధికారి డాక్టర్ సునంద తెలిపారు. వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా తదితర ప్రాంతాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వెల్లడించారు. ఈ నెల 25 నాటికి క్రమంగా మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతమవుతుందని తెలిపారు. వాయుగుండం ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్, కోస్తా ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని డాక్టర్ సునందా తెలిపారు.
ఈసారి ముందే నైరుతి రుతుపవనాలు - ఏపీలోకి ఎప్పుడంటే ! - SOUTHWEST MONSOON 2024
ఆ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు : మరోవైపు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా నైరుతి రుతుపవనాలు మరింతగా పురోగమిస్తున్నట్లు వెల్లడించారు. ఈ అల్పపీడనం అరేబియా సముద్ర ప్రాంతాలు, మాల్దీవులు సహా పరిసర ప్రాంతాలకు విస్తరించినట్లు తెలిపారు. అలాగే తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు స్పష్టం చేశారు. కేరళలో 20 సెంటిమీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. మరోవైపు వాయువ్య భారత్లోని రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, మధ్యప్రదేశ్, హిమాచల్ తదితర ప్రాంతాల్లో తీవ్ర ఉష్ణగాలుల ప్రభావం ఉందని. ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదు అయ్యే అవకాశముందని విశాఖ వాతావరణశాఖ అధికారి డాక్టర్ సునందా వెల్లడించారు.
బంగాళాఖాతంలో అలజడి- అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక - RAIN ALERT
ఆ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు : అయితే రాష్ట్రంపై ఈ అల్పపీడన ప్రభావం పెద్దగా ఉండదని ఒడిశాతో పాటుగా పశ్చిమబెంగాల్‌లో భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. అల్పపీడనం ప్రభావంతో ఈరోజు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా నేడు శ్రీకాకుళం జిల్లాలో 9 మండలాలు, విజయనగరం జిల్లాలో 5, పార్వతీపురం మన్యం జిల్లాలో 11, అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈ నెల 26న వేడిగాలులు వీస్తాయని విశాఖ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
జూన్ మొదటి వారంలో రాష్ట్రంలోకి రుతుపవనాలు : ఇటు నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమరిన్, అండమాన్ నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతం, కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరో రెండు రోజుల్లో ఈ రుతుపవనాలు విస్తరిస్తాయని ఈ నెల 30న రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి అంటున్నారు. ఏపీలో జూన్ మొదటి వారంలో విస్తరించే అవకాశం ఉందని విశాఖ వాతావరణశాఖ అధికారి డాక్టర్ సునందా వెల్లడించారు.