Public Faces Problems Over CM Jagan Bus Yatra : జగన్ చిరకాల కోరికైన సీఎం కుర్చీ దక్కడంతో ప్రజలపై దండయాత్రకు సిద్ధమయ్యారు. సీఎం పగ్గాలను ఇష్టారీతిన వాడుతూ పేద గుడిసెల ప్రజలను అంటరాని వాళ్లలాగా, తాడేపల్లి ప్యాలెస్‌ను అంటిపెట్టుకుని ఉన్నారు. ఈ ఐదేళ్ల కాలం ప్రజలతో, ప్రతిపక్షాలతో "పబ్జి గేమ్"లా చెడుగుడు ఆడుకుంటూ కాలం గడిపేసిన జగన్ మరోసారి అధికార దాహం తీరకపోవడంతో "అమాయకపు మొహం" పెట్టుకుని కొన్ని రోజుల క్రితం సిద్ధం పేరుతో ప్రజల్లోకి బుడి బుడి అడుగులు వేసుకుంటూ వచ్చారు.
పట్టపగలే చుక్కలు : జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగు తీసి బయటపెట్టడంతో ప్రజలకు కష్టాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన జగన్ ప్రతిపక్షాలతో చేయాల్సిన యుద్ధం ప్రజలతో చేస్తున్నారు. ఏ సీఎం, ఏ రాజకీయ నాయకుడు ఇవ్వని బహుమానాన్ని ప్రజలకు ఇస్తున్నారు. ఏ ప్రాంతం లో జగన్ పర్యటన ఉంటే ఆ ప్రాంత ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు అధికార పార్టీ నేతలు.
కర్ణాటక శివ భక్తులకు నరకం : జగన్ సిద్ధం సభకు రాష్ట్రంలో వివిధ ప్రాంతంలోని వేల ఆర్టీసీ బస్సులను సేకరించి అధికారులు తరలించడం ప్రయాణికులకు కష్టాలు తెచ్చి పెడుతోంది. దీంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. శివరాత్రి పండుగ రోజున కూడా శివ భక్తులు బస్సులు లేక మండుటెండలో చెమటలతో తడిసిపోయారు. పండుగ సందర్భంగా స్వర్గం కోసం శ్రీశైలం వచ్చిన కర్ణాటక భక్తులకు నరకం చూపించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం.
విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం : జగన్ సభల కోసం ప్రయాణికులు, భక్తులే కాకుండా చదువుకునే విద్యార్థుల భవిష్యత్తును సైతం ఫణంగా పెట్టారు. సీఎం సభ కారణంగా గతంలో పాఠశాలలకు అర్ధాంతరంగా సెలవులు ప్రకటించారు. అధికారంలో ఉన్న వారిని "ఆపేవాడు లేడు" అన్న విధంగా ఏకంగా ఇంటర్మీడియెట్ పరీక్షను సైతం వాయిదా వేయించారు. దీనిపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసిన ఫలితం లేకుండా పోయింది.
పెళ్లి తంతు జరగాలంటే సీఎం సభ ఉండకూడదు? : పెళ్లిళ్లకు ముహూర్తాలు పెట్టుకోవాలంటే అబ్బాయి, అమ్మాయి జాతకం చూస్తారు. అంతా బాగుంటే మంచి ముహూర్తం చూసి పెళ్లి చేస్తారు. కానీ రాష్ట్రంలో పెళ్లిళ్లు చేసుకోవాలంటే తమ ప్రాంతంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Tour) పర్యటన ఉందేమో చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఎంతో ఖర్చు పెట్టి చేస్తున్న పెళ్లికి బంధువులు, స్నేహితులందరూ రావాలి కదా. వీళ్లంతా రావాలంటే ఆర్టీసీ బస్సులు ఉండాలి కదా. ఉన్నా అవి సమయానికి రావాలంటే ట్రాఫిక్ జామ్‌లు లాంటివి కాకూడదు కదా. ప్రస్తుతం సీఎం జగన్ పర్యటనలు, సభలకు ఆర్టీసీ బస్సులన్నీ అటే తరలిస్తున్నారు. మరోవైపు సొంత వాహనాల్లో వెళ్తున్నా ఆయా మార్గాల్లో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులంతో ఇరుక్కుపోతున్నారు.
గంటల కొద్దీ నిరీక్షణ : సీఎం జగన్ మోహన్ రెడ్డి 'సిద్ధం (Siddham) ' పేరిట చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలు రాష్ట్ర ప్రజలకు సంకటంగా మారాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకొనేవారు ఆయా రోజుల్లో సమీప ప్రాంతాల్లో సీఎం సభలు ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారు. సిద్ధం సభలకు వేల సంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలిస్తుండటంతో సాధారణ ప్రయాణికులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. గమ్యస్థానాలకు వెళ్లే బస్సులు అందుబాటులో ఉండక బస్టాండ్లలోనూ, రోడ్లపైనా గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది. మండుటెండలతో ఇబ్బందులు పడాల్సివస్తోంది.
బాధితుల ఆందోళన : ఈ వ్యవహారంపై ఎన్ని విమర్శలు వచ్చినా వైఎస్సార్సీపీ ప్రభుత్వ పెద్దలు, ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మంగళవారం విజయనగరం, బుధవారం శ్రీకాకుళం జిల్లాల్లో సిద్ధం సభలు జరగనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని డిపోల నుంచి 1100కు పైగా బస్సులు కేటాయించేశారు. ఈ రెండు రోజుల కోసం ఒక్క విజయనగరం నుంచే 125లో 90కి పైగా బస్సులు వెళ్లనున్నాయి. ఈ నెల 23, 24, 25, 26వ తేదీల్లో పెద్ద ఎత్తున పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు ఉన్నాయి. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లేవారు బస్సులను బుక్ చేసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించినా అధిక ఛార్జీలతో పెనుభారం పడుతోందని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల పాలిట శాపంలా సీఎం జగన్ బస్సుయాత్ర - సామాన్యలపై పోలీసుల జులుం - CM Jagan Bus Yatra