Narasapuram MPDO Missing Case Updates : కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల పోలీసు ఉన్నతాధికారులు, సీఐలు, ఎస్‌ఐలు , పదుల సంఖ్యలో పోలీసు సిబ్బంది ఏలూరు కాల్వను వలలు వేసి జల్లెడపట్టినా వెంకటరమణారావు ఆచూకీ లభించలేదు. ఈనెల 15న ఎంపీడీవో ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆయన మచిలీపట్నం, విజయవాడలోని మధురానగర్‌లో కనిపించినట్లు సెల్‌ఫోన్ సిగ్నల్స్, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా పోలీసులు గుర్తించారు.
Narasapuram MPDO Case Updates : మరోవైపు తీవ్ర మానసిక ఒత్తిడి, ఆందోళనలతో వెంకటరమణరావు ఏదైనా అఘాయిత్యానికి పాల్పడి ఉంటారనే అభిప్రాయాలు, అనుమానాలను సైతం పోలీసులు వ్యక్తం చేశారు. దీంతో మధురానగర్ నుంచి ఏలూరు వరకూ దాదాపు 55 కిలోమీటర్ల మేర కాలువలో దాదాపు 150 మంది పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఆయన కోసం గాలించారు. చివరకు ఏలూరు కాలువ బ్రాంచ్ కాలువల్లోనూ వెతికినా ఎంపీడీవో ఆచూకీ దొరకలేదు. అయినా పోలీసులు గాలింపు చర్యలను మాత్రం కొనసాగిస్తున్నారు.
ఫోన్‌కాల్స్‌పై దృష్టి పెట్టిన పోలీసులు : వెంకటరమణారావు కేసు దర్యాప్తు ఇప్పటి వరకూ రేవు పాటల వివాదం, గుత్తేదారు చెల్లించాల్సిన బకాయి చుట్టూనే తిరిగింది. అయితే ఎంపీడీవో అదృశ్యంపై ఇప్పటి వరకూ చిన్న క్లూ కూడా దొరకలేదు. దీంతో పోలీసులు ఇతర కోణాల్లోనూ దృషి సారించారు. వెంకటరమణారావు అదృశ్యం కావడానికి మూడు నెలల ముందునుంచి ఆయన సెల్‌ఫోన్ కాల్‌లిస్టును పరిశీలిస్తున్నారు. ఆ మధ్యకాలంలో వచ్చిన వందల ఫోన్లలో ప్రతి ఒక్కకాల్ వివరాలను సేకరిస్తున్నారు. ఎవరు ఎందుకు ఫోన్‌చేశారు? కారణాలు ఏమిటి? ఎంత సేపు మాట్లాడారు? అన్న దానిపై ఫోకస్ పెట్టారు. ఎక్కువ సేపు మాట్లాడిన ఫోన్‌కాల్స్‌పై దృష్టి పెట్టారు. వీటిలో కొన్ని కాల్స్ ఇతర రాష్ట్రాలకు చెందినవిగా అనుమానిస్తున్నారు. ప్రత్యేకించి రెండు నంబర్లపై పోలీసులు దృష్టి సారించారు.
వెంకటరమణారావుకు ఇతరులతో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివాదాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన బ్యాంకు ఖాతా లావాదేవీలని పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల కాలంలో జరిగిన రెండు లావాదేవీలను లోతుగా విశ్లేషిస్తున్నారు. వెంకటరమణ తన బ్యాంకు ఖాతా నుంచి రెండు ఫోన్ నంబర్లకు వేర్వేరుగా రూ.4లక్షల వరకూ పంపినట్లు పోలీసులు గుర్తించారని సమాచారం.
ఏ కారణంతో ఈ డబ్బులు పంపారనే దానిపై పోలీసులు పరిశీలిస్తున్నారు. రేవుపాటల చెల్లింపు వివాదం వ్యవహారంతో పాటు ఈ కోణాన్ని విశ్లేషించాలని ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయన ఖాతాలో కేవలం రూ.30,000ు మాత్రమే ఉన్నట్లు సమాచారం. వీటన్నింటిపై మరో రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
వీడని ఎంపీడీవో మిస్సింగ్ మిస్టరీ - ఏమయ్యారో? ఎక్కడున్నారో? - Narasapuram MPDO Missing Case