Pitru Amavasya: మనం దేవుళ్లను ఎలా ఆరాధిస్తామో పూర్వీకులను కూడా అదే విధంగా ఆరాధించాలి. పితృ దేవతలు అంటే మన కుటుంబానికి సంబంధించిన మూడు తరాల పెద్దలు అని అర్థం. వారందరికీ పితృ పక్షాల కాలంలో తర్పణాలు, శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నమ్మకం. మహాలయ పక్షం రోజుల్లో వచ్చే అమావాస్య రోజున పెద్దలకు తర్పణం వదిలితే ఏడాదంతా పితృ దేవతలకు తర్పణాలు వదిలిన ఫలితాలొస్తాయని పండితులు పేర్కొంటున్నారు.
మహాలయ పక్షం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే..
కుటుంబ పెద్దలను కోల్పోయిన వారు, తల్లిదండ్రులు ఇద్దరూ లేనివారు మహాలయ పక్షంలో తప్పనిసరిగా పితృకర్మలు చేయాలి. ఈ 15 రోజుల్లో చేయలేని వారు కనీసం పితృ అమావాస్య రోజైనా భక్తి శ్రద్ధలతో ఆహారాన్ని అందించి, వారి ఆకలి తీర్చాలి. మహాలయ పక్షాలు పిండ ప్రదానాలు, తర్పణాలు, శ్రాద్ధ కర్మల నిర్వహణకు అనుకూలమైన, అత్యంత పవిత్రమైన సమయం అని పండితులు చెప్తున్నారు. మహాలయ రోజుల్లో తర్పణాల వల్ల పితృ దేవతల ఆకలి తీరి వారు సంతృప్తి చెందుతారని వెల్లడిస్తున్నారు.
కర్ణుడికి కష్టాలు..!
మహాలయ పక్షం రోజుల వెనుక ఓ ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. మహాభారత యుద్ధంలో కర్ణుడు మరణం తర్వాత స్వర్గలోకానికి వెళ్తుంటాడు. ఆ సమయంలో ఆకలిగా అనిపించడంతో ఓ చెట్టు దగ్గరికి వెళ్లి పండ్లను కోయడంతో అవి బంగారమైపోయాయట. దాహమైనా తీర్చుకుందామని నీటి దగ్గరకు వెళ్తే సెలయేరంతా బంగారమై దప్పిక తీరే దారి కనిపించలేదట. దీంతో తాను తెలియక ఏదో తప్పు చేశానని భావించి ఆందోళనకు గురికాగా.. కర్ణుడు తాను ఇచ్చినవన్నీ బంగారం, వెండి, ధన దానాలేనట. ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేకపోవడంతోనే ఇప్పుడు ఈ దుస్థితి తలెత్తిందంటూ శరీరవాణి వివరించిందట. దాంతో కర్ణుడు తన తండ్రి అయిన సూర్యుడి దగ్గరకు వెళ్లి భూలోకానికి పంపించాలని కోరుకున్నాడట. సూర్యుడు సూచనతో దేవేంద్రుడు కర్ణుడిని భూలోకానికి వెళ్లేందుకు పక్షం రోజులు అవకాశం ఇచ్చాడట.
ఆ అవకాశంతో భాద్రపద బహుళ పాడ్యమి రోజున భూలోకానికి చేరిన కర్ణుడు ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేశాడట. తిరిగి భాద్రపద అమావాస్య రోజున స్వర్గానికి చేరుకున్నాడని పండితులు పేర్కొంటున్నారు. కర్ణుడు భూమి మీదకు వచ్చి తిరిగి వెళ్లిన పక్షం రోజులనే మహాలయ పక్షంగా పిలుస్తారు. ఈ పక్షంలో చివరి రోజున మహాలయ అమావాస్య అక్టోబర్ 2న రానుంది. ఆ రోజున పితృదేవతలకు తర్పణాలు ఇస్తే మంచి జరుగుతుందని, స్వర్గలోక ప్రవేశం లభిస్తుందని నమ్మకం.