PHD on Social Issues in Vikrama Simhapuri University : చదువు పూర్తికాగానే ఉద్యోగం కావాలని యువత కోరుకుంటున్నారు. సాప్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ నిరంతరం ఒత్తిడికి గురవుతున్నారు. ఆ తర్వాత ఉన్నత చదువులకు చాలా తక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. మరి కొందరు సమాజంతో పరిచయం పెంచుకునేందుకు పరిశోధనలు చేస్తున్నారు. ఈ విధంగా సమాజ సేవ చేయొచ్చని చెబుతున్నారు.
సమస్యలపై ప్రభావితం అయినవారు వాటి పరిష్కారానికి లోతుగా అధ్యయనం చేస్తున్నారు. వారి మనస్సులను కదలించిన కొన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు నెల్లూరు సింహపురి విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యూయేషన్ చేసి, కొన్ని అంశాలపై పీహెచ్డీ చేశారా యువకులు.
నెల్లూరు జిల్లాలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం 20మంది పీహెచ్డీ చేసిన యువతీ యువకులకు స్నాతకోత్సవంలో పట్టాలను అందజేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతులు మీదుగా అందుకున్నారు. బయోటెక్నాలజీ, ఆర్గానిక్ టెక్నాలజీ, మైక్రోబయోలజీ, కెమిస్ట్రీ, ఫుడ్ టెక్నాలజీలో వారు పీజీ కోర్సులు పూర్తి చేశారు. మరి కొందరు ఐదేళ్లు కష్టపడి పీహెచ్డీ పూర్తి చేశారు.
ఎన్నో ఆర్థిక సమస్యలు అధిగమించి పీహెచ్డీ - కర్ణాటక గవర్నర్ నుంచి పట్టా అందుకున్న యువకుడు
వీరందరూ నెల్లూరు జిల్లాలో ఉన్న సమస్యలను తీసుకుని రీసెర్చ్ చేశారు. కృష్ణపట్నం పోర్టు, గూడూరు, నాయుడుపేట ప్రాంతాల్లో రైతుల నుంచి భూములు తీసుకుని పరిశ్రమలు ఏర్పాటు చేశారు. రైతు కుటుంబాలకు మాత్రం ఎటువంటి సహాయం అందలేదని ఈ అంశంపై ఓ యువకుడు రీసెర్చ్ చేశాడు. వీరంతా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారే. అందులో నష్టాలు పరిష్కారాలపై మరో యువకుడు పరిశోధన చేశాడు.
వెంకటగిరి ప్రాంతాల్లో వేలాది చేనేత కుటుంబాలు ఉన్నాయి. వారికి బ్యాంకుల నుంచి రుణాలు అందడంలేదు. ప్రభుత్వ పథకాలు బాధితులకు చేరడం లేదు. అసలు వాటిపై సరైన అవగాహనే కల్పించడం లేదు. దీంతో ఈ విషయాలను లోతుగా అధ్యయనం చేశారు. కరోనా తర్వాత తీరప్రాంత గ్రామాల్లో పరిస్థితులు, వారి జీవన విధానంలో మార్పులపై పరిశీలన చేశారు.
వినూత్న ఆవిష్కరణలకు రూపకల్పన - యువతకు ఆదర్శం
ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు వెనకబడి పోయారని, ఇప్పటికీ అనేక కుటుంబాల్లో చదువులు లేవని పీహెచ్డీ చేసిన విద్యార్థిని చెప్పారు. ఆరోగ్యపరంగా తీసుకోవలసిన జాగ్రత్తలు, ఏపీలో టూరిజం అభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు లేక యువత నిరుద్యోగులుగా ఉండిపోయారని తెలిపారు. పోస్ట్ గ్రాడ్యgయేషన్ చేసి ఐదేళ్లు పీహెచ్డీ చేయాలంటే ఖర్చుతో కూడుకుందని విద్యార్థులు చెబుతున్నారు.
అనేక ప్రాంతాలకు వెళ్లి ఎంచుకున్న అంశంపై పరిశోధన చేయాలంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని చెబుతున్నారు. పేద వర్గాలవారే ఎక్కువగా పీహెచ్డీ చేస్తున్నారని, ప్రభుత్వం ఆర్థికంగా వారికి సహాయం అందించాలని కోరుతున్నారు. రీసెర్చ్ పూర్తయ్యే వరకు ప్రతినెలా కొంత జీతంలా ఇవ్వాలని కోరుతున్నారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ స్కాలర్స్ ఎక్కువ మంది వ్యవసాయ రంగం నుంచి వచ్చిన వారు ఉన్నారు. ఇంకా కొత్త అంశాలపై రీసెర్చ్ చేయాలని ఉందని అంటున్నారు. ఈ క్రమంలో గోల్డ్ మెడల్స్ అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పీహెచ్డీ పట్టభద్రులు తెలిపారు.