Peoples Facing Problems Due to CM Meeting : సీఎం జగన్ ఎక్కడ పర్యటించిన సామాన్యులకు ఇబ్బందులు తప్పడం లేదు. నేడు అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. వైఎస్సార్ ఆసరా నాలుగో విడత రాష్ట్రస్ధాయి కార్యక్రమాన్ని ప్రారంభించి డ్వాక్రా సంఘాలకు బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు. సీఎం ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తర్వాత వైఎస్సార్ ఆసరా నాలుగో విడత కింద బటన్ నొక్కి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటనకు సర్వం సిద్ధమైంది. రెండు రోజులుగా డ్వాక్రా గ్రూపు మహిళలను సీఎం సభకు రప్పించటానికి వైఎస్సార్సీపీ నేతలు, వాలంటీర్లు ఫోన్ కాల్స్, మెసేజ్లతో ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే మూడు విడతలుగా ఆసరా సొమ్మును విడుదల చేసిన ప్రభుత్వం, నేటి ఉవరకొండ సభలో తుది విడత విడుదల చేయనున్నారు.
CM Meeting in Uravakonda : సీఎం సభ కోసం రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల నుంచి 600 ఆర్టీసీ బస్సులు, అనంతపురం జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల నుంచి 435 బస్సులను జనాన్ని తీసుకురావటానికి కేటాయించారు. సోమవారం సాయంత్రం నుంచి రాయలసీమ జిల్లాల్లో ప్రయాణీకులకు బస్సులు లేక ఇబ్బందులు మొదలయ్యాయి. అదేవిధంగా అనంతపురం జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల బస్సులను జనం తరలించటానికి ప్రభుత్వం వాడుకుంటుంది. దీంతో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మరో వైపు నాలుగు జిల్లాల్లో రెండు రోజులపాటు ప్రయాణీకులకు ఆర్టీసీ బస్సుల సంఖ్య తగ్గి ఇబ్బందులు తప్పని పరిస్థితి నెలకొంది. గ్రామాల నుంచి డ్వాక్రా మహిళను తీసుకొచ్చేందుకు వారిపై పలువిధాలుగా అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు ఒత్తిడి చేస్తున్నారు.
సీఎం సభ సందర్భంగా ఉరవకొండ పట్టంలో వాహనదారులపై సోమవారం ఉదయం నుంచే పోలీసులు ఆంక్షలు మొదలయ్యాయి. సీఎం కాన్వాయ్ ట్రయల్ నిర్వహించిన సందర్భంగా జాతీయ రహదారిపై మూడు కిలోమీటర్ల మేర గంటపాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిపివేశారు. ముఖ్యమంత్రి సభ జరుగుతున్న ప్రాంతం నుంచి దాదాపు అర కిలోమీటరు వరకు దుకాణాలు, హోటళ్లు మూసివేయాలని పోలీసులు హెచ్చరికలు జారీచేశారు.
ముఖ్యమంత్రి పర్యటనతో సామాన్య ప్రజలతోపాటు, ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీఎం జగన్ ఉదయం శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకొని, అక్కడి నుంచి 10.50 గంటలకు హెలీకాప్టర్లో ఉరవకొండకు రానున్నారు. మధ్యాహ్నం 12.45 కు తిరిగి జూనియర్ కళాశాలలోని హెలీప్యాడ్ కు చేరుకొని, పుట్టపర్తికి వెళ్తారు. అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వెళ్లనున్నారు.