Ten People Died in Various Road Accidents in AP Today : రాష్ట్రంలో రహదారులు రక్తసిక్తమయ్యాయి. వేర్వేరు జిల్లాల్లో జరిగిన ప్రమాదాల్లో 10 మంది మృత్యువాతపడ్డారు. మరికొంత మందికి తీవ్రగాయాలయ్యాయి. కృష్ణా, తిరుపతి, అనకాపల్లి, గుంటూరు జిల్లాల్లో రోడ్లు రక్తమోడాయి. ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు అధికమవటంపై, వాహనదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోడూరుపాడు H.P. పెట్రోల్ బంకు సమీపంలో లారీని కారు ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మంగళగిరి నుంచి విశాఖకు వెళ్తున్న లారీని కొవ్వూరు నుంచి తమిళనాడు వెళ్తున్న కారు ఢీకొంది. వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి మొదట డివైడర్‌ను ఢీకొట్టి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందగా, మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. కారు నుజ్జనుజ్జయింది. మృతదేహాలను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించిన పోలీసులు, చనిపోయినవారిని తమిళనాడు వాసులుగా గుర్తించారు.
తిరుపతి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం నలుగురిని బలి తీసుకుంది. చంద్రగిరి మండలం ఎం.కొంగరవారిపల్లి వద్ద పూతలపట్టు-నాయుడుపేట జాతీయరహదారిపై, కారు డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరు నుంచి వేలూరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కారులోని వారిని నెల్లూరు జిల్లా వాసులుగా గుర్తించారు.
పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై జరిగిన మరో ప్రమాదంలో కారు దగ్ధమైంది. తిరుపతి నుంచి చిత్తూరు వెళ్తున్న కారు, తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో సి.మల్లవరం వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. పక్కనే ఉన్న మరో రోడ్డుపైకి దూసుకెళ్లిన కారులో మంటలు వ్యాపించాయి. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. మంటలకు కారు దగ్ధమైంది.
నెత్తురోడిన రహదారులు- 11మంది దుర్మరణంపై చంద్రబాబు దిగ్భ్రాంతి - Road Accidents in AP
మన్యం జిల్లా సీతంపేట ఘాట్‌రోడ్డులో ఆటో అదుపుతప్పి లోయలో పడింది. ప్రమాదంలో 17 మంది గిరిజనులు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. సోమవారం సంత కావటంతో ఆటోలో సీతంపేటకు వచ్చి వీరంతా తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గాయపడిన వారికి సీతంపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందించారు. ఏడుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి తరలించారు. బాధితులను స్థానిక జనసేన నాయకులు పరామర్శించారు.
గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో జరిగిన ప్రమాదం కానిస్టేబుల్‌ను బలి తీసుకుంది. గుంటూరు ఈస్ట్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న సునీల్ బాబు బైక్‌పై వెళ్తుండగా, స్పీడ్‌బ్రేకర్ వద్ద బైక్ అదుపుతప్పడంతో ప్రమాదం జరిగింది. తీవ్రగాయాలతో ఘటనా స్థలిలోనే కానిస్టేబుల్ మరణించారు. అనకాపల్లి జిల్లా న్యాయంపూడి వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందారు.
రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదాలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. గాయపడివారికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. దానికి అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.