Pawan Kalyan Comments on Pithapuram Victory : వందల కోట్లు ఖర్చు పెట్టి తనను ఓడించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాయలంలో పిఠాపురం నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమావేశమైన పవన్, పిఠాపురం పోటీ చేయడానికి గల కారణాలను వివరించారు. పిఠాపురంలో లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తానని పవన్ ధీమా వ్యక్తం చేశారు.
నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నుంచి జనసేనలో చేరికల సందర్భంగా పవన్ కీలక వ్యాఖలు చేశారు. పిఠాపురంలో కులాల ఐక్యత మొదలైందని, పిఠాపురం నుంచి పోటీ చేయాలని ఎక్కువ మంది కోరినట్లు పవన్ తెలిపారు. పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన పలువురు నాయకులు, కార్యకర్తలను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇకనుంచి పిఠాపురాన్ని నా స్వస్థలం చేసుకుంటానని తెలిపారు.
విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు పెంచుతా: 2009లో వంగా గీత పీఆర్‌పీ నుంచే గెలిచారని, వంగా గీత వైఎస్సార్సీపీని వీడి జనసేనలోకి రావాలని పవన్ కల్యాణ్ సూచించారు. పిఠాపురాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గం చేస్తానని తెలిపారు. ఇక్కడ విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు పెంచుతానని హామీ ఇచ్చారు. ఒక ఎమ్మెల్యే తలచుకుంటే అభివృద్ధి ఎలా చేయొచ్చో చూపిస్తానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పిఠాపురం నుంచి రాష్ట్ర భవిష్యత్తు మార్చేందుకు ప్రయత్నం చేస్తానని తెలిపారు. తాను సమాజాన్ని కలిపే వ్యక్తినని, విడదీసే వ్యక్తిని కాదన్నారు. వ్యవస్థపై కోపంతో ఎవరూ నోటాకు ఓటు వేయవద్దని పవన్ కల్యాణ్ సూచించారు.
పిఠాపురం నుంచి బరిలో పవన్‌కల్యాణ్ - స్వయంగా వెల్లడించిన జనసేనాని
కాకినాడ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన పవన్: టీడీపీ, బీజేపీలతో పొత్తులో భాగంగా జనసేనకు రెండు పార్లమెంట్ సీట్లతో పాటుగా 21 అసెంబ్లీ నియోజకవర్గాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థిని పవన్ కల్యాణ్ ప్రకటించారు. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని పవన్ తెలిపారు. ఉదయ్ తన కోసం ఎంతో త్యాగం చేశారని వెల్లడించారు. భారీ మెజార్టీతో ఉదయ్‌ని గెలిపించాలని కార్యకర్తలకు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.
కేవలం నా గెలుపు కోసం మాత్రమే పిఠాపురం నుంచి పోటీ చేయట్లేదు. గాజువాక, భీమవరంతో పాటుగా పిఠాపురం సైతం నాకు ముఖ్యమే. ఇక్కడి నుంచి పోటీ చేయాలని ఎక్కువగా విజ్ఞప్తులు వచ్చాయి. నన్ను అసెంబ్లీకి పంపిస్తామనే హామీ చాలా మంది ఇచ్చారు. ఇకపై పిఠాపురాన్ని నా స్వస్థలం చేసుకుంటా. ఇక్కడి నుంచే రాష్ట్ర భవిష్యత్తు మార్చేందుకు ప్రయత్నిస్తా. -పవన్ కల్యాణ్, జనసేన అధినేత
వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తలతో సీఎం జగన్ భేటీ- గ్రూపులతో ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశం