Lack Of Facilities in Ongole GGH : ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో నిత్యం వేల మంది రోగులకు చికిత్స అందించి ప్రాణాలు కాపాడాల్సిన జీజీహెచ్ సమస్యలతో సతమతమవుతోంది. దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి చికిత్స కోసం వస్తుంటారు. ప్రమాదాల్లో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారు, ప్రసవం కోసం వచ్చే గర్భిణులతో నిత్యం కిటకిటలాడుతూ ఉంటుంది. ఇలాంటి ప్రధాన ఆసుపత్రిలో సౌకర్యాల కల్పనలో మాత్రం అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. ఆస్పత్రిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా లేక రోగులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్లకు, తాగటానికి, ఇక్కడ ఉన్న వైద్య కళాశాల వసతి గృహానికి అవసరమైన నీళ్లు లేక రోగులు, సిబ్బంది, మెడికోలు ఇబ్బంది పడుతున్నారు.
ఆస్పత్రి, వైద్యకళాశాలకు కలిపి రోజువారీ ఎనిమిది లక్షల లీటర్ల నీరు అవసరమైతే ప్రస్తుతం 4 లక్షల లీటర్లు మాత్రమే అందుబాటులో ఉంది. అది కూడా పాత రిమ్స్‌లోని బోర్‌వెల్ నుంచి తీసుకుంటున్నారు. నగరపాలక సంస్థతో చేసుకున్న ఒప్పందం ప్రకారం వేసవి చెరువు నుంచి రోజువారీ అవసరాలకు 4 లక్షల లీటర్లు ఇవ్వాల్సి ఉంది. మరో మూడు లక్షల లీటర్లు పాత రిమ్స్ బోర్‌వెల్ నుంచి లభిస్తుంది. వీటితో అవసరాలు తీరతాయని అప్పట్లో అంచనా వేశారు. కానీ ఇది సాధ్యపడలేదు.
మా బాధలు పట్టవా ! - కిడ్నీ వ్యాధిగ్రస్తుల ఆవేదన - Kidney Patients Problems
చెరువు నుంచి ఆసుపత్రి వరకు వేసిన పైపులైన్ కాలదోషం పట్టినందున కొత్తది ఏర్పాటు చేయడానికి రూ. 10 లక్షలు అవసరమని అంచనా వేశారు. నిధులు లేక ఈ పనులు చేపట్టలేదు. ఆసుపత్రి లోపల అంతర్గత పైపులకు మరమ్మతులు, నీటినిల్వ ట్యాంకుల నిర్మాణం ఇతరత్రా పనులకు రూ.3 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి టెండర్లు పిలిచారు. ఇప్పటివరకు నాలుగుసార్లు పిలిచినా బిల్లులు రావనే భయంతో గుత్తేదారులెవరూ ముందుకు రావడం లేదు. భోజనాలు నిర్వహణ కూడా సక్రమంగా లేదని, నాశిరకం భోజనంతో పాటు, చాలీ చాలని భోజనం అందిస్తున్నారంటూ రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ వైద్య కళాశాల వసతి గృహాల్లో నీటి కష్టాలు - విద్యార్థులు, వైద్యుల పాట్లు
ఆసుపత్రి పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. గుత్తేదారుకు పాత బకాయిలు చెల్లించకపోవడంతో వీటి నిర్వహణపై దృష్టిపెట్టలేదు. రోగులు, గర్భిణుల సహాయకులకు సరైన సౌకర్యాలు లేవు. వీరు వరండాల్లో, నేలమీదే కూర్చుకుంటున్నారు. లిఫ్ట్‌ల్లో ఒకటే పని చేస్తుందని, మిగతా రెండు పని చేయడం లేదని తెలిపారు.
ఆసుపత్రుల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టాలని పలువురు కోరుతున్నారు. ఇప్పటికైనా నిధులు మంజూరు చేసి సమస్యలు పరిష్కిరించాలని పలువురు కోరుతున్నారు.
GGH Sanitation: పడకేసిన పారిశుద్ధ్యం.. లక్షలు పోసినా కానరాని శుభ్రత.. ఇబ్బందుల్లో రోగులు