Madanapalle Sub Collector Fire Accident Case: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ దస్త్రాల దహనం కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. తొమ్మిది రోజుల తర్వాత పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. భూదందాలు, నేరపూరిత నిర్లక్ష్యం, అవినీతి అభియోగాలపై ఇద్దరు ఆర్డీవోలు మురళి, హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ లపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. రెవెన్యూ దస్త్రాల దహనం కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఘటనపై 8 కేసులు నమోదు చేశారు.
మదనపల్లె మాజీ MLA నవాజ్ బాషాతో పాటు పలువురిపై కేసులు నమోదు చేసినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి అనుచరులు, వ్యక్తగత సహాయకుల ఇళ్లలో సోదాలు నిర్వహించి వందల సంఖ్యలో దస్త్రాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిగత సహాయకుడు శశిధర్, తుకారం ఇళ్లలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
రెవెన్యూ రికార్డుల దహనం కేసులో మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనధికార పీఏ ముని తుకారాం పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే తిరుపతిలోని ఆయన ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించి పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. పుంగనూరు నియోజకవర్గం సోమలకు చెందిన తుకారాం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేశారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తుకారాంను పెద్దిరెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా నియమించుకున్నారు.
నాలుగేళ్ల కిందట ఆయన ఉపాధ్యాయుడిగా ఉద్యోగ విరమణ చేశారు. అప్పటివరకూ పెద్దిరెడ్డి అధికారిక పీఏగా పని చేయగా రిటైర్ అయ్యాక అనధికార పీఏగా చెలామణి అవుతున్నారు. పుంగనూరు నియోజకవర్గంలో జరిగిన అక్రమాలు, అరాచకాల్లో తుకారం పాత్ర విస్మరించలేనిదని ఉద్యోగ,ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. మాజీమంత్రి అండతో తుకారం భారీగా ఆస్తులు పోగేశారని తెలుస్తోంది. పరారీలో ఉన్న ముని తుకారాంను అదుపులోకి తీసుకుని విచారిస్తే మరిన్ని అక్రమాలు వెలుగుచూసే అస్కారముందని పలువురు భావిస్తున్నారు.