TTD Srivani Offline Darshan Tickets : తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీవాణి దర్శన టికెట్ల ఆఫ్‌లైన్ కేటాయింపునకు ప్రత్యేక కౌంటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. స్థానిక గోకులం సమావేశ మందిరం వెనుక వైపు ఈ కౌంటర్‌ను టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి బుధవారం ప్రారంభించారు. ఇప్పటి వరకు ఉన్న కౌంటర్ వద్ద వర్షాకాలంలో భక్తులకు తలెత్తుతున్న ఇబ్బందులను గుర్తించి కొత్త కౌంటర్‌ను ఏర్పాటు చేసినట్లు అదనపు ఈవో వెంకయ్యచౌదరి పేర్కొన్నారు.
రోజుకు 900 టికెట్లను ఆఫ్‌లైన్ ద్వారా కేటాయిస్తున్నట్లు ఈవో వెంకయ్యచౌదరి తెలిపారు. గతంలో టికెట్ కేటాయింపునకు మూడు నుంచి నాలుగు నిమిషాలు పట్టేదని వివరించారు. ప్రస్తుతం నిమిషంలో భక్తులకు టికెట్ ఇచ్చేలా అప్లికేషన్‌లో మార్పులు చేశామన్నారు. ఐదు కౌంటర్లలో భక్తులు సులభంగా టికెట్లు కొనుక్కోవచ్చని ఆయన పేర్కొన్నారు.
Arvind Kejriwal Visited in Tirumala : మరోవైపు తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రముఖులు పెద్ద ఎత్తున వచ్చారు. త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, టీడీపీ నేత దేవినేని ఉమ స్వామి వారిని దర్శించుకున్నారు. వేకువ జామున వారు శ్రీవారి అర్చన సేవలో పాల్గొన్నారు. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దేశం సుభిక్షంగా ఉండాలని దేవుడిని ప్రార్థించినట్లు కేజ్రీవాల్ చెప్పారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించానని వివరించారు. ఈ సందర్భంగా ఆయన పిల్లలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీవారిని మంత్రి కొల్లు రవీంద్ర, సినీ గాయకుడు విజయ్ ప్రకాశ్, కర్ణాటక శృంగేరీ శారద పీఠాధిపతి విధుశేఖర స్వామిజీ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ మహాద్వారం వద్ద విధుశేఖర స్వామిజీకి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వారికి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
గత వైఎస్సార్సీపీ పాలనలో తిరుమలలో చాలా అపచారాలు జరిగాయని కొల్లు రవీంద్ర చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పవిత్రత పునరుద్ధరణ జరుగుతోందని తెలిపారు. అన్నప్రసాదాలు స్వీకరిస్తుంటే ఆత్మ సంతృప్తి కలుగుతోందని వివరించారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగావకాశాలు కలగాలని శ్రీవారిని ప్రార్థించానని కొల్లు రవీంద్ర వెల్లడించారు.