NDA MLAs on Jagan in Gautam Adani Bribery Case : వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికా న్యూయార్క్‌లో అవినీతి కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కుంభకోణంలో జగన్ సర్కారు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ విషయంపై అసెంబ్లీలో చర్చించారు.
గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ చేసిన విధ్వంసం, అవినీతిని ఇప్పటికే చర్చించామని, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠ, బ్రాండ్‌ను దెబ్బతీసేలా ప్రవర్తించారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఈ అంశాన్ని ప్రస్తావించడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితిని కల్పించారని దుయ్యబట్టారు. అమెరికా కోర్టులో వేసిన ఛార్జిషీటు కూడా తన దగ్గర ఉందన్న సీఎం అధ్యయనం చేసి ఎలాంటి చర్యలు చేపట్టాలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఖ్యాతి అంతర్జాతీయ మార్కెట్‌లో నాశనమైంది : అవినీతి అక్రమాలపై జగన్ పేరు ఇప్పుడు విదేశాలకు ఎక్కిందని, ఆయన పేరు ప్రపంచవ్యాప్తం అయిపోయిందని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు విమర్శించారు. అవినీతి మూలాలన్నీ గత ప్రభుత్వం వైపు చూపిస్తున్నాయని, రుషికొండ, గంగవరం పోర్టుల్లోనూ పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపించారు. 651 కోట్లకు గంగవరం వాటాలను ఇచ్చేయటం ఏమిటని ప్రశ్నించారు. కనీసం 2 వేల కోట్ల రూపాయల విలువైన భూములను కట్టబెట్టారని ఆరోపించారు.
జగన్ ఆంధ్రప్రదేశ్ పరువు తీశారు - అదానీ ఒప్పందాలపై సమీక్షించాలి : షర్మిల
విద్యుత్ ఒప్పందాల్లో డబ్బులు తీసుకున్నారన్న అభియోగాలు వచ్చాయని, గడచిన ఐదేళ్లలో జగన్ చేసిన కుంభకోణాలపై ఓ ప్రత్యేక మంత్రిత్వశాఖనే ఏర్పాటు చేయాలన్నారు. ఆయన అవినీతి అక్రమాలు రాష్ట్రం, దేశం పరిధి దాటి ఇప్పుడు విదేశాలకు ఎక్కిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల ఖజానా నుంచి డబ్బు దుర్వినియోగం చేసి ప్యాలస్ కట్టేసుకోవటం ఏమిటని నిలదీశారు. అమెరికాలోని దర్యాప్తు సంస్థ గతంలో జరిగిన అవితీనిని బయటపెట్టిందని, దీనిపై అన్ని చోట్లా చర్చ జరగాల్సిందే అన్నారు. ఈ అంశంపై నిశ్శబ్దంగా ఉండకూడదన్నారు. జగన్ వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖ్యాతి అంతర్జాతీయ మార్కెట్‌లో నాశనమైందని రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ అక్రమాలపై విచారణ చేయాలి : 60వేల కోట్ల రూపాయలు దోచుకుని ఈడీ కేసుల్లో ఉన్న వ్యక్తికి 1750 కోట్లు ఓ లెక్కా అని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో భారీగా దోచుకునేందుకు ప్రణాళిక చేశారని ఆరోపించారు. ఓ తెలుగువాడు నిర్వహిస్తున్న గంగవరం పోర్టును అక్రమంగా అదానీకి కట్టబెట్టారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ అవినీతిని పరాకాష్టకు చేర్చారని, ప్రభుత్వ ఖర్చుతోనే తన నివాసానికి ఇనుప బారికేడ్లు పెట్టుకున్నారని దుయ్యబట్టారు. దేశంలో అయితే కేసులు వాయిదా వేయించుకోవచ్చు కానీ అమెరికాలో కేసులు వాయిదా వేయించుకునే అవకాశం లేదని ఎద్దేవా చేశారు. జగన్ చేసిన నేరాలు, అక్రమాలపై విచారణ చేయాలని కోరుతున్నామన్నారు.
అవినీతిలో జగన్ గ్లోబల్ స్టార్ : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందాలన్నింటికీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్ని వేల కోట్ల లంచం తీసుకున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. జగన్ అవినీతిలో గ్లోబల్ స్టార్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన అవినీతి అంతర్జాతీయ స్థాయికి చేరిందని మండిపడ్డారు. సీబీఐ నుంచి ఫెడరల్ బ్యారో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ స్థాయికి ఎదిగిన జగనన్నకు అభినందలు అంటూ ఎద్దేవా చేశారు.
జగన్- అదానీల స్కామ్‌లో మీకు ఇవి తెలుసా?
వీళ్లిద్దరి బంధం చాలా కాస్ట్లీ - పోర్టుల నుంచి మీటర్ల దాకా అన్నీ అదానీకే