NDA Fans Celebrations in AP: రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో ప్రకాశం జిల్లా ఒంగోలులో కూటమి అభిమానులు కేక్ కట్ చేసి సందడి చేశారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తూ ప్రజలు కేరింతలు కొట్టారు. వివిధ రకాల వేషధారణలు, డాన్సులు వేసి అభిమానులు, కార్యకర్తలు ఆకట్టుకున్నారు. అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.
టిజి భరత్‌కు మంత్రి వర్గంలో చోటు దక్కడంతో కర్నూలులో సంబరాలు అంబరాన్నంటాయి. రైల్వే స్టేషన్ ముందు టీడీపీ నేతలు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. నెల్లూరులో ప్రజలు ప్రమాణ స్వీకారోత్సవాన్ని చూసే విధంగా అధికారులు భారీ స్క్రీన్‌ను ఏర్పాటుచేశారు. నగరంలోని పూలే బొమ్మసెంటర్, కోట మిట్ట షాదీమంజిల్‌లో టీడీపీ నాయకులు, ముస్లిం సోదరులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వేళ పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో సందడి వాతావరణం నెలకొంది. ప్రత్యేక స్క్రీన్లలో చంద్రబాబు, పవన్ ప్రమాణ స్వీకారాన్ని చూస్తూ సందడి చేశారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరిలోని యర్రదొడ్డి గంగమ్మ వద్ద 101 కొబ్బరికాయలు కొట్టి కూటమి నేతలు పూజలు చేశారు. ప్రమాణస్వీకారాన్ని తిలకించే విధంగా కదిరి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో పెద్ద తెరలను ఏర్పాటుచేశారు. కదిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నాయీబ్రహ్మాణులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా పల్లె, పట్టణం తేడా లేకుండా జనసేన నాయకులు బాణాసంచా కాల్చి కేకు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం అరటికాయలంకలో గ్రామస్థులంతా ఒకచోట చేరి బంతి భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. చంద్రబాబు మళ్లీ సీఎం కావడంతో మరలా ఉచిత ఇసుక విధానం అమల్లోకి వస్తుందని ఆశిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ప్రమాణస్వీకారాన్ని ప్రజలు ఆనందంతో తిలకించారు.