National Horse Day Special Story: పూర్వీకుల నుంచి వచ్చిన సంప్రదాయం, దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉత్సవం, ఇంటికి రాజసం ఉట్టిపడేలా కంటికి రెప్పలా వాటిని కాపాడుకుంటూ వస్తున్నారు. నాటి ఆచారాన్ని వీడకుండా, నేటికీ ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాల్లో గుర్రాల పార్వేట వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇంతకీ ఇదంతా ఇప్పుడు ఎందుకనే సందేహం కలుగుతోందా? డిసెంబర్ 13వ తేదీ శుక్రవారం అశ్వాల దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లాలో ప్రత్యేకతను చాటే ఈ సంస్కృతీ సంప్రదాయం తెలుసుకుందాం. సంవత్సరానికి ఒక్కసారి జరిగే ఈ వేడకకు గుర్రాల పోషణ, వాటి నిర్వహణ, మేత ఖర్చులు, తదితర విషయాలు తెలుసుకుందామా.
మద్దికెర ప్రాంతాన్ని పాలించిన యాదవరాజులు ప్రతి సంవత్సరం విజయదశమి రోజున గుర్రాల పార్వేట నిర్వహించడం ఆచారంగా వస్తోంది. గుర్రాల పోషణపై 3 వర్గాల వారు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. వేమనగారి, చిన్ననగరి, పెద్దనగరి, వర్గీయులు. ఇలా ఒక్కో వర్గం వారు కనీసం 4 గుర్రాలను పోషిస్తున్నారు. ఇలా మూడు వర్గాల వారి దగ్గర 12కు పైగా గుర్రాలు ఉన్నాయి. ప్రాణాలు పణంగా పెట్టి మరీ ఎంతోకాలంగా వస్తోన్న సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. గుర్రాలపై సవారీ చేసే వారు గాయపడటం, మృతిచెందడం వంటి ఘటనలూ చోటుచేసుకున్నాయి.
నెలకు 10 వేల రూపాయల ఖర్చు: గుర్రం పెంచుకునే వారికి వాటి నిర్వహణ కోసం నెలకు కనీసం 10 వేల రూపాయలకుపైగా ఖర్చవుతోంది. వాటికి మేతతో పాటు, వాటి ఆరోగ్య సంరక్షణ కోసం ఇంత మొత్తంలో వెచ్చించక తప్పదని గుర్రాలు పెంచుతున్న ఈశ్వరరాయుడు, జగదీల్‌రాయుడు, ఉద్ధండరాయుడు, రాజు తదితరులు చెబుతున్నారు.
ఒక్కటి 70 వేల రూపాయలకు పైగా: గుర్రాలను కొనుగోలు చేసే వారు వాటి లక్షణాలను పరిశీలించి కొనుగోలు చేస్తారు. దేవమాణి, మస్తకాలు, రోషమాణి తదితర లక్షణాలుంటేనే కొంటారు. తెలుపు రంగు గుర్రానికి ప్రాధాన్యం ఇస్తారు. మద్దికెరలోని యాదవ రాజు వంశీయులు మేలుజాతి గుర్రాలకే అధికంగా ప్రాధాన్యం ఇస్తున్నారు. కొనుగోలు చేసిన తరువాత వాటికి ఖర్చు అధికంగానే ఉంటుందని చెబుతున్నారు. ఒక్కో గుర్రం విలువ కనీసంగా 70 వేల రూపాయల వరకు ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, వాటిని పెంచుకునేందుకు మాత్రం వెనకాడటం లేదు. వీటి పోషణ కూడా సులభం కాదంటున్నారు. వాటి నిర్వహణ కోసం తప్పనిసరిగా ఒకరు ఉంటాలని, వాటిని నిత్యం సురక్షితంగా చూసుకోవాలని చెబుతున్నారు.
ప్రపంచంలోనే అరుదైన పొట్టి గుర్రం.. కుక్క కన్నా చిన్నగా.. ఎత్తు రెండు అడుగులే!
గుర్రాల ఆరోగ్యానికి జాగ్రత్తలు: గుర్రాలకు ప్రధాన ఆరోగ్య సమస్య కడుపు నొప్పి. కడుపు నొప్పి వస్తే తగ్గించేందుకు ఎలాంటి మందులు లేవని నిర్వాహకులు అంటున్నారు. పేగులు మెలికతిరిగి మృతి చెందే ప్రమాదం ఎక్కువ. టెటానస్ అనే బ్యాక్టీరియా కారణంగా గుర్రాలకు ప్రమాదం ఎక్కువ. అశ్వాలు గాయపడిన సమయంలో ఇది వాటికి సోకే ప్రమాదం ఉంది. గాయపడిన వెంటనే ఇంజక్షన్ వేయించకపోతే ప్రాణాంతకమే.
గ్లాండర్స్ అనే వ్యాధి కారణంగా మెడ, చర్మంపై, ఇతర చోట్ల వాపు వచ్చి అస్వస్థతకు గురవుతాయి. దీనికి అందుబాటులో ఉన్న పశువైద్యులను సంప్రదించి చికిత్స అందించాలి. గుర్రాలకు వచ్చే వ్యాధులకు మద్దికెర పశువైద్యాధికారి కృష్ణానాయక్ పలు సూచనలు, సలహాలు పాటిస్తూ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
ఆనవాయితీని వీడలేం: తమ పూర్వీకుల నుంచి వస్తున్న ఆనవాయితీ ఇది అని మద్దికెరకి చెందిన దినకర్నాయుడు తెలుపుతున్నారు. కష్టమైనా వీడలేకపోతున్నామని, ఇళ్లలోనే గుర్రాలు పెంచుతామని అంటున్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే వేడుకల్లో వీటిపై తమ కుటుంబీకులు ఊరేగింపు నిర్వహిస్తూ, పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. దీని కోసం తామే స్వయంగా ఎంతో శ్రద్ధగా గుర్రావలను పెంచుతామని, అవసరమైతే బయటి నుంచి తెచ్చుకుని పోటీల్లో పాల్గొంటున్నామని అన్నారు.
వేడుకల సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే, తమతో పాటు గుర్రాలకూ ప్రాణాపాయం ఉంటుందని అంటున్నారు. రెండు సంవత్సరాల క్రితం దసరా ఉత్సవాల్లో జరిగిన ప్రమాదంలో 2 గుర్రాలు మృత్యువాత పడ్డాయని, గత సంవత్సరం తమ కుటుంబం నుంచి ఒకరు తీవ్రంగా గాయపడి ఇప్పటికీ కోలుకోలేదని తెలిపారు. మరో ప్రమాదంలో తమ తమ్ముడి కుమారుడు మృతిచెందారని, వీటన్నింటినీ దాటుకుని ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు.
నాగలికి ఎద్దులు బదులు గుర్రాలు.. 'మహా' రైతు వెరైటీ వ్యవసాయం!