Nara Bhuvaneswari Second Day tour in Kuppam Constituency : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును మరోసారి గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు నారా భువనేశ్వరి కుప్పానికి వెళ్లారు. నాలుగురోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు కుప్పంలోని ఎన్ కోత్తపల్లి, నడుమూరు గ్రామాలలో పర్యటించారు. దీంతో భువనేశ్వరికి టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పీ.ఈ.ఏస్ మెడికల్ కళాశాలలోని గెస్ట్ హౌస్ లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలతో సమావేశం నిర్వహించారు.
విమానంలో ప్రయాణికుడికి అస్వస్థత - ప్రాణాలు కాపాడిన నారా భువనేశ్వరి - NARA BHUVANESWARI SAVED
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి 250 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంజూరు చేశారని తెలిపారు. గత ఐదేళ్లుగా పార్టీ కార్యకర్తలు కుప్పంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారని వెల్లడించారు. పార్టీ కోసం జీవితాలను త్యాగం చేశారని కొనియాడారు. ఎంతో మంది టీడీపీ కార్యకర్తలు తమ ప్రాణాలను పార్టీకోసం పణంగా పెట్టారని గుర్తుచేశారు. పార్టీకోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని భరోసా కల్పించారు. కష్టాలు ఎదుర్కొన్న కార్యకర్తలకు పార్టీ అన్ని వేళలా అండగా నిలబడుతుందన్నారు. కుప్పం ప్రజలకు ఇచ్చిన ప్రత్యేక మ్యానిఫెస్టోను చంద్రబాబు తప్పకుండా అమలు చేస్తారని భువనేశ్వరి స్పష్టం చేశారు.
దత్తత తీసుకునే గ్రామాలు ఇవే : అయితే నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం మొదటి రోజు నిన్న(మంగళవారం) గుడుపల్లెలో పర్యటించారు. గిస్కెపల్లి, పెద్దూరు, చిన్నూరు, సోమాపురం, వెంకటాపురం గ్రామాల వద్ద మహిళలు, కార్యకర్తలు నారా భువనేశ్వరికి ఘనస్వాగతం పలికారు. గజమాలలు వేసి పూల వర్షాన్ని కురిపించారు. ఎన్నికల సమయంలో కుప్పం ప్రాంతంలో ఉత్తమ మెజార్టీ సాధించిన గ్రామాన్ని దత్తత తీసుకుంటామని ఇచ్చిన హామీ మేరకు రెండు గ్రామాలను ఆమె దత్తత తీసుకోనున్నారు. గుడుపల్లె మండలంలోని కంచిబందార్లపల్లె, కుప్పం మండలం పైపాళ్యం గ్రామాలను దత్తత తీసుకొని మౌలిక వసతులు కల్పించనున్నారు.
ప్రతి ఒక్కరూ బిడ్డలతో సమానం : భువనేశ్వరి పర్యటనతో కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. "కుప్పం నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ నాకు బిడ్డలతో సమానం. వారి అభివృద్ధికి ఎంతవరకైనా పోరాడతా. కుప్పం నియోజకవర్గంలో నేను దత్తత తీసుకున్న రెండు ఊర్లతో పాటుగా మిగతా అన్ని గ్రామాలనూ అభివృద్ధి చేసేలా పనిచేస్తా" అని నారా భువనేశ్వరి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి నారా భువనేశ్వరి విస్తృతంగా ప్రచారం చేసి ఎన్నికల సమయంలో కీలక భూమిక పోషించారు. ప్రజలకు మరింత దగ్గరయ్యారు. భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో మరో రెండు రోజులు పర్యటించి ప్రజల ఇబ్బందులు తెలుసుకుని తగిన చర్యలు తీసుకోనున్నారు.
అసెంబ్లీకి చంద్రబాబు- భువనేశ్వరి ఎలా స్పందించారంటే! - Bhuvaneshwari in CBN Assembly Video