Nara Bhuvaneswari Nijam Gelavali Yatra in Anantapur District : నిజం గెలవాలి పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం అనంతపురం జిల్లాలో పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో గుండె ఆగి చనిపోయిన కార్యకర్తల ఇళ్లకు వెళ్లి పరామర్శించి వారికి ఆర్థిక సాయం అందజేశారు. ఈ పర్యటనలో భాగంగా అనంతపురం అర్బన్ 28వ డివిజన్లోని అశోక్ నగర్లో డేరంగుల వెంకటమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధితురాలు కుమారై రమాదేవికి మూడు లక్షల రూపాయల చెక్కును అందజేశారు.
భువనేశ్వరి అరకు కాఫీ రుచి ఎలా ఉంది ? - చంద్రబాబు ట్వీట్ - 'నచ్చిందంటూ' రిప్లై
Nijam Gelavali in Kalyandurgam : కళ్యాణదుర్గం మండలం ఎమ్. కొండాపురంలో నారాయణప్ప కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. అనంతరం ముద్దినాయనిపల్లి శ్రీరాములు కుటుంబానికి తమకు టీడీపీ అండగా ఉంటామని బాధిత కుటుంబానికి భరోసా కల్పించారు. తర్వాత కొత్తూరులో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వీరందరికి ఆర్థిక సాయంగా రూ. 3 లక్షల చెక్కును అందజేశారు. టీడీపీ కార్యకర్తలకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భువనేశ్వరి భరోసా ఇచ్చారు.
తమ అభిమాన నాయకుడు సతీమణి కళ్యాణదుర్గం వస్తున్నారని తెలిసిన మహిళలు, టీడీపీ కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఆమెను చూసిన ఆనందాన్ని ఎప్పుడు మర్చిపోలేమని స్పష్టం చేశారు. ఈ సందర్భంలో వారి బాధలు, కష్టాలను ఆమెతో పంచుకున్నారు. తమ బాధలను భువనేశ్వరి ఎంతో ఓపికగా విన్నారని మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.
ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించాలి: భువనేశ్వరి
కల్యాణదుర్గంలో నిజం గెలవాలి యాత్రలో పాల్గొన్న నారా భువనేశ్వరి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఎప్పుడూ అవినీతి చేయలేదు, చేయరని ఆమె స్పష్టం చేశారు. తప్పు చేయని వ్యక్తిని జైలులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుపై నమ్మకంతో రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారని, రాష్ట్ర రాజధాని ఇది అని చెప్పుకోవడానికి లేకుండా చేశారని అన్నారు. వైకాపా ప్రభుత్వం సచివాలయం సహా అన్నీ తాకట్టు పెట్టిందన్నారు. ప్రభుత్వం చేస్తున్న అప్పులన్నీ ప్రజలే కట్టాల్సి ఉంటుందని భువనేశ్వరి వివరించారు.