Nagarjuna Reaction On N Convention Demolition: మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై సినీ హీరో నాగార్జున స్పందించారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు బాధాకరమన్నారు. అధికారులు చట్టవిరుద్ధంగా చేసిన చర్యలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. ఉదయం కూల్చివేతకు ముందు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్న నాగార్జున, చట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఎలాంటి చర్యలు చేపట్టలేదని స్పష్టం చేశారు.
తమది పట్టాభూమి అని, ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదన్నారు. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై కోర్టు స్టే ఇచ్చిందని గుర్తు చేశారు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలాంటి చర్యలు చేపట్టడం సరికాదన్న నాగార్జున, తప్పుడు సమాచారంతో చట్ట విరుద్ధంగా కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
స్టే ఆర్డర్లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. మా ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుట కొరకు ఈ ప్రకటనను జారీ చేయడం సరైనదని నేను…
— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 24, 2024
తాను చట్టాన్ని గౌరవించే పౌరుడిని అని, కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే తామే కూల్చివేసేవాళ్లమన్నారు. తాజా పరిణామాలతో ప్రజలకు తప్పుడు సంకేతం వెళ్లే అవకాశం ఉందన్నారు. తాము ఆక్రమణలు చేశామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని, చట్ట విరుద్ధ చర్యలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.
Madhapur N Convention demolition by HYDRA: సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా బృందం శనివారం ఉదయం కూల్చివేసింది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య కన్వెన్షన్ కూల్చివేతను అధికారులు చేపట్టారు. తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి. మూడున్నర ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్‌ను నిర్మించారని అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో శనివారం కూల్చివేతలు చేపట్టారు.
అక్రమంగా నిర్మాణం చేపట్టారని ఆరోపణలు వస్తున్న తుమ్మిడి చెరువు 28 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో సుమారు మూడున్నర ఎకరాల భూమిని నటుడు నాగార్జున కబ్జా చేసి కట్టడాలను నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు కొద్ది రోజుల క్రితం హైడ్రాకు ఫిర్యాదు అందడంతో నిర్మాణం చేపట్టిన ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు, పలు కోణాల్లో పరిశోధించి తదనుగుణంగా చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది.
హీరో నాగార్జునకు షాకిచ్చిన 'హైడ్రా' - ఎన్ కన్వెన్షన్ కూల్చివేత - N Convention demolition by HYDRA